Search This Blog

703. సర్వగా

పరమేశ్వరికి దేశము, కాలము వంటి హద్దులులేవు. కాబట్టి ఆమె సర్వాంతర్యామి. అదే విషయాన్ని ఇక్కడ సర్వగా అని చెప్పారు. దేవీగీతలో

సర్వం దృశ్యం మమ స్థానం సర్వే కాలా ప్రతాత్మకాః |
ఉత్సవా సర్వకాలేషు యతో2 హం సర్వరూపిణీ ||


అన్నింటికీ అధిష్టానము నేనే. దేశకాల వస్తువులన్నీ నేనే. కాలములన్నింటి యందు నేనే ఉన్నాను. దేశములన్నింటి యందు నేనే ఉన్నాను. ఇంద్రియాలకు అనుభవము నా వల్లనే వస్తున్నది అని చెప్పబడింది.

దేవీ పురాణంలో దేవియే వేదము, దేవియే యజ్ఞము, దేవియే స్వర్గము, చరాచర జగత్తంతా ఆమె చేతనే వ్యాపించబడిఉన్నది. లోకంలో అన్నపానీయాలు ఆమె స్వరూపమే పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, కొండలు, బండలు అన్నీ ఆమె స్వరూపమే కాబట్టి ఆమె సర్వాంతర్యామి సర్వగా అనబడుతోంది.

ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్నే ప్రతిపాదిస్తున్నాయి. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామ జాబాలికి పరబ్రహ్మస్వరూపాన్ని గురించి వివరించి చెప్పటం జరిగింది. ఈ విశాలమైన ప్రపంచంలో నాలుగుదిక్కులూ బ్రహ్మతత్త్వంలో ఒక భాగం. భూమి, ఆకాశం, సముద్రాలు, పర్వతాలు, నదులు అన్నీ రెండవభాగం అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు అన్నీ పరబ్రహ్మలో మూడవభాగం. ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ ఇది నాల్గవభాగం.

ఉపకోశలుడికి అగ్నులు బ్రహ్మతత్త్వాన్ని వివరిస్తాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అన్నీ పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే. సూర్యునిలో ఉన్న బ్రహ్మతత్త్వం, నాలో ఉన్న బ్రహ్మతత్త్వం ఒకటే. నాలుగు దిక్కులు, నక్షత్రాలు, నేల, నీరు, నింగి వీటిలో ఉన్న బ్రహ్మతత్త్వము, నాలో ఉన్న బ్రహ్మతత్త్వము ఒకటే. ఆకాశంలోని మెరుపులో ఏ తత్త్వమైతే ఉన్నదో, అదే నాలోనూ ఉన్నది. అదే చరాచరజగత్తంతా వ్యాపించి ఉన్నది. అదే బ్రహ్మతత్త్వము.

ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతువు. విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మవిద్యను ఉపదేశం చెయ్యమని తండ్రిని అడిగాడు. తండ్రి అయిన ఉద్దాలకుడు చెబుతున్నాడు నాయనా శ్వేతకేతూ ! ఒక మర్రిపండును తీసుకునిరా అన్నాడు ఉద్దాలకుడు. మర్రిపండు తెచ్చాడు శ్వేతకేతు 'దాన్ని పగులగొట్టు' అన్నాడు తండ్రి. పగులకొట్టాడు కుమారుడు 'అక్కడ ఏం కనిపిస్తోంది ?' అడిగాడు తండ్రి. 'చిన్నచిన్న గింజలు కనిపిస్తున్నాయి' అన్నాడు శ్వేతకేతు 'ఒక గింజను తీసి పగులకొట్టు' గింజలు పగులకొట్టాడు శ్వేతకేతు. ఏముందక్కడ ?' ప్రశ్నించాడు ఉద్దాలకుడు. 'ఏమీ కనిపించటం లేదు' అన్నాడు కుమారుడు. ఇంత పెద్ద మర్రిచెట్టు శూన్యంలో నుంచి రాదుకదా ? ఆ గింజలో ఏమీలేదని చెప్పావు. కాని అందులో ఇంత పెద్దమ్రాను, కొమ్మలు, రెమ్మలతో ఉన్న ఈ చెట్టుకు కారణమై, నీకు కనిపించని జీవపదార్ధమున్నది. అదేవిధంగా, బయటకు కనిపించకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. అన్నింటికీ ఆధారమైనది, ఉండి కూడా మనకు కనిపించదు. నీకు ఒక్క విషయం చెబుతాను విను. కాస్త ఉప్పు తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలుపు. రేపు ఉదయం రా' అన్నాడు ఉద్దాలకుడు. తండ్రి చెప్పిన ప్రకారం నీళ్ళలో ఉప్పుకలిపి మర్నాడు వచ్చాడు శ్వేతకేతు. అప్పుడు ఉద్దాలకుడు. “శ్వేతకేతూ ! నిన్న నీళ్ళలో కలిపిన ఉప్పును తీసుకుని రా! " అన్నాడు. ఆ ఉప్పునీటిలో బాగా కలిసిపోయింది. దాన్ని విడదీయటం సాధ్యంకాదు. ఆ మాటే చెప్పాడు శ్వేతకేతు. “అయితే సరే ! ఆ నీళ్ళు ఒకసారి రుచిచూడు' అన్నాడు తండ్రి. 'నీళ్ళు చాలా ఉప్పుగా ఉన్నాయి' అన్నాడు కుమారుడు. 'కుమారా ! నీళ్ళలో ఉప్పు కలిసిపోయినట్లే ఆత్మ అన్ని వస్తువులలోనూ కలిసిపోయి ఉంటుంది. అది సర్వాంతర్యామి' అన్నాడు ఉద్దాలకుడు. ఈ రకంగా పరమేశ్వరుడు సర్వవ్యాపి. చరాచరజగత్తంతా ఆవరించి ఉన్నాడు. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరూ ఒకటే. కాబట్టే ఆమె సర్వగా అని చెప్పబడుతోంది.

No comments:

Post a Comment

Popular