వర్ణముల యొక్క రూపమైనది. వేదంలో నాలుగు వర్ణాలున్నాయని చెప్పబడింది.
పురుష సూక్తంలో
బ్రాహ్మణాస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః
ఊరూతదస్య యద్వైశ్యః పద్బ్యాగ్ం శూద్రో అజాయత
పరమేశ్వరుని ముఖం నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి - క్షత్రియుడు, ఊరువుల నుంచి - వైశ్యుడు, పాదాల నుంచి - శూద్రుడు జన్మించారు.
తన బుద్ధి బలము మరియు వాక్పటిమచే ఈశ్వర విభూతి అందరికీ తెలిసేలా చెప్పేవాడు బ్రాహ్మణుడు. అతడు ధర్మ బోధ చేస్తాడు. ఇతడు ప్రధానంగా సత్వ గుణంలో ఉంటాడు. ఇతడు ప్రధమంగా జ్ఞాన వాసన కలిగి ఉంటాడు. తన భుజ పరాక్రమముతో ధర్మ సంస్థాపన చేసే వాడు క్షత్రియుడు. ఇతను ధర్మ స్థాపన కోసం తన ప్రాణాలు కూడా అర్పిస్తాడు. అధర్మానికి సహించలేడు. ఇతడు ప్రధానంగా సత్త్వరజో గుణములతో ఉంటాడు. ఇతడు కొంత జ్ఞాన వాసన కొంత లౌక్య వాసన కలిగి ఉంటాడు. శరీరంలో తొడలు రహస్యంగా ఉంటాయి. అలాగే వైశ్యుడు లోకంలో ఉన్న వ్యాపార రహస్యాలను తెలుసుకుని తద్వారా వర్తక వాణిజ్యం నడుపుతాడు. తన వ్యాపార రహస్యాలను జాగ్రత్తగా కాపాడి తన భావి తరాలకు అందిస్తాడు. ఇతనివల్ల సమాజంలో ధన ధాన్య సమృద్ధి, భోగములు కలుగుతాయి. ఇతడు సత్త్వరజస్తమో గుణములతో ఉంటాడు. ఇతడు కొంత దేహ వాసన కొంత లౌక్య వాసన కలిగి ఉంటాడు. భోగములు అనుభవించుటయే జీవిత లక్ష్యంగా కాలం గడుపుతాడు శూద్రుడు. ఇతను భృత్యుడై ఇతరుల సేవ చేస్తూ ఉంటాడు. ఇతని కాయ కష్టం వలెనే మిగిలిన మూడు వర్ణాల వారు బ్రతుకుతారు. ప్రధానంగా తమో గుణములో ఉంటాడు. ఇతడు ప్రధమంగా దేహ వాసన కలిగి ఉంటాడు.
జన్మచే అందరూ శూద్రులే. ఎందుకంటే బాలురకు ధర్మ విచక్షణ ఉండదు. ఎప్పుడూ ఆట పాటలతో సరదాగా కాలం గడుపుదామని చూస్తుంటారు. విద్యాభ్యాసమొనర్చి గురువుల వద్ద శిక్షణ పొందిన తరువాత వారివారి గుణ కర్మలను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా మారుతారు. అలా మారిన వారిని ద్విజులు అని అంటారు. వీరు ఛాతీపై జంధ్యం ధరిస్తారు.
భగవద్గీతలో
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః
గుణాల, కర్మల విభాగంచేత నాలుగు వర్ణాలను నేను సృష్టించాను అంటున్నాడు భగవానుడు.
బృహదారణ్యకోపనిషత్తు
బృహదారణ్యకోపనిషత్తులో “నామరూపాత్మకమైన సృష్టికి ఆరంభంలో పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉన్నది. అంటే విరాట్స్వరూపంలో ఉన్న అగ్ని. అదే బ్రాహ్మణరూపం. అంతవరకు క్షత్రియాది ఇతర వర్ణాలు లేవు. క్షత్రియులు లేకపోవటంవల్ల పాలనా వ్యవహారాలు కష్టమైనాయి. అప్పుడు బ్రహ్మ నేను బ్రాహ్మణుడను ఇవి నా విధులు” అని తలచి క్షత్రియుల్ని సృష్టించాడు. దేవతలలో ఇంద్రుడు, సోముడు, వరుణుడు,రుద్రుడు, మేఘుడు, యముడు మొదలైన వారంతా క్షత్రియులే ఇక్కడ ప్రజాపతి క్షత్రియుల్ని ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించాడు. వారు బ్రాహ్మణులకు రక్షకులు. క్షత్రియుల్ని సృష్టించిన తరువాత కూడా బ్రహ్మ తన పనిలో కృతకృత్యుడు కాలేకపోయాడు. ధనాన్ని కూడబెట్టేవారు లేకపోవటంవల్ల తన పనిలో సమర్ధుడు
కాలేకపోయాడు. అందుకని బ్రహ్మ వైశ్య జాతిని సృష్టించాడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు మొదలైన దేవతలను గణాలుగా సృష్టించాడు. వైశ్యులంతా గణాలుగా, సమూహాలుగా సృష్టించబడ్డారు. వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12, విశ్వేదేవతలు 13, మరుద్గణాలు 49, దేవ వైశ్యులు 93 మంది. సేవకులు లేకపోవటంవల్ల బ్రహ్మ తన పనిలో సమర్ధుడు కాలేకపోయాడు. అందుచేత శూద్రులను సృష్టించాడు. పూషుడు శూద్రుడు. భూమియే పూష, పూషా దేవతయే అందర్నీ పోషిస్తున్నది అని చెప్పబడింది.
వివరణ
1. బ్రహ్మ తేజస్సుతో ఉన్నవాడు బ్రాహ్మణుడు. సత్యాన్వేషి. బ్రహ్మదర్శనం కోసం పరితపించేవాడు. అతని ముఖం అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తుంటుంది.
2. బ్రాహ్మణులను రక్షించటానికి వచ్చినవాడు క్షత్రియుడు. రక్షణ అతని విధి. కాబట్టి పరాక్రమ సంపన్నుడు. బాహు బలం కలవాడు. బ్రహ్మ యొక్క బాహువులే ఇతని జన్మస్థానం.
3. ధనం సంపాదించటానికి, రహస్యంగా ఉంచటానికి ఆవిర్భవించినవాడు వైశ్యుడు. గుహ్యమైన స్థానం ఊరువులు. అందుచేతనే వైశ్యుడు బ్రహ్మ ఊరువుల నుంచి ఉద్భవించాడని చెప్పబడింది.
4. వీరందరినీ పోషించాలి కాబట్టి శూద్రుడు జన్మించాడు. ఇతడి కర్తవ్యం మిగిలినవారి పోషణ. అందుచేతనే ఇతను పాదాలనుంచి పుట్టాడు. ఈ రకంగా అన్ని వర్ణాలవారు పరమేశ్వరినుంచే ఉద్భవించారు. కాబట్టి ఆమె వర్ణరూపిణీ అనబడింది.