Search This Blog

817 - 818. సత్యవ్రత - సత్యరూపా

817.సత్యవ్రత - సత్యము అంటే - బ్రహ్మ. సత్యమే వ్రతముగా గలది. బ్రహ్మవ్రతమే ప్రియముగా గలది. పరబ్రహ్మసు సేవించే వ్రతాలలో యజ్ఞము శ్రేష్ఠమైనది. యజ్ఞమే విష్ణుస్వరూపమని గతంలో వివరించాం. ఆ విష్ణువు పరమేశ్వరి అంశ సంభూతుడు. యజ్ఞము పరమేశ్వరి స్వరూపము. అందుచేత పరమేశ్వరి సత్యవ్రతా అనబడుతోంది.

ఎల్లవేళల యందు పరమేశ్వరి ధ్యానము, ఉపాసన మొదలైన వాటియందు మనసును లగ్నం చెయ్యటమే బ్రహ్మోపాసన. అదే సత్యవ్రతము. దేవీ భాగవతంలో సత్యవ్రతుని కధ ఒకటుంది. పూర్వకాలంలో కోసలదేశంలో దేవదత్తుడు అనే పండితుడు ఉండేవాడు. అతనికి చాలాకాలం సంతానం లేదు. మిగిలిన పండితులతో ఆలోచించి పుత్రసంతానం కోసం తమసానదీ తీరాన యజ్ఞం చెయ్యటం ప్రారంభించాడు ఆ యజ్ఞానికి. సహోత్రుడు - బ్రహ్మ అధ్వర్యుడు - యాజ్ఞవల్క్యుడు బృహస్పతి - హోత గోబిలుడు - ఉద్గాత సమర్థులైన పండితులు - ఋత్విక్కులు ఉద్గాత అంటే యజ్ఞ సమయంలో సామవేదాన్ని పారాయణ చేసేవాడు. గోబిలుడు వేదాన్ని చక్కగా పారాయణ చేస్తున్నాడు. దేవతలు కూడా దీనికి బాగా సంతోషించారు. కాని ఒక రోజు వేదపారాయణ చేస్తుండగా ఊపిరి పట్టి స్వరం తప్పు వచ్చింది. దానికి దేవదత్తుడు కోపించి “ఓరి మూర్ఖుడా! పుత్రులకోసం నేను యజ్ఞం చేస్తుంటే నువ్వు వేదాం తప్పు చదువుతావా? దానివల్ల నాకు చెడుఫలితం రాదా?" అన్నాడు. ఆ మాటలకు కోపించిన గోబిలుడు "నాకు ఊపిరి పట్టటం వల స్వరం తప్పు వచ్చింది. అంతేకాని నేను కావాలని తప్పు చదవలేదు. అయినప్పటికీ నన్ను 'మూర్ఖుడు' అన్నావు కాబట్టి నీకు మూర్ఖుడైన కుమారుడే పుడతాడు" అన్నాడు. ఆ మాటలు విన్న దేవదత్తుడు చాలా విచారించి పుత్రులు లేకపోయినా పరవాలేదు. అంతేకాని మూర్ఖుడైనవాడు, విద్యావిహీనుడు అయిన కుమారుడు ఉండి ప్రయోజనం ఏముంటుంది. అంటూ దుఃఖించాడు. ఆ రకంగా శపించినందుకు గోబిలుడు కూడ చాలా చింతించి 'నేను తొందరపడకుండా ఉంటే బాగుండేది. సరే. ముందుగా నీకు మూర్ఖుడు పుట్టినా, పరమేశ్వరి అనుగ్రహంపల్ల తరువాత వాడు గొప్పపండితుడౌతాడు అన్నాడు. దేవదత్తుని భార్య గర్భవతి అయి మగశిశువును ప్రసవించింది. బాలుడికి ఏడు సంవత్సరాలు వయసురాగానే, ఉపనయనం చేసి, వేదం చెప్పటం మొదలు పెట్టాడు. ఎంతకాలమైనప్పటికీ బాలుడికి వేదం రాలేదుసరికదా పలకటానికి నోరు కూడా తిరగలేదు. దాంతో తోటి పిల్లలు ఎగతాళి చెయ్యటం మొదలు పెట్టారు. అది భరించలేని బాలుడు ఇంట్లోనించి వెళ్ళిపోయి గంగానదీ తీరం చేరాడు. అక్కడ తపస్సు చేద్దాము అని అతడి సంకల్పం. కాని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియదు. చిన్న పర్ణశాల నిర్మించుకుని ప్రతిరోజూ మధ్యాహ్నందాకా అందులో కదలకుండా కళ్ళుమూసుకుని కూర్చునేవాడు. అపరాహ్ణం వేళ అడవిలోకి పోయి, దొరికిన కాయో పండో తిని మళ్ళీ పర్ణశాలలో అదే స్థితిలో కూర్చునేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అయితే ఎల్లవేళలా సత్యమే చెప్పేవాడు. అందుచేత అతణ్ణి అందరూ సత్యవ్రతుడు అనేవారు. అలా చాలా రోజులు గడిచినాయి. ఒక రోజు అడవిలో వేటగాడు ఒక పందిని తరుముతూ వస్తున్నాడు. అది అరుచుకుంటూ సత్యవ్రతుడి ఆశ్రమం ప్రక్కనుంచిపోయింది. ఆ పంది చేసిన శబ్దం 'ఐం'కారంలా వినిపించింది సత్యవ్రతుడికి. దాంతో వాగ్బీజమైన ఐంకారాన్ని జపించటం మొదలుపెట్టాడు. సత్యవ్రతుడు. ఆకాశంలో అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వెడుతున్నారు. సత్యవ్రతుడి దీక్షకు మెచ్చి పాండిత్యాన్ని అనుగ్రహించింది పరమేశ్వరి. వేటగాడు పందిని తరుముకుంటూ వచ్చి సత్యవ్రతుణ్ణి చూసి పంది ఎటుపోయింది అని అడిగాడు దానికి సత్యవ్రతుడు. యా పశ్యతి న సా బ్రూతే యా బ్రూతే సా న పశ్యతి అహో | వ్యాధ | స్వకార్యార్ధిన్ ! కింపృచ్ఛపి పునఃపునః ఓ కిరాతకుడా ! నీ పని కావాలనే కోరికతో నన్ను మాటిమాటికీ అడుగుతున్నావు. చూసే కనులు మాట్లాడలేదు. మాట్లాడే నోరు చూడలేదు. కాబట్టి నేను ఏం చెప్పగలను. ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. సత్యవ్రతుడు తరువాత కాలంలో పెద్దపండితుడుగా ప్రసిద్ధి చెందారు.

818.సత్యరూపా - సత్యమే రూపముగా గలది. సత్యాన్ని రక్షించునది. అమ్మ త్రికాలములందు ఉంటుంది. త్రికాలములు అంటే భూత, భవిష్యత్ వర్తమానాలు. కాబట్టి సత్యమైనది. ఆవిడ అన్ని జీవులయందు ఉన్నది. అంతటా ఆవిడ రూపమే. కాబట్టి ఆమె 'సత్యరూపా' అనబడుతోంది.

Popular