విజయం సాధించడానికి అన్నింటికన్నా చక్కనైన మార్గం ఒకటుంది. అది తన బలం తానెరుగుట. ప్రత్యర్థి బలహీనతను గుర్తించుట. అయితే అసలు బలం అంటే ఏమిటి. అది ఎన్ని రకాలు. వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాలు ఇక్కడ చర్చించుకుందాం. శాస్త్రీయంగా వివరించాలంటే మనకు అనేక రకమైన బలాలు ఉన్నాయి. అవి
- ఆత్మ బలం - ఇది అందరికి సమానంగా ఉంటుంది. దీనికి అంతులేదు. మనకున్న బలాలు అన్నింటిలో ఉత్తమమైనది. కానీ దీనిని పూర్తిగా సద్వినియోగ పరచుకోవడం సాధారణమైన మనుషులకు అసాధ్యం. ఏంతో గొప్ప తపోబలం ఉన్న రెషులకే అది సాధ్యమవుతుంది.
- వాసనాబలం - ఇక్కడ వాసన అనేది సంస్కృత పదం. తెలుగులో దీనిని ధోరణి అని అనవచ్చు. ఇంగ్లీషులో అయితే 'టెండెన్సీ ' అని అంటారు. ఇది మనకి జన్మతః వస్తుంది. ఇది మనకి దేవుడిచ్చిన వరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాసన ఉంటుంది. ఈ వాసన వలన మనుషులు కొన్నివిషయాలలో సహజమైన ప్రతిభ కనబరుస్తారు. ఈ వాసన మూడు రకాలు. అవి: 1. జ్ఞానవాసన 2. దేహవాసన 3. లోకవాసన. వీటిలో ఏది ఎక్కువగా ఉంటె ఆయా వాసనకు అనుగుణంగా సహజ ప్రతిభ లభిస్తుంది. ఉదాహరణకి: లోకవాసన ఎక్కువఉన్న వారు మంచి రాజకీయ వేత్తలుగానో, వ్యాపారవేత్తలుగానో అభివృద్ధి చెందుతారు. జ్ఞానవాసన ఎక్కువ ఉన్న వారు శాత్రవేత్తలు అవుతారు. ఇలా పలు రకాలుగా వాసనాబలం మనకు సహకరిస్తుంది. ఒక మంచి గేయకారుడు కావాలన్నా, మంచి యోధుడు కావాలన్నా లేదా శాస్త్రంలో చెప్పిన 64 కళలలో ఏ ఒక్క దానిలో ప్రావిణ్యం సంపాదించాలన్న ఈ వాసనా బలం చాలా అవసరం. కాబట్టి మన వాసనబలం ఏమిటో గుర్తించడంలో గెలుపు యొక్క రహస్యం ఉంది.
- దైవబలం - ఇది మనకున్న భక్తి వలన వస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది. మనము చేసే కర్మల వలన మనకు పాప పుణ్యాలు కలుగుతాయి. అవి మనచుట్టూ వలయంలా చేరి మనకు కార్య సాధనలో అవాంతరాలు కలుగజేస్తాయి. దీనిని ధురితం అంటారు. భక్తితో చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఈ విఘ్నాలను దాటగలుగుతాము.
- జాతకబలం - ఇది సమయానుకూలతను తెలుపుతుంది. హోరా శాస్త్రం అనేది పరాశర మహర్షి మనకందించిన ఓక గొప్ప వరం. అందులో మనం పుట్టిన స్థలం, సమయం బట్టి మనపై వివిధ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుపుతారు. సాధారణంగా అందరూ అనుకునేట్లు మంచి గ్రహాలు చెడ్డ గ్రహాలు ఉండవు. ఒక్కొక్క గ్రాహం ఒక్కొక్క సమయంలో ఒక్కో విధమైన ప్రభావం చూపిస్తుంది. అది మన సంకల్పానికి దోహద పడితే మంచి జరుగుతుంది. లేదంటే చిక్కులు కలుగజేస్తుంది. దుష్ప్రభావాలు కలగకుండా గ్రహ జపాలు చేసి గ్రహ దోషాలను తొలగించడం/తగ్గించడం చేయవచ్చు. ఇక్కడ గమనించవలసినదేమంటే మన సంకల్పానికి సమయానుకూలత తోడైతే తప్పక విజయం లభిస్తుంది.ఎక్కడో అంతరిక్షంలో కొన్ని కాంతి సంవత్యరాలు అవతల ఉన్న గ్రాహం ఇక్కడ నన్ను ఎలా ప్రభావితం చేస్తుంది? గంట సేపు పూజ/జపం చేస్తే ఆ ప్రభావం ఎలా మారిపోతుంది? ఇదంతా కల్పితం. ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడినవి కావు అని హేతువాదులు చేసే వాదనలు సరైనవి కావు. ఎంతో మంది యోగిపుంగవులు తమ విలువైన సమయం వెచ్చించి, గ్రహగమనాల ద్వారా తమలో కలిగే మార్పులను పరిశోధించి, చర్చించి పొందుపరచినదే హోరా శాస్త్రం. భూభ్రమణం యొక్క అక్షం (earth's axis of rotation) సౌరకక్ష యొక్క అక్షానికి 17 డిగ్రీలు వంగి ఉంటుంది అని హోరా శాస్త్రంలో చెప్పబడింది. జన్మస్థానం నుండి దూరం లెక్కించే పద్ధతిలో ఈ 17 డిగ్రీలను కలిపడం/తీసివేయడం చేస్తారు జ్యోతిష శాస్త్రవేత్తలు. అందుకే జ్యోతిష్యం కల్పితం కాదు. శశాస్త్రియం.
- బుద్ధి బలం - ఇది మనం సముపార్జించిన జ్ఞానం ద్వారా లభిస్తుంది. కీలకమైన సమయాలలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది కలగాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. శ్రద్ధ, సౌచము, కృషి, నిరాడంబరత ఉన్న చోట సాధన చక్కగా కొనసాగుతుంది. భక్తితో సాధన చేసేవారిని సరస్వతి దేవి కటాక్షిస్తుంది.
- సంఘబలం - మనచుట్టూ ఉన్నవారినుంచి మనకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎంతోకొంత సహాయం లభిస్తుంది. ఇది మన విజయ సంకల్పానికి దోహద పడుతుంది. ఉదాహరణకి: వైద్యం నేర్చుకోవాలనుకున్న విద్యార్థి మంచి వైద్యుల మధ్యన ఉంటె వారి సహాయంతో అతని చదువు మరింత వైభవంగా సాగుతుంది.
- కండబలం - ఇది ఆరోగ్యం. అన్నింటికన్నా చివరిది. అతి ముఖ్యమైనది. విజయాన్ని సాధించాలనుకునే వారు ఆరోగ్యంపై తప్పక శ్రద్ధ వహించాలి. కేవలం దేహ ధారుడ్యమే కాదు. మానసిక సంతులిత కూడా అవసరం. యోగాసనాలు, సూర్యనమసారాలు, ధ్యానం మొదలైన మంచి అలవాట్లు చేసుకోవాలి.
ఈ విధంగా అన్ని బలాన్ని తన సంకల్పానికి దోహదపడేలా చేసుకునే వారికి విజయం తప్పక సిద్ధిస్తుంది.
జై జగన్మాత
No comments:
Post a Comment