శ్రీచక్రమునందు ఉండునది. శ్రీచక్రము అంటే చరాచరజగత్తే కానీ వేరు కాదు.
శ్రీచక్రము - చరాచర జగత్తు
భైరవయమాళమ్ లో పరమేశ్వరుడు పార్వతికి శ్రీచక్రాన్ని గురించి ఇలా చెప్పాడు.
శ్రీచక్రంత్రిపురసుందర్యా బ్రహ్మాన్దాకారమేశ్వరీ |
పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మకమేవ చ ||
ఇంద్రియాత్మక మేవం చ మన స్తత్త్వాత్మకం తథా |
మాయాదితత్త్వరూపం చ తత్త్వాతీతం చ బైందవం ||
ఓ పార్వతీ! శ్రీచక్రమంటే సామాన్యమైనటువంటి ఒక చిన్న యంత్రం కాదు. అది ఈ బ్రహ్మాన్డం మొత్తానికి ప్రతీక. ఎలాగంటే
సృష్టికి కారణం పంచభూతాలు, తన్మాత్రలు. సృష్టి ఆరంభంలో మొదట తన్మాత్రలు ఏర్పడ్డాయి. అవే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు. ఆ తరువాత తన్మాత్రల స్థూల రూపాలైన పంచభూతాలు ఏర్పడ్డాయి. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు. ఇవన్నీ పంచీకరణం చెందాయి. ఆ తరువాత ఇవి గుణత్రయంతో కలిసాయి. అప్పుడు సృష్టి జరిగింది. అప్పుడు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం వంటి 25 తత్త్వాలతో అనేక జీవాలు ఉద్భవించాయి. సృష్టికి మూలమైన పంచభూతాలు తన్మాత్రలు శ్రీచక్రంలోనే ఉన్నాయి. అందుకే అది ఈ చరాచర జగత్తుకు ప్రతీక. శ్రీచక్రాన్ని అర్చించినట్లయితే చరాచర జగత్తును అందులోని సమస్త జీవములను అర్చించినట్లే.
పరమాత్మ ఎక్కడ ఉంటాడు అని అడిగితే సృష్టిలోని ప్రతీ అణువులోను ఉంటాడు అని సమాధానం చెప్తారు. మరి ఆ సృష్టికి ప్రతీక శ్రీచక్రం అయినప్పుడు పరమాత్మ అయిన మన అమ్మ అందులో ఉండాలి కదా. అందుకే శ్రీచక్రరాజ నిలయా అన్నారు.
శ్రీచక్రంలోని ఆవరణలు
ప్రపంచసారా సంగ్రహంలో ఇలా చెప్పారు
బిందుత్రికోణ కాష్టావతారయుగ తోకకొనవృత్తయుతం
వసుదలవృత్త కళాదళవృత్త త్రిమహీగృహం భజే చక్రం
బిందువు, త్రికోణము, అష్టకోణము, పదికోణములుగల చక్రములు రెండు, పదునాలుగుకోణములు గల చక్రము. వృత్తము, అష్టదళము, వృత్తము, షోడశదళము, వృత్తము, భూగృహము అనే ఆవరణాలున్నాయి
మొదటి ఆవరణ - భూపురము: ఇది త్రైలోక్యమోహనచక్రము. ఇందులో మూడు రేఖలున్నాయి. ఈ మూడు రేఖలు భూలోక భువర్లోక సువర్లోకాలకు ప్రతీక.
మొదటి రేఖలో అణిమాదిసిద్ధులు ఉంటాయి. అవి అణిమా, లఘిమా, గరిమా, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ప్రాప్తి, సర్వకామ
రెండవరేఖలో అష్టమాత్రుకలు ఉంటాయి. అవి బ్రహ్మి, మహేశ్వరి, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రి, చాముండా, శ్రీమహాలక్ష్మి.
మూడవరాఖలో ముద్రాశక్తులు ఉంటాయి. అవి సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశా, సర్వఖేచరీ, సర్వబీజా, సర్వయోనిహ్
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా. యోగిని పేరుప్రకటయోగిని.
రెండవ ఆవరణ - షోడశదపద్మము: ఇది సర్వాశాపరిపూరిక చక్రము. 16 దళములలోను చంద్రునియొక్క 16 కళలు ఉంటాయి. అవి కామ, బుద్ధి, అహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, చిత్త, ధైర్య, స్మ్రుతి, నామ, బీజ, ఆత్మ , అమృత, శరీర.
