Search This Blog

791. పరాపరా

పరా, అపరా స్వరూపము గలది.

దీన్ని గురించి ముండకోపనిషత్తులో చెప్పబడింది: శుసకుని కుమారుడు శౌనకుడు. కఠోరనియమాలతో బ్రహ్మచర్యం పాటించి విద్యాభ్యాసం పూర్తిచేశాడు. మంచి మేధావి. విద్యార్థిగా గురుకులంలో మంచి పేరు సంపాదించాడు. విద్యాభ్యాసం పూర్తయింది. ఇక గృహాస్థాశ్రమం స్వీకరించాలి. ఆ దశలో ఒకనాడు గురువుగారైన అంగిరసుణ్ణి ఈ విధంగా అడిగాడు.

“గురుదేవా ! దేన్ని గురించి తెలుసుకుంటే సర్వమూ తెలుస్తాయో దాన్ని దయచేసి నాకు వివరించండి" దానికి అంగిరసుడు - "లోకంలో తెలుసుకోదగిన విద్యలు రెండు ఉన్నాయి. 1. పరావిద్య. 2. అపరావిద్య, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలిపేది పరావిద్య. వివిధ రకముల ధర్మములు, కర్మలు, వాటి సాధన ప్రక్రియలు మొదలైన విషయాలను తెలిపేది అపరావిద్య. చతుర్వేదాలు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము ఇవన్నీ అపరావిద్య. ఇది లౌకికప్రయోజనాలకు ఉపయోగిస్తుంది. వేదాలలో యజ్ఞాదికర్మలు చెప్పబడ్డాయి. ఆ కర్మలను ఆచరిస్తే ఫలితం వస్తుంది. సంసారసుఖాలను అనుభవించటానికి కావలసిన ధనము, పలుకుబడి లభిస్తాయి. ఈ విద్య ఐహికంగా ఉన్నత స్థితులకు తీసుకుపోతుంది. ఇది ధర్మాధర్మాలు, పుణ్యపాపాలు, ప్రసంగాలతో మిళితమై ఉంటుంది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు అన్నీ అందులోని భాగాలే. ఈ చదువువల్ల జరామృత్యు భయంపోదు. ఇది కేవలం ఐహికసమున్నతికి ఒక సాధనము మాత్రమే. ప్రపంచంలో చాలామంది ధనము, కీర్తి, పదవి కావాలని కోరుకుంటారు. స్వర్గసుఖాలు కావాలి అని యజ్ఞయాగాలు చేస్తారు. ఇవి శాశ్వత సుఖాలు కావు. వీటివల్ల ఐహిక సుఖములు లభిస్తాయి తప్ప మోక్షంరాదు. ఈ సుఖాల వలన వారు విషయలంపటంలో ఇరుక్కుంటారు.

పరావిద్య వల్ల పరమాత్మానుభవం, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. శాశ్వత సుఖం లభిస్తుంది. మోక్షం సిద్ధిస్తుంది. ఈ విద్యను సాధించాలంటే విషయ వ్యామోహాలను, కీర్తి కాంక్షలను వదిలి ముక్తి మార్గంలో అచంచలదీక్షతో ముందుకు సాగాలి. మధ్యలో భ్రమించిపోకూడదు. లక్ష్యం తప్పకుండా సాధన చేస్తే బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. మోక్షానికి ఎవరూ అనర్హులు కారు. అయితే చలించకుండా స్థిరంగా ఉండే మనస్సు కావాలి. అకుంఠిత దీక్ష, పట్టుదల అత్యవసరం. ఇది చర్మచక్షువులకు గోచరించదు. ఇంద్రియాలకు అందుబాటులో ఉండదు. కరచరణాది శరీరభాగాలు లేనిది. సమస్త విశ్వము కూడా ఆత్మ యొక్క అధీనంలోనే ఉంటుంది. ఆత్మ సర్వవ్యాపకమైనది. ఈ భావాన్ని కలిగించేదే పరావిద్య. ఇదే బ్రహ్మజ్ఞానం", అని చెప్పాడు.
ఈ రకంగా పరావిద్య అపరావిద్య రెండూ ఉన్నాయి. పరమాత్మ ప్రకటీకృతం అవ్వాలని సంకల్పిస్తే అప్పుడు అందులోంచి ప్రక్రుతి వచ్చింది. ఈ ప్రకృతికి సంబంధించినదంతా అపరా విద్యే. పరమాత్మకు సంబంధించినది పరా విద్య. ఆ రెండూ అమ్మ స్వరూపమే. కొంతమందికి భోగం కావాలి, కొంతమందికి మోక్షం కావాలి. ఆవిడ జగజ్జనని. తన బిడ్డలకు ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తుంది.

ఈ రకంగా మంగళచండీవిద్య వివరించబడింది.

No comments:

Post a Comment

Popular