Search This Blog

275.భానుమండల మధ్యస్థా

భానుమండల మధ్యే తిష్ఠతీతి
భానుమండలము మధ్యన ఉన్నది. సంధ్యాసమయంలో అమ్మను భానుమండలం మధ్యన ధ్యానించాలి అంటోది మంత్రశాస్త్రం.

య ఏషోన్తరాదిత్యే హిరణ్మయహ్ పురుషో దృశ్యత
ఆదిత్యుని మధ్యలో హిరణ్యయుడైన పరమాత్మ చూడబడతాడు.

చేతులయందు పాశము అంకుశము ధనుర్బాణములు ధరించి సూర్యమండల మధ్యవర్తి అయిన ఆ పరమేశ్వరిని అర్చించాలి. 

సూర్యమండలం చంద్రాగ్నుల మిశ్రమరూపము. అందుచేత అది పరబ్రహ్మ స్వరూపము. భానుమండలము అంటే అనాహతమండలము. అనాహతము హృదయస్థానము. 

నాభి స్తుమణి పూరాఖ్యం హృదయం చాబ్జమానాహతం
నాభిస్థానంలో మణిపూర చక్రమున్నది. హృదయస్థానంలో అనాహతపద్మమున్నది. 

పురుషసూక్తంలో 

పద్మకోశ ప్రతీకాశగ్o హృదయం చా ప్యథోముఖం
కంఠానికి క్రింద భాగంలో నాభికి పైన 12 అంగుళాల ప్రమాణంలో అధోముఖంగా ఒక పద్మమున్నది

అథో నిష్ట్యా వితస్యాంతే నాభ్యా ముపరి తిష్ఠతి
జ్వాలామాలాకులం భాతి విశ్వస్యా యతనం మహత్
సంతతగ్o శిలాభి స్తు లంబ త్యాకోశ సన్నిభం
తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః
సో గ్రభు గ్విభజం తిష్ఠ న్నాహార మజరః కవిహ్ 
తిర్య గూర్ధ్వ మాధశ్శాయీ రశ్మయస్తస్య సన్తతా

ఆ హృదయకమలాన్ని ఆశ్రయించి జ్వాలామాలాగా వెలుగొందుతూ, జీవులకు ప్రధానస్థానమై అనేక నాడీసమూహాలకు ఆలంబనమై, హృదయాగ్రభాగంలో సూక్ష్మమైన కమలం ఒకటి ఉన్నది. దానిలోనే సర్వమూ ప్రతిష్ఠితమై ఉన్నది. దాని మధ్యన అంతటాజ్వాలలు వ్యాపించు గొప్ప అగ్ని దేవుడున్నాడు. అదే జఠరాగ్ని. 

సన్తాపయతి స్వందేహా మాపాదతాలమస్తకః
తస్మ్య మధ్యే వహ్ని శిఖా ఆణియోర్ధ్వా వ్యవస్థితః

భుజించినటువంటి ఆహారాన్ని ఆ జఠరాగ్ని సమభాగాలుగా విభజించి శరీరంలోని అన్ని ప్రాంతాలకు పంపుతుంది. ఇక్కడ ధ్యానం చేసే యోగులు మహాతేజా వంతులవుతున్నారు. 

నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా
నీవారా శూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా

ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగుస్తూ ఉంటుంది. అది నీలమేఘము మధ్యన మెరుపు వలే ప్రకాశిస్తుంది. ధాన్యపుగింజ ములికివలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగిఉంటుంది. 

తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః
సబ్రహ్మా సశివ స్సహరిశ్చేంద్రహ్ సో క్షరఃపరమస్వరాట్  

ఆ అగ్నిశిఖమధ్యన పరమాత్మ ఉంటాడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు. నాశనము లేని వాడు. స్వయంప్రకాశము కలవాడు. భానుమండలము అంటే అనాహతము. అదే హృదయస్థానము. అక్కడ ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టే భానుమండల మధ్యస్థా అనబడింది. 

No comments:

Post a Comment

Popular