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశీ. యోగిని గుప్తయోగిని.
మూడవ ఆవరణ - అష్టదళము: ఇది సర్వసంక్షోభణ చక్రము. వీటిలో ఉండే దేవతలు అనంగకుసుమా, అనంగమేఖలా, అనంగమదనా , అనంగమదనాతురా, అనంగరేఖా, అనంగవేగినీ, అనంగాంకుశా, అనంగమాలినీ
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురసుందరి. యోగిని గుప్తతరయోగిని
నాలుగవ ఆవరణ - సర్వసౌభాగ్యదాయకచక్రము: ఇందులోని 14 కోణములు 14 లోకములకు ప్రతీక. ఇక్కడ ఉండే దేవతలు సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వాహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభినీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సరార్థసాధినీ, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని. యోగిని సంప్రదాయాయోగిని.
ఐదవ ఆవరణ - సర్వార్థసాధక చక్రము: దీన్ని బహిర్దశారము అంటారు. దీనిలోని పదికోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలకు ప్రతీక. ఇందులో ఉండే దేవతలు సర్వసిద్ధిప్రదా, సర్వసంపత్ప్రదా, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ, యోగిని కులోత్తీర్ణయోగిని
ఆరవ ఆవరణ - సర్వరక్షాకరచక్రము: పదికోణములు గల చక్రము. దీనిని అంతర్దశారము అంటారు. ఇది అగ్ని కళలకు ప్రతీక. ఇక్కడ ఉండే దేవతలు సర్వజ్ఞా, సర్వశక్తిహ్, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధినాశిని, సర్వాధారస్వరూప, సర్వపాపహరా, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రద
ఈ సవరణకు అధిదేవత త్రిపురమాలిని. యోగిని నిగర్భయోగిని
ఏడవ ఆవరణ - సర్వరోగహరచక్రము: అష్టకోణములలో అష్టవసువులు ఉంటారు. వారు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయ, సర్వేశ్వరీ, కౌలిని
ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర సిద్ధామ్బ. యోగిని రహస్యయోగిని
ఎనిమిదవ ఆవరణ - సర్వసిద్ధిప్రద చక్రము: త్రికోణములో త్రిపుటి అంతా ఉంటుంది. అవి త్రిగుణములు, త్రిమూర్తులు, త్రిశక్తులు, సృష్టి స్థితి లయాలు, వామజ్యేష్ఠరౌద్రి, ఇచ్ఛజ్ఞానక్రియాశక్తులు, జ్ఞాతాజ్ఞానజ్ఞేయములు, అ నుండి స వరకు 48 అక్షరములు మొదలైనవి ఉంటాయి. అసలు సృష్టి అంతా ఇక్కడ నుండే జరిగింది.
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాంబ. యోగిని అతి రహస్యయోగిని.
తొమ్మిదవ ఆవరణ - సర్వానందమయ చక్రము: బిందు రూపము. అదే పరబ్రహ్మస్వరూపము.
ఈ ఆవరణకు అధిదేవత మహాత్రిపురసుందరి. యోగిని పరాపర రహస్యయోగిని
శ్రీచక్రము - మానవ శరీరం
శ్రీచక్రంలోని వివిధ ఆవరణలను భావనోపనిషత్తులో ఇలా వర్ణించారు
మొదటి ఆవరణ: ఇందులో 3 రేఖలు
మొదటి రేఖ - నవరసాలు: శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయము, భీభత్సము, అద్భుతము, శాంతము.
రెండవ రేఖ - మనోవికారాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, పుణ్య , పాపములు
మూడవ రేఖ - ముద్రాశక్తులు: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధచక్రము, లమ్బికాగ్రము, ఆజ్ఞాచక్రము, సహస్రము, ద్వాదశాంతము.
రెండవ ఆవరణ - చంద్రకళలు: 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ భూతాలు, మనస్సు
మూడవ ఆవరణ - అష్టమూర్తులు: శరీరంలోని ఇంద్రియ ధర్మాలు. అవి వచన, దాన, గమన, విసర్గ, సంభోగ, ప్రవృత్తి, నివృత్తి, ఉపేక్ష
నాలుగవ ఆవరణ - చతుర్దశభువనాలు: మనిషి శరీరంలోని ముఖ్యమైన నాడులు. అవి అలంబుసా, కుహూ, విశ్వోదరి, వరుణా, హస్తిజిహ్వ, యశస్వని, గాంధారి, పూషా, శంఖినీ, సరస్వతీ, ఇడా, పింగళా, సుషుమ్నా.
