Search This Blog

870. అంతర్ముఖ సమారాధ్యా

 


పూజ రెండు విధాలు 1. బాహ్యపూజ 2. అంతఃపూజ
బాహ్యపూజ అంటే షోడశ ఉపచారాలు, చతుషష్టి ఉపచారాలతో పరమేశ్వరిని పూజించటం.
అంతఃపూజ అంటే మన శరీరంలోనే దేవతని అర్చించటం. 

అంతఃపూజ భావనోపనిషత్తులో వివరించబడింది. బాహ్యమైన వస్తువులన్నీ విషయ వాంఛలకు ప్రతీకలు. కాబట్టి వాటిని వదలి పెట్టెయ్యాలి. శరీరంలో ఉండే వస్తువులచేతనే పూజ జరగాలి. 

“సలిలమితి సౌహిత్యకరణం సత్త్వమ్”
పూజకు ముఖ్యమైనది జలము. సాధకుని శరీరంలో సత్వరజస్తమో గుణాలున్నాయి. వీటిలో మొదటి దానిని పెంపొందించి, మిగిలిన రెండింటినీ తగ్గించాలి. సత్వగుణమే జలము.

“కర్తవ్య మకర్తవ్య మౌదాసీన్యమితి వివేక భావనాయుక్త ఉపచారః”
ఉపచారాలు : బాహ్యపూజలో దేవికి రాజోపచారాలు, దేహోపచారాలు, మంత్రోపచారాలు అని వివిధరకాలైన ఉపచారాలున్నాయి. అయితే అంతఃపూజలో ఉపచారము అంటే నిత్యము కాని వాటిని వదలివేయటము. బ్రహ్మపదార్ధమే సత్యము అని తలచి మిగిలినవి వదలివేయాలి. ఉదాసీనభావము తూష్ణీంభావంగా రూపొందకూడదు. అంటే జ్ఞానముతో ఇది అసత్తు అని తెలుసుకుంటూ విషయాలను వదిలిపెట్టాలి. ఇదే అంతఃపూజలో ప్రధానమైన ఉపచారము.

“అస్తి నాస్తితి కర్తవ్యతా అనుపచారః”
అనుపచారాలు : బ్రహ్మము ఒక్కటే సత్యము, నిత్యము. అది కనిపించనంత మాత్రము చేత లేదు. అనుకోరాదు. సర్వజీవరాశులయందు పరబ్రహ్మమున్నది. అంతేకాని బ్రహ్మము లేదనుకోవటము అపచారము తెలియనితనము. అపరాధము. ఇదే అనుపచారము చేయకూడనిది. 

“బాహ్యాంతఃకరణానాం రూపగ్రహణ యోగ్యతాస్తీ త్యావాహనమ్”
ఆవాహన : దేహంలో బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు ఉన్నాయి. ఆత్మ అనేది ఈ ఇంద్రియాల ద్వారానే ప్రకాశిస్తోంది. కాబట్టి వాటి యొక్క దేవతారూపాన్ని ఆవాహన చెయ్యటమే దేవిని ఆవాహన చెయ్యటము.

“తస్యబాహ్యాంతఃకరణానామేకరూప విషయ గ్రహణమాననమ్”
ఆసనము : శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే పద్నాలుగు విభిన్నమైన ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను అరికట్టి సర్వము బ్రహ్మపదార్ధము అని భావించటమే ఆసన సమర్పణ.

“రక్త శుక్ల పదైకీకరణం పాద్యమ్"
పాద్యము : అంటే కాళ్ళు కడుక్కునే నీరు. 
శరీరంలో ప్రకాశాంశ మరియు విమర్శాంశ ఉంటాయి. ఈ రెండూ బ్రహ్మమునుండే వచ్చాయి కనుక వాటికి భేదం లేదు అని భావించడమే పాద్యము. 
వివరణ
అమ్మ సాధకుడి శరీరంలో ద్వాదశాంతంలో ఉన్నది. బ్రహ్మము (ప్రకాశశక్తి) ఆత్మశక్తిలో ప్రవేశించి శుక్లబిందువయింది. విమర్శశక్తి శుక్లబిందువులో ప్రవేశించి రక్తబిందువయింది. ఈ రెండింటి కలయిక వలన మిశ్రమ బిందువు ఏర్పడింది. 

