ఉకారము శివుడు. మా అంటే పార్వతి. ఉమ అంటే శివశక్తులు అని అర్ధం.
తారకాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు ఆమె వారికి ప్రత్యక్షమై నా అంశతో హిమవంతునికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమెను శివునకిచ్చి వివాహం చెయ్యండి. వారిద్దరికీ పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు అని చెబుతుంది. కొంతకాలానికి హిమవంతుని భార్య మేనక గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమైంది. సర్వకాల సర్వావస్థలయందు శివనామాన్నే జపిస్తుండేది. రానురాను తాను శివుణ్ణి తప్ప వేరెవరినీ వివాహమాడను అని తేల్చి చెప్పింది. ఆ సమయంలో శివుడు విరాగియై తపోదీక్షలో ఉన్నాడు. అతణ్ణి భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని తపస్సు చెయ్యటానికి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పుడు తల్లి అయిన మేనక కుమార్తెను వారిస్తూ ఉ - ఓయమ్మా, మా - వద్దు అన్నది. అప్పటి నుండీ ఆమెకు 'ఉమా' అనే పేరు సార్ధకమై పోయింది.
ఉత్తమమైన చిత్తవృత్తి గలది. సూతసంహితలో పరానుభూతియు, సంసార పాపములను నశింపచేయునదియు, సదాశివుని కన్న మించిన శోభనసంపద గల ఉమ అను పేరు గల అనేక విధాలయిన వైభవముగల ఉత్తమ చిత్తవృత్తికి మ్రొక్కెదను అని చెప్పబడింది.
విష్ణు శివ బ్రహ్మ వాచకములైన అకార ఉకార మకారములతో కూడిన త్రిమూర్త్యాత్మకమైన ప్రణవస్వరూపిణి. అందుచేతనే ఉమా అంటే - దేవీ ప్రణవము అని చెప్పబడినది.
లింగపురాణంలో శివుడు దేవితో “అకార ఉకార మకారములు నా ప్రణవము. ఉకార మకార అకారములు నీ ప్రణవమందు గలవు' అంటాడు.
మహావాసిష్టంలో “ఓంకార సారశక్తి గలదగుటచే ఉమ అని కీర్తించబడింది" అని చెప్పబడింది.
ఉమ అంటే చంద్రకళ. ఇది ముల్లోకాలలోను నిద్రించువారి మేల్కొనువారి హృదయాలను ప్రేరేపిస్తుంది.
శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి ఉమాకుమారి అని చెప్పబడింది. యోగుల యొక్క ఇచ్ఛకు ఉమ అని పేరు, సింధువనమున ఉండే దేవత.
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా
అన్ని జీవులయందు కాంతిరూపంలో ఉంటుంది.
ఆరు సంవత్సరాల బాలికను కూడా ఉమ అంటారు.
No comments:
Post a Comment