ఐదవ ఆవరణ - బహిర్దశారము: మనిషి శరీరంలోని వాయువులు, ఉపవాయువులు. అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదయాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనుంజయ, దేవదత్తములు.
ఆరవ ఆవరణ - అగ్నికళలు: దశవాయువుల గణాలు - రేచకము, పూరకము, శోషకము, దాహకము, ప్లావకము. వివిధాన్నములు - భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పేయము.
ఏడవ ఆవరణ - అష్టవసువులు: మనిషి శరీర లక్షణాలు. అవి శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, ఇఛ్చ, సత్వగుణము, రజోగుణము, తమోగుణము.
ఎనిమిదవ ఆవరణ - త్రిశక్తులు: పాడ్యమి నుండి అమావాస్య/పూర్ణిమ వరకు గల తిథులు.
తొమ్మిదవ ఆవరణ - బిందువు: కామేశ్వరి, కామేశ్వరుల సంగమం. ఆత్మ కామేశ్వరి బుద్ధి కామేశ్వరుడు. ఈ రెండు సంగమిస్తేనే జీవన్ముక్తి.
మరొక వివరణ
బిందువు - బ్రహ్మ రంధ్రము
త్రికోణము - తలముందు భాగము
అష్టకోణము - లలాటము
అంతర్దశారము - భ్రూమధ్యము
బహిర్దశారము - కంఠము
చతుర్దశారము - హృదయము
అష్టదళము - నాభి
షోడశదళము - కటి ప్రదేశము
వృత్తత్రయము - ఊరువులు
భూపురము - పాదాలు
మానవ శరీరమే శ్రీచక్రము. అందులో ఉండేది అమ్మ. ఆహా ఇది అత్యద్భుతం. మనం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న మన అమ్మ - ఆ జగన్మాత - ఈ చరాచరజగత్తుకు అధినేత మన శరీరంలోనే ఉంది. దహరాకాశంలో దీపంలా మన పిలుపుకోసం ఎదురుచూస్తోంది. మనకన్నా వెయ్యిరెట్లు ఎక్కువ ప్రేమతో ఆర్తితో మనల్ని కౌగలించి అక్కున చేర్చుకుందామని వేచివుంది. ఆలస్యమెందుకు సోదరా/సోదరి. అమ్మని తలుచుకుంటూ జపం ప్రారంబిద్దాము. ఓం శ్రీమాత్రేనమః అనే మంత్రంతో ఈ జన్మలోనే తరిద్దాం!
సౌందర్యలహరి 11వ శ్లోకం
చతుర్భిహ్ శ్రీకంఠఐ శ్శివయువతిభిః పంచభి రపి
ప్రభిన్నాభి శ్శమ్భో ర్నవభి రపి మూలప్రకృతిభిః
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రతివలయ
త్రిరేఖాభి స్సార్థం తవ శరణకోణః పరిణతాః
తల్లీ! నాలుగు శివచక్రములతోను, ఐదు శక్తి చక్రములతోను, తొమ్మిది మూలప్రకృతులతోను, అష్టదళము, షోడశదళము, మేఖలాత్రయము, భూపురములతో 44 కోణములు కలిగి శ్రీచక్రము అలరారుతున్నది.
మన్వస్ర ద్విదశార అష్టకోణ వృత్త చతుష్టయం
అష్టావింశతి మర్మాణి చతుర్వింశతి సంధయహ్
రెండు రేఖలు కలిసిన చోటు సంధి. మూడు రేఖలు కలిసిన చోటు మర్మ స్థానం. మన్వస్రము, దశారద్వయము, అష్టకోణములందు 28 మర్మస్థానాలు, 24 సంధులు ఉంటాయి. శ్రీచక్రంలో శక్తిచక్రాలన్నీ కోణాకారంలోనే ఉంటాయి. అయితే శ్రీచక్రంలో 45 కోణాలుంటాయి. అవి త్రికోణంలో 3, అష్టకోణంలో 8, అంతర్దశారంలో 10, బహిర్దశారంలో 10, మన్వవస్రంలో 14 వెరసి 45 కోణాలు
శ్రీచక్రములోని కోణములు గురించి సాంప్రదాయ భేదములున్నవి. కావున ఉత్తమ గురువును ఆశ్రయించి వారి ద్వారా ఉపాసన చేయడం ఉత్తమం.
