Search This Blog

01. శ్రీ మాతా

అమ్మ! 

పోతన గారి భాగవతంలో ఇలా చెప్పారు:

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్

సృష్టి అంతటికీ అమ్మ. పుట్టిన ప్రతీ జీవికి అమ్మ ఉంటుంది. ఆ అమ్మకూ అమ్మ ఉంటుంది. ఆ అమ్మమ్మకూ అమ్మ ఉంటుంది. ఆ ముత్తమ్మకూ అమ్మ ఉంటుంది. ఇలా ఎందరో అమ్మలు. ఈ అమ్మలందరిలోనూ ఉండే మాతృమూర్తే లలితమ్మ. సరస్వతి, లక్ష్మి, పార్వతిలకు కూడా ఆవిడే అమ్మ. దేవతలందరికీ అమ్మ. రాక్షసులందరికీ అమ్మ. జీవములన్నింటిలోను చైతన్యము కలిగించే అమ్మ. గ్రామ దేవతలందరికీ మనస్సులలో ఉండే అమ్మ. అటువంటి అమ్మను ఈ భాగవతం ఆంధ్రీకరించడానికి కావలసిన మహత్వము, కవిత్వము, పటుత్వము కృప చేయమని వేడుకుంటున్నాను. 

నేనుకూడా ఆ అమ్మనే ఈ లలితా సహస్రనామ రహస్యాలకు వివరణ రాయడానికి కావలిసిన, శక్తి, భక్తి, యుక్తి కృప చేయమని వేడుకుంటున్నాను. ఆవిడ గురించి రాయాలన్నా చదవాలన్నా ఆవిడ కృపయే కదా కావలసినది! 

ఎందుకంటే ఈ అమ్మ తన పిల్లల తాపత్రయాలు అన్నీ తీర్చగలదు. తాపత్రయాలు మూడు రకాలు:

1. ఆధి భౌతికము: తమ కుటుంభ సభ్యులకు సంభవించే వ్యాధుల వలన, సర్పవృశ్చికాది బాధల వలన పరితపించుట. 
2. ఆధి దైవికము: ప్రకృతి సిద్ధమైన వాటి వలన కలుగుబాధలు. అగ్ని ప్రమాదం, భూకంపము, వరదలు మొదలైన వాటివల్ల కలుగునవి. 
3. ఆధ్యాత్మికము: తన శరీరంలో పుట్టే రోగములు, అలసత్వము, కపటము, అవిశ్వాసము మొదలైన వాటి వలన కలిగే బాధలు. 

వీటన్నింటినీ శమింపచేసే అమ్మ. తన పిల్లలకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే అమ్మ. అందుకే శ్రీ మాతా!

No comments:

Post a Comment

Popular