Search This Blog

905. బైందవాసనా



కనుబొమ్మల మీద వృత్తాకారంలో ఉండేది బైందవము, అది ఆసనముగా గలది.

స్వచ్ఛంద తంత్రంలో హకినీ మండలా దూర్థ్వం బిందురూపంతు వర్తులమ్ హాకినీ మండలానికి పైభాగాన బిందువు వర్తులాకారమైనది అని చెప్పబడింది. ఆక్కడ శివుడుంటాడు. అతడికి వామభాగే సమాసీనా శాంత్యతీతా మనోన్మనీ ఎడమవైపున ఆసీనురాలై శాంత్యతీత, మనోన్మని ఉంటుంది. అదే సర్వానంద మయమైన బిందుచక్రము. బిందువుల సమూహమే బైందవము. అది ఆసనముగా గలది.

జ్ఞానార్ణవతంత్రంలో
బిందువ్యూహం ప్రవక్ష్యామి బీజరూపం వరాననే ! హ కారం బిందురూపేణ బ్రహ్మాణం విద్ధి పార్వతి ! స కారం బిందుసర్గాభ్యాం హరిశ్చాహం సురేశ్వరి ! అవినాభావ సంబంధో లోకే హరిహరావితి || ఓ శ్రేష్ఠురాలా ! పార్వతీ ! బీజరూపమైనటువంటి బిందువ్యూహాన్ని గురించి చెబుతాను వినవలసినది. బిందువుతో కూడిన హకారము బ్రహ్మ విసర్గతో కూడిన సకారము నేను (శివుడు) హరి. లోకమందు హరిహరులు అవినాభావ సంబంధులు. ఈ రకంగా మూడు బిందువుల కలయికయే త్రిపుర అని చెప్పబడింది. ఆ బిందువు పైన ఉండే త్రిపురవాసినియే బైందవాసనా అనబడుతుంది.

వామాదిత్రయము, ఇచ్ఛాదిత్రయము, జాగ్రదాదిత్రయము. ఇదంతా బిందురూపమే. అటువంటి బిందుత్రయంతో కూడినదే త్రిపుర. శ్రీచక్రానికి కారణం బిందువు. ఆ బిందువును ఆసనంగా గలది. కాబట్టి బైందవాసనా.


మానవశరీరంలో సహస్రారమందు పరమేశ్వరి ఉంటుంది. అదే బిందుస్థానము. అందుచేతనే దేవి బైందవాసనా అనబడుతోంది.

బ్రహ్మరంద్రో మహాస్థానే వర్తతే సతతం శివా | చిచ్ఛక్తిః పరమాదేవీ మధ్యమే సుప్రతిష్ఠితా బ్రహ్మరంధ్రంలో పరమేశ్వరుడు ఉంటాడు. చిచ్ఛక్తి అయినటువంటి పరమేశ్వరి కూడా ఆ బ్రహ్మ రంధ్రమందే ఉంటుంది. అదే బిందువు. బిందువునందు ఉంటుంది కాబట్టే ఆమె బైందవాసనా అనబడుతోంది.

No comments:

Post a Comment

Popular