శ్రీచక్రమునందు బీజాక్షరాలపై కూడా సాంప్రదాయభేదం ఉన్నది. కావున ఇక్కడ కూడా ఉత్తమ గురువును ఆశ్రయించి వారి ద్వారా ఉపాసన చేయడం ఉత్తమం.
బీజాక్షరయుతం చక్రం యతీనా ముత్తమోత్తమం
బీజాక్షర విహీనంతు గృహస్థానాం ప్రశస్తకం
బీజాక్షరములున్న శ్రీచక్రం యతీశ్వరులకు ఉత్తమం. గృహస్థులకు బీజాక్షరాలు లేనిది మంచిది.
బీజం వినా తునిర్జీవం శవవ త్పరికీర్తితం
బీజహీనం తు య చ్ఛక్రం త చ్ఛక్రం సిద్ధిదమ్ న చ
బీజాక్షరములు లేని శ్రీచక్రము నిర్జీవమైనది. శవంతో సమానము. దానిమీద పూజ సిద్ధించదు.
శ్రీవిద్యార్ణవతంత్రం - శ్రీచక్రంలోని ప్రస్తారాలు
1.భూప్రస్తారము: బల్లపరుపులా ఉంటుంది. వెండి బంగారం, రాగి రేకులమీద, నేలమీద గీస్తారు.
2. మెరుప్రస్తారము: బోర్లించిన గరాటులా ఉంటుంది. ఒకదానిమీద ఒకటిగా తొమ్మిది అంతస్తులుగా ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉంటాయి.
3. కైలాసప్రాస్తారము: ఇది కూడా మేరువులాగే ఉంటుంది. కానీ ఎత్తు తక్కువ.
భూప్రస్తారం వశిన్యాది దేవతల తాదాత్మ్యం . మేరు ప్రస్తారం షోడశ నిత్యల తాదాత్మ్యం. కైలాస ప్రస్తారం మాతృకా తాదాత్మ్యం. వీటిలో అనేక రకాలున్నాయి
మేరు ప్రస్తారము: (సమ దళము) - శృంగేరీ సాంప్రదాయము: ఇది బోర్లించిన గరాటులా ఉంటుంది. ఒకదానిమీద ఒకటిగా తొమ్మిది ఆవరణలు ఉంటాయి. దళాలన్నీ సమానంగా ఉంటాయి. మూడు వృత్తాలు భూపురానికి, షోడశదళానికి మధ్యన ఉంటాయి.
మేరు ప్రస్తారము: (సమ దళము) - శ్రీ కల్యాణానంద భారతీ సాంప్రదాయము: భూపురానికి షోడశదళానికి మధ్య ఒక వృత్తము, షోడశదళానికి అష్టదళానికి మధ్య ఒకటి, అష్టదళానికి చతుర్దశారానికి మధ్యలో ఒకటి ఉంటాయి. ఇది శృంగేరీ విరూపాక్ష పీఠానికి సంబంధిచినది
మేరు ప్రస్తారము: (ఊర్ధ్వ దళము) - ఇందులో దళాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి.
మేరు ప్రస్తారము: (అధో దళము) - ఇందులో దళాలు అధో ముఖంగా ఉంటాయి.
కూర్మ ప్రస్తారము: (వైష్ణవీ సాంప్రదాయము) - కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి వీపు మీద శ్రీచక్రము ఉంటుంది.
శివకామేశ్వరము: (శైవ సాంప్రదాయము) - శివలింగము మీద శ్రీచక్రం ఉంటుంది
అర్ధమేరువు: ఇందులో భూపురము, షోడశీడలము, అష్టదళములు ఒకదానిమీద ఒకటి ఉంది ఆపైన కోణములన్ని సమతలముగా అంటాయి.
కైలాస ప్రస్తారము: ఇదికూడా మేరువులానే ఉంటుంది. పొడవు, వెడల్పు సమానంగా ఉంటాయి. ఎత్తు మాత్రం వాటిలో 1/4 వంతు మాత్రమే ఉంటుంది.