శరీరంలో ఉన్న జీవాత్మ మాయ యొక్క ప్రభావం వల్ల తాను ఆ శరీరానికి చెందినది అని అపోహ పడుతుంది. తనను తానె ఒక శరీరానికి పరిమితం చేసుకుంటుంది. తన స్వతంత్రాన్ని స్వేచ్చ్చని కోల్పోతుంది. కానీ ఎవరైతే యోగ మార్గంలో అమ్మను చేరుకుంటారో వారికి మాయ తొలగిపోతుంది. జీవాత్మ పరమాత్మ ఒకటవుతుంది. స్వతంత్రులవుతారు.
ఇతర వస్తువుల సహాయం లేకుండానే సృష్టి కార్యక్రమం చేసేది. తనకన్న ఎక్కువవారు కాని, తనతో సమానులుగాని లేనిది.పంచకృత్యాలయందు అంటే - సృష్టి, స్థితి, లయ, తిరోదాన, అనుగ్రహములందు ఎవరి సహాయము లేకుండానే వాటిని నెరవేర్చేది.
పరమేశ్వరి అర్చనకు 64 తంత్రాలున్నాయి. అప్పుడు పరమేశ్వరి పరమేశ్వరునితో 'ఓ స్వామీ ! నా భక్తులు పండితులయి కూడా ఈ తంత్రాలమాయలో పడి అజ్ఞానులవుతున్నారు. కాబట్టి వారిని ఉద్ధరించటానికి ఏదైనా ఇంకొక తంత్రాన్ని చెప్పవలసినది' అని అడగగా పరమేశ్వరుడు శ్రీవిద్యాతంత్రము అనే స్వతంత్ర తంత్రాన్ని ఇచ్చాడు.