Search This Blog

535. యాకిన్యంబాస్వరూపిణీ

యశశ్వినీ అనబడే ఈ దేవత యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ యకార సంకేతముగానే ఉంటాయి. అందుకే ఆమెను యాకినీ అంటారు. యోగినీన్యాసంలో

ముండవ్యోమస్థపద్మే దశశతదళకే కర్ణికా చంద్ర సంస్థాం
రేతోనిష్ఠాం సమస్తాయుధకలితకరాం సర్వతోవక్ష పద్మాం
ఆదిక్షాంతార్ణశక్తి ప్రకటపరివృతాం సర్వవర్ణాం భవానీం
సర్వాన్నాసక్తచిత్తం పరశివరసికాం యాకినీం భావయామః ||


బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రదళపద్మమున్నది. దాని కర్ణికలో అన్నిరకాల ఆయుధాలు ధరించి అన్నివైపులకు ముఖములు కలిగి, సర్వవర్ణములతోను ప్రకాశించునది, అన్నిరకాలైన ఆహారములందు ప్రీతి కలది, శుక్లమునందు ఉండునది అయిన యాకినీ అనే దేవత ఉన్నది.

యో హమస్మి బ్రహ్మాహమస్మి | అహమస్మి బ్రహ్మాహమస్మి |
తత్త్వమసి | బ్రహ్మాహమస్మి | సోహం బ్రహ్మాహమస్మి | ఓం
బ్రహ్మా హ మస్మి | ఆత్మైవేదగ్ం సర్వం | బ్రహ్మె వేదం
సర్వం | సర్వమేతద్బహ్మ | సర్వం ఖల్విదం బ్రహ్మ |
బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి "


షట్చక్రనిరూపణంలో “ఆజ్ఞాచక్రం దాటిన తరువాత యోగి మహానాదాన్ని దర్శిస్తాడు. అతడికి వాక్సిద్ధి కలుగుతుంది. సహస్రదళము పూర్ణచంద్రునిలాగా ప్రకాశిస్తుంటుంది. దానికిరణాలు సూర్యకిరణాలవలె కాంతివంతంగా, చంద్రకిరణాలవలె చల్లగా ఉంటాయి. ఇక్కడ అకారాది సర్వవర్ణములు ఉంటాయి. ఇది కేవలము ఆనందరూపమైనది. ఇది చంద్రమండలము. ఇక్కడ వృద్ధిక్షయాలు లేనివాడు, కళంకరహితుడు అయిన చంద్రుడుంటాడు. ఈ చంద్రమండలము మధ్యన మహాశూన్యమున్నది.

తదంతః శూన్యం తత్సకల సురగణైః సేవితంచాతిగుప్తం

ఆ మహాశూన్యాన్ని దేవతలు రహస్యంగా సేవిస్తుంటారు. ఆ శూన్యము చాలా రహస్యమైనది. అతి ప్రయత్నము మీదగాని దాన్ని పొందలేరు. అక్కడే పరమేశ్వరుడుంటాడు. ఆయన సర్వాత్మరూపి. అజ్ఞానము మోహము పోగొట్టి సాధకుడికి సుధాధారలచే ఆత్మజ్ఞానం కలిగిస్తాడు. అప్పుడు సాధకుడు జీవాత్మ పరమాత్మల సమైక్యము సాధించి పరమహంస
అవుతాడు.

శివస్థానం శైవాః పరమపురుషం వైష్ణవగణాః
లపంతీతీప్రాయో హరిహరపదం కేచిదపరే |
పదం దేవ్యా దేవీచరణయుగళాం భోజరసికా
మునీనా మష్యంతే ప్రకృతి పురుషస్థాన మమలం ||


ఈ ప్రదేశాన్ని శివస్థానమని శైవులు, పరమపురుషస్థానమని వైష్ణవులు, దేవీస్థానమని శాక్తేయులు, హరిహరస్థానమని కొందరు, ప్రకృతి పురుష స్థానమని మరికొందరు అంటారు.

ఇదం స్థానంజ్ఞాత్వా నియత నిజచిత్తో నరవరౌ
న భూయత్ సంసారే పునరపి న బుద్ధఏభువనే
సమగ్రాశాక్త: స్వాన్నియమ మనసస్తస్వకృతినః
సదాకర్తుం ఖగతిరపి వాణీసువిమలా ||


ఈ స్థానాన్ని తెలుసుకున్న సాధకుడికి పునర్జన్మలేదు. ఈ లోకంలో బంధం ఉండదు. పాపపుణ్యాలుండవు. సంసారబంధనాలుండవు. ఇష్టార్ధసిద్ధి కలుగుతుంది. ఇక్కడకు చేరిన యోగికి సాయుజ్యం లభిస్తుంది.

సంతానోపనిషత్తులో

సప్తమేమాసే జీవసంయుక్తో భవతి |
అష్టమేమాసే సర్వసంపూర్ణో భవతి | నవమే జీవతి ||


ఏడవమాసంలో జీవం ఏర్పడుతుంది. పూర్వజన్మలో చేసిన కర్మతో జీవుడు ఇందులో ప్రవేశిస్తాడు. ఎనిమిదవ మాసంలో శిశువుకు అన్ని అవయవాలు పూర్తిగా ఏర్పడతాయి. తొమ్మిదవ మాసంలో జన్మ కలుగుతుంది. గర్భిణీ స్త్రీ అన్నిరకాల ఆహారాలు భుజించవచ్చును. 

No comments:

Post a Comment

Popular