రక్తబిందువు - చంద్రుడు
శుక్లబిందువు - అగ్ని
మిశ్రమబిందువు - సూర్యుడు

మిశ్రమ బిందువు నుంచి నాదము, దాని నుంచి కళలు ఆవిర్భవించాయి. ఇప్పుడు మిశ్రమ బిందుస్వరూపమైన కామేశ్వరీద్వంద్వము యొక్క కుడికాలు - శుక్లవర్ణమైన ప్రకాశాంశము
ఎడమకాలు - రక్తవర్ణమైన విమర్శాంశము. ఈ రెండు పాదాలనూ ధ్యానిస్తూ, వాటికి భేదము లేదు అనుకోవటమే పాద్యము

“ఉజ్జ్వల దామోదానుసంధానమర్ఘ్యమ్”
ఆర్ఘ్యము అంటే చేతులు కడుక్కునే నీరు. పూజకు ఉపక్రమించే ముందు దేవుడికి నీరు సమర్పిస్తారు. వాటితో ఆయన చేతులు కడుక్కుని తరువాత తాగుతారు. అంటే శ్రమ తీరటానికి ఇచ్చే అల్పాహారం అంటే త్రాగేందుకు ఇచ్చే నీరు. అంతఃపూజలో ఆత్మయే శ్రీదేవి అని గ్రహించి బ్రహ్మానందానుసంధానము చెయ్యటమే ఆర్ఘ్యప్రదానము

“స్వచ్ఛం స్వతస్సిద్ధ మిత్యాచమనీయమ్”
ఆచమనము : ఆచమనము అంటే మంత్రపూర్వకంగా నోటిలోకి తీసుకునే నీరు. అంతః శుద్ధి కోసం ఆచమనం చేస్తారు. ఆత్మ స్వరూపమైన అమ్మ స్వచ్ఛమైనది. ఆ స్వచ్ఛత స్వయంసిద్ధమైనది అని గ్రహించుట అంతఃపుజలో ఆచమనము

“చిచ్ఛంద్రమయీ సర్వాంగప్రవణంస్నానమ్”
స్నానము : బాహ్యపూజలో దేవతకు పంచామృత స్నానము చేయిస్తారు. కాని అంతః పూజలో అది లేదు. కుండలినీశక్తి ఆధారచక్రంలో నిద్రిస్తూ ఉంటుంది. సాధకుడు ప్రాణాయామంచేసి కుండలినీ శక్తిని గనక నిద్రలేపినట్లైతే, అది షట్చక్రాలగుండా ప్రయాణించి గ్రంథిత్రయాన్ని భేదించి సహస్రారంచేరి తననోటితో సహస్రదళ పద్మాన్ని కరిచి పట్టుకుంటుంది. అప్పుడు సహస్రారము అనే చంద్రమండలం నుండి అమృతధారలు స్రవించి శరీరంలోని డెభై రెండువేల నాడీమండలాన్నీ తడుపుతాయి. ఈ రకంగా అమృతవర్షము కురిపించటమే ఆత్మదేవత (పరదేవత)కు స్నానము. ఈ అమృతవర్షము వలన శరీరము సమశీతోష్ణమవుతుంది.

“చిదగ్ని స్వరూప పరమానందశక్తిస్ఫురణం వస్త్రం”
వస్త్రము అంటే శరీరాచ్ఛాదనకు ఉపయోగించేది. సాధకుని శరీరంలోని కాంతి అంతా ఆ పరాశక్తి యొక్క తేజస్సే. ఈ విషయం తెలిసి బ్రహ్మానందము పొందుటమే వస్త్ర ప్రదానము

“ప్రత్యేకగ్ం సప్తవింశతిథా భిన్నత్వేనేచ్ఛాజ్ఞాన క్రియాత్మక బ్రహ్మ గ్రంథి మద్రసతంతు బ్రహ్మనాడీ బ్రహ్మసూత్రమ్”
యజ్ఞోపవీతము : దీన్నే బ్రహ్మసూత్రము అంటారు.
జగత్తు అంతా బ్రహ్మమయమని సూత్రము కాబట్టి ఇది బ్రహ్మసూత్రము. దేహంలో ఉండేనాడులలో సుషుమ్నానాడి ముఖ్యమైనది దీన్నే బ్రహ్మనాడి అంటారు. అంతఃపూజలో ఈ సుషుమ్నానాడినే
బ్రహ్మసూత్రము అని భావించాలి. గాయత్రీ మంత్రానికి ప్రతీక యజ్ఞోపవీతము. తొంభై ఆరు బెత్తలు ప్రమాణంకల సూత్రము (దారము) తయారుచేసి దాన్ని మూడుచుట్లు చుట్టాలి. ఇప్పుడు రెండు చివరలుకలిపి ముడివెయ్యాలి. ఇందులోని సూత్రములో మూడు పోగులుంటాయి. అంటే మొత్తం ఇరవై ఏడు పోగులు ఉంటాయి.
తొంభై ఆరు బెత్తలు ప్రమాణము తత్త్వములు. మూడు ఆవృతులు - త్రిగుణములు మూడు ముడులు - మూడుగ్రంథులు మూడు గ్రంథులు - బ్రహ్మముడి ఇరవైఏడు పోగులు - ఇరవై ఏడు భేదములు కల జగత్తు

బ్రాహ్మణులు యజ్ఞోపవీతాన్ని ధరించి కర్మలుచేస్తారు. యజ్ఞోపవీతాన్ని తీసివేయట మంటే సన్యాసం స్వీకరించటము. అట్టి సన్యాసి బ్రహ్మకాండను చేసేవాడు. సర్వకర్మ విముక్తుడు జీవన్ముక్తుడు. సుషుమ్నానాడిలో సూక్ష్మనాడులు కలిసే చోటును గ్రంథి అంటారు. అది ఇరవై ఏడు సూక్ష్మనాడుల సమూహము. అందుకనే సుషుమ్నానాడి యజోపవీతము కంటె సత్యమైనది. సహజమైనది. ఇదే కంఠసూత్రము.

“స్వవ్యతిరిక్తవస్తు సంగరహిత స్మరణం విభూషణమ్” ఆభరణాలు : దేవతకు కంఠసూత్రంతో పాటుగా వివిధ ఆభరణాలు సమర్పించాలి. సాధకుడు తానుకూడా పరబ్రహ్మస్వరూపమే అని,మాయా మోహంచేత తాను మనిషిగా ఉన్నానని గ్రహించి మాయాది వస్తువులతో తనకు సంబంధము లేదు అని వాటిని పరిత్యజించటమే దేవికి ఆభరణాలు అర్పించటము. “సత్సంగపరిపూతా మన్మరణంగంధః" గంధము : దేహానికి గంధము రాసుకోవటంచేత సువాసన రావటమే కాకుండా పవిత్రత కూడా వస్తుంది. సాధకుడి సహస్రారంలో ఆ పరాశక్తి ఉన్నది, దాని కాంతిచేతనే అతని శరీరము తేజస్సుతో ప్రకాశిస్తుందని ముందే చెప్పటం జరిగింది. ఈ రకంగా జరగటంచేత సాధకుడు తాను ఎప్పుడూ పవిత్రుడనే అనే భావం కలిగి ఉంటాడు. ఇదే దేవికి శ్రీచందనం సమర్పణ. “సమస్త విషయాణాం మననం ఛైర్యేణానుసంధానం కుసుమమ్ అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః, దయాక్షమాజ్ఞానపుష్పం పంచపుష్పం తతఃపరం” పూజ: భగవంతుణ్ణి భక్తుడు నానావిధ పుష్పాలతో పూజిస్తాడు. ఇంద్రియవాంఛలకు లోనుగాకుండా, మనసును పరబ్రహ్మమందు లయం చేసి, సర్వము బ్రహ్మమయమని తెలుసుకోవటమే పుష్పపూజ. అహింస, ఇంద్రియనిగ్రహము, దయ, క్షమ, జ్ఞానము అనేవి పంచపుష్పాలు. సాధకుడు అరిషడ్వర్గాలు జయించి, అహంకారమనే పుష్పంతో దేవిని పూజించాలి. అంటే ఈ స్థితిలో నేను, అనే అహంకారాన్ని, నాది అనే భ్రాంతిని వదలివెయ్యాలి. “తేషా మేవ సర్వదాస్వీకరణం ధూపః” ధూపం : సాధకుడు ఇంద్రియచాపల్యానికి లోనుగాకుండా, ఇంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకోవటమే ధూపము. “పవనావచ్చిన్నోర్ధ్య జ్వలన వచ్చిదుల్కాకాశదేహో దీపః” దీపం : బ్రహ్మతేజస్సు వాయువుతో కలసి జ్వాలగా ప్రకాశిస్తుంది. అది విశ్వమంతా వ్యాపించి ఉంది. సాధకుడి శరీరము పరబ్రహ్మము యొక్క కాంతి పుంజములతో ప్రకాశిస్తోంది. ఇప్పుడు సాధకుడు ఆకాశాన్నే తన శరీరంగా భావించి, తన శరీరంలో ఉన్న ఆ పరాశక్తిని చిత్కలను దీపముగా భావించటమే దేవికి దీపసమర్పణ. “సమస్తయాతాయాత వర్ణనం నైవేద్యమ్” నైవేద్యము : పూజానంతరము నైవేద్యము చెయ్యాలి. ఇంద్రియ చాంచల్యము లేకుండా అంటే ఇంద్రియాలను జయించి బ్రహ్మాకార వృత్తితో ఉండటమే నైవేద్యము. ఇది బ్రహ్మానందానుభవము. “అవస్థాత్రయైకీకరణం తాంబూలమ్” ” తాంబూలము : ఆకు వక్క సున్నము కలిస్తే తాంబూలము అవుతుంది. అవే జాగ్ర స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలు. ఆ మూడు అవస్థలను తురీయావస్థలో విలీనం చెయ్యటమే తాంబూల సమర్పణ.
"మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం, బ్రహ్మరంధ్రాదిమూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యమ్” ప్రదక్షిణము : శరీరంలో ప్రాణవాయువు ఆధారచక్రం నుండి సహస్రారము వరకు, సహస్రారం నుంచి ఆధారచక్రం వరకుసుషుమ్నా మార్గంగుండా తిరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రాణవాయువు సంచారము చెయ్యటమే ఆత్మరూపంలో ఉన్న దేవతకు ప్రదక్షణము. దీనికే అజపారూప హంస అని పేరు. హకారసంజ్ఞ గల పరమాత్మ సకార సంజ్ఞగల ప్రకృతితో కలసి హంసరూపమైన శబల బ్రహ్మము అవుతాడు. ఈ శబలబ్రహ్మము తొమ్మిది ద్వారాలు గల మానవశరీరము అనే పట్టణంలో ప్రవేశించి ఇంద్రియములు, ప్రాణములు, మనస్సుతో కూడిన వాడై పంజరంలో బంధించబడిన పక్షిలాగా బయటకు వచ్చే ఉపాయం తెలియక ప్రాపంచిక బంధనాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అటువంటి హంస అనబడే జీవుడికి, అగ్ని, చంద్రమండలాలు - రెక్కలు ఓంకారము - శిరస్సు జ్ఞాననేత్రము - ముఖము హకారసకారములు - పాదాలు

మీరు ధ్యానము చేసేటప్పుడు శ్వాసను నియమిస్తారు. తద్వారా శబళ బ్రహ్మకు శక్తి వచ్చి నడక మొదలు పెడతాడు. భృకుటిపై దృష్టి సారించి ఓంకార జపం చేసినప్పుడు వాయువు కదలిక మారుతుంది. అప్పుడు అతనికి ఎగరడానికి రెక్కలు వస్తాయి. అప్పుడు తానూ చెక్కుకుపియిన శరీరం నుంచి బయటకు ఎగిరిపోతాడు. (హకారము రుద్రబీజము సకారము శక్తి బీజము) ఈ రకంగా ఉన్న హంస అనే జీవుడు పాలలో ఉన్న నెయ్యిలాగా సమస్త ప్రాణికోటినీ ఆశ్రయించి ఉన్నాడు. సహస్రారము అనేది ఎనిమిది దళాలు కలిగిన పద్మము. ఇందులోని ఒక్కొక్క దళంలోనూ చిన్నచిన్న రేకులు నూటఇరవై అయిదు చొప్పున ఉంటాయి. ఈ రకంగా మొత్తం వెయ్యి దళాలుంటాయి. అందుకే దాన్ని సహస్రదళ కమలం అంటారు. ఎనిమిది దళాలు ఎనిమిది దిక్కులకు తిరిగి ఉంటాయి. ఈ ఎనిమిది దళాల వివరాలు ఈ విధంగా ఉంటాయి. తూర్పు దిక్కు - సద్భుద్ధి ఆగ్నేయం - నిద్ర, దప్పిక, ఆలస్యము దక్షిణము - క్రూరబుద్ధి నైరుతి - తాపబుద్ధి పడమర - విలాసము వాయువ్యము - నడచుట మొ || విషయములందు బుద్ధి ఉత్తరము - సురతము నందు ఆసక్తి ఈశాన్యము - ద్రవ్యము దానంచేసే తలంపు పద్మాంతరాళంలో - ఇహపరలోక విముక్తి కింజల్కము (తామరపువ్వులోని కేసరములు) -మెలకువ తామర దుద్దు - కల దుంప - నిద్ర ఆత్మ ఏ క్షణానైతే సహస్రారాన్ని వదులుతుందో ఆక్షణంలోనే పరబ్రహ్మలో ఐక్యమవుతుంది. “తురీయావస్థా నమస్కారః” నమస్కారము : దేవికి నమస్కారము చెయ్యటమంటే సాధకుడు తురీయావస్థ చేరటమే.

“దేహశూన్య ప్రమాతృతా నిమజ్జనం బలిహరణమ్” బలిహరణము : సాధకుడి స్థూలశరీరము మాయతో కూడుకున్నది. సూక్ష్మశరీరము జ్ఞాన స్వరూపము తాను జ్ఞానస్వరూపుడు కాబట్టి జీవాత్మను పరమాత్మయందు విలీనం చేసినట్లు భావించటమే బలిసమర్పణ. “సత్యమస్తికర్తవ్య మకర్తవ్య మౌదాసీన్య విత్యాత్మ విలాపనగ్ం హోమః" హోమము : పూజ, జపము అయిన తరువాత హోమము చేయటం విధి. సాధకుడి అహంభావము, జీవభావము, పరబ్