పరమ శివుడు త్రిమూర్తులలో ఒకరు. ఆయన లయకారుడు. ఆయన దక్షుని కుమార్తె సతిని వివాహం చేసుకున్నాడు. దక్షుడు అజ్ఞానం వల్ల శివుని యొక్క భగవత్తత్వాన్ని గ్రహించలేకపోయాడు. అతను శివుడిని కేవలం అల్లుడుగానే చూశాడు. అందుకని నిరంతరం ధ్యానమగ్నుడై ఉండే శివుడిని ఆయన అభినందించలేకపోయాడు. శివుడు సమర్థుడు కాదని భావించి, అతను నిర్వహించే ఒక గొప్ప యాగానికి దక్షుడు శివుడిని ఆహ్వానించలేదు. ఆ నోటా ఈ నోటా దక్షయజ్ఞం గురించి తెలుకున్న సతీదేవి ఆ క్రతువు చూడటానికి వెళతానని శివుడిని అభ్యర్ధించింది. పిలవని పేరంటానికి వెళ్ళుట తగదు అని శివుడు సలహా ఇచ్చాడు. అయితే శివుని సలహాకు విరుద్ధంగా సతి ఆ యాగానికి హాజరయ్యేందుకు వెళ్లింది. ఆ యాగ సమయంలో దక్ష ప్రజాపతి శివుడిని అవమానించాడు. సతి తట్టుకోలేకపోయింది. యోగాగ్నిలో దూకి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ సంఘటన శివుడిని కదలించివేసింది. వీరభద్రుని ద్వారా దక్ష యజ్ఞ వినాశనం చేసి అతను సుదీర్ఘ ధ్యానంలోకి వెళ్లిపోయాడు. సతీ పర్వత (పార్వతి) రాజు కుమార్తెగా మళ్లీ జన్మించింది. యుక్తవయస్సు వచ్చిన తరువాత, ఆమె శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. దాని కొరకై తపస్సు ప్రారంభిస్తుంది. శివపార్వతులిద్దరూ ఒకరికొరకు ఒకరు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇతర దేవతలు సుర పద్మ అనే చాలా గొప్ప శత్రువును ఎదుర్కోవలసి వస్తుంది. ఆ సురాపద్ముడు కేవలం శివపార్వతులకు జన్మించిన పుత్రుడి చేతిలోనే మరణించగలడనే వరం పొందాడు. అందువలన ఇతర దేవతలు ఎంత ప్రయత్నించినా అతనిని ఓడించలేకపోతారు. శివపార్వతులు చేస్తున్న అంతులేని తపస్సుకు దేవతలు ఆందోళన చెందుతారు. శివునికి ధ్యానభగ్నం చేసి పార్వతిని పెండ్లాడెలా చేయాలని కామదేవుడిని నియమిస్తారు. మన్మథుడు తన పుష్పబాణాలను శివునిపై ప్రయోగిస్తాడు. దానితో శివునికి ధ్యానభంగం కలుగుతుంది. ఆయన కోపంతో లేచి, మూడవ కన్ను తెరిచి, మన్మథుని బూడిద చేస్తాడు. దేవతలు మరియు మన్మథుని భార్య రతీ దేవి మన్మథుడికి తిరిగి జీవితాన్ని ఇవ్వమని శివుడిని అభ్యర్థిస్తారు. శివపార్వతుల మధ్య ప్రేమ పుట్టించి తద్వారా పుత్ర సంతానం కలిగితే అతని సహాయంతో సుర పద్ముడిని నిర్జించాలనేదే వారి సంకల్పం. కానీ అది ఇలా వికటిస్తుంది. అప్పుడు శివడు ఆ మన్మథ భస్మాన్ని తీక్షణంగా చూస్తాడు. అప్పుడు ఆ బూడిదలోంచి భండాసురుడు బయటపడ్డాడు. అతను మొత్తం ప్రపంచాన్ని నపుంసకుడిగా చేసి, శోణిత పురము అనే నగరం నుండి పరిపాలించాడు. ఈ బ్రహ్మాడం మొత్తంలో ఎవరైనా సరే పోరాటంలో భండాసురుని సవాలు చేస్తే అతను తన ప్రత్యర్థి బలంలో సగభాగం గ్రహించగలడు. అంత భయంకరమైన రాక్షసుడు వాడు. అజేయుడు. దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలు నారద మహర్షిని కోరగా, మన బ్రహ్మాండము (చిదగ్ని) వెలుపల ఉన్న అగ్నితో యజ్ఞం నిర్వహించమని సలహా ఇచ్చారు. ఆ అగ్నిలోంచి శ్రీ లలితా త్రిపుర సుందరి ఉద్భవించింది.
భండాసురుడిని చంపమని దేవతలు ఆమెను ప్రార్థించారు. ఆమె శక్తి అనంతమైనది కాబట్టి, ఆమె భండాసురుని వరం వలన ప్రభావితం కాదు. ఆమెతో పాటు అనిమ, మహిమ మొదలైన శక్తులు, బ్రహ్మి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహా లక్ష్మి, నిత్య దేవతలు మరియు శ్రీ చక్రం లోని అవరణ దేవతలు ఉన్నారు. ఏనుగుల దళానికి సంపత్కారీ దేవి నాయికగా ఉండగా, అశ్వరూడా దేవి అశ్విక దళానికి నాయికగా ఉన్నారు. గిరి చక్ర అనే రథంపై దండిని దండయాత్రను నడిపింది. ఆమె సైన్యాధ్యక్షురాలు. గేయ చక్ర అనే రథంపై మంత్రిని ఆమెకు సహాయపడింది. జ్వాలా మాలిని సైన్యం చుట్టూ అగ్ని వలయాన్ని సృష్టించి రక్షించింది. పరాశక్తి శ్రీచక్ర రథంపై మధ్యలో విహరించింది. నిత్యా దేవి బండాసురుని సైన్యంలోని పెద్ద భాగాన్ని నాశనం చేసింది. బాలా దేవి బండాసురుని కుమారుడిని చంపింది. మంత్రిని మరియు దండిని అతని సోదరులైన విషంగ, విశుక్రులను సంహరించారు. అసురులు ముందుకు దూసుకెళ్తున్న సైన్యానికి దిగ్బంధనం (జయ విఘ్న యంత్రం) సృష్టించినప్పుడు, శ్రీ లలితా త్రిపుర సుందరి ఆ దిగ్బంధనాన్ని తొలగించడానికి కామేశ్వరుని సహాయంతో గణేశుడిని సృష్టించింది. అప్పుడు బండాసురుడు హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, రావణుడు అనే అసురులను సృష్టించాడు. లలితా దేవి విష్ణువు యొక్క పది అవతారాలను సృష్టించి వారిని నాశనం చేసింది. ఆమె పాశుపతాస్త్రం ఉపయోగించి అతని సైన్యం మొత్తాన్ని చంపింది. కామేశ్వరాస్త్రంతో భండాసురుడిని చంపింది. అప్పుడు దేవతలు లలితా త్రిపురసుందరిని స్తుతించారు. ఆ తర్వాత ఆమె లోకహితం కోసం మన్మథున్ని పునర్జీవితం చేసింది. లలితా సహస్ర నామంలోని మొదటి 34 శ్లోకాలలో మొదటి 84 పేర్లలో ఈ కథ వివరించబడింది.
No comments:
Post a Comment