కేనోపనిషత్తులో “ఒకసారి దేవదానవులకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఆ తరువాత వారందరూ ఒకచోట చేరి యుద్ధం ఏ రకంగా జరిగింది. తాము ఏ విధంగా విజయం సాధించాము అనే విషయాలను గాధలుగా చెబుతున్నారు. ఆ విజయానికి కారణం నేనే అని ప్రతివారూ చెబుతున్నారు.
అగ్నిదేవుడు అంటున్నాడు. “ఆ యుద్ధంలో నేను నిప్పులు కురిపిస్తుంటే రాక్షసులంతా మాడిమసి అయిపోయారు"వాయుదేవుడు అంటున్నాడు " ఆయుద్ధంలో నేను చండప్రచండగా గాలులు వీస్తుంటే రాక్షసులు ఆ గాలులకు కొట్టుకుపోయారు"
పరబ్రహ్మతత్త్వం ఈ మాటలు విన్నది. దేవతలంతా గర్వించి ఉన్నారు. వారికి జ్ఞానోదయం చెయ్యాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా వారి ఎదుట పెద్ద భూతాకారంగా ప్రత్యక్షమైంది. దాన్ని చూసి భయపడ్డారు దేవతలు. ఆ భూతం ఏమిటో వారికి అర్ధం కాలేదు. అప్పుడు వారు అగ్నిదేవుని దగ్గరకు వచ్చి, “ఓ దేవా ! నీ పరాక్రమం
వల్లనే రాక్షసులను జయించగలిగాము. ఇప్పుడు ఆ భూతం ఏమిటో కనుక్కోవలసినది అన్నారు. సరేనన్నాడు అగ్నిదేవుడు. ఆ భూతాన్ని సమీపించాడు. అప్పుడు ఆ భూతం
అగ్నిని చూసి ఎవరు నువ్వు ? అన్నది.
అగ్ని: నేను అగ్నిదేవుడను. జాతవేదుడు అంటారు నన్ను.
భూతం : నీ శక్తి ఏమిటి ?
అగ్ని: ఎటువంటి వస్తువునైనా క్షణాల్లో దహించివేస్తాను.
భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను దహించు. అంటూ ఒక గడ్డిపరకను చూపించింది. అగ్నిదేవుడు శతవిధాల ప్రయత్నించాడు. గడ్డిపరక కసికందలేదు. అవమానంతో వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోవటం తనవల్ల కాలేదన్నాడు. దేవతలంతా ఈ సారి వాయువును ప్రార్ధించారు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోమని అర్ధించారు. సరేనన్నాడు వాయువు. ఆ తత్త్వం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు
ఆ భూతం వాయువుతో అన్నది.
భూతం : ఎవరు నువ్వు ?
వాయువు : నేను వాయుదేవుడను. ఆకాశంలో చరిస్తుంటాను. అందుచేత నన్ను మాతరిశ్వుడంటారు.
భూతం : నీ గొప్పతనం ఏమిటి ?
వాయువు : ఏ వస్తువునైనా క్షణాల్లో ఎగరగొట్టగలను.
భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు.
వాయుదేవుడు తన శక్తి అంతా కూడదీసుకుని గాలులు వీచాడు. గడ్డిపరక కదలను కూడా లేదు. అవమానంతో వెళ్ళిపోయాడు వాయువు, దేవతల దగ్గరకు వెళ్ళి ఆ తత్త్వం ఏమిటో తనకు తెలియలేదు అన్నాడు. ఈ సారి దేవతలు ఇంద్రుణ్ణి వెళ్ళమన్నారు.ఇంద్రుడు బయలుదేరి ఆ తత్త్వాన్ని సమీపించాడు.
ఆ తత్త్వం మాయమైపోయింది. ఆ స్థానంలో ఉమాదేవి ఉన్నది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో అమ్మా ! ఇప్పటి దాకా ఇక్కడ ఉన్న తత్త్వం ఏమిటి ? అన్నాడు అందుకు ఉమాదేవి.
దేవేంద్రా ! అదే పరబ్రహ్మతత్త్వము. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆ తత్వానికి నాకూ తేడా లేదు. మేమిద్దరమూ ఒకటే అని చెబుతుంది. ఈ రకంగా పరబ్రహ్మను
ముందుగా దర్శించినవాడు కాబట్టే ఇంద్రుడు దేవతలకు రాజయినాడు. అగ్ని వాయువులు దిక్పాలకులయినారు అని చెప్పబడింది.
No comments:
Post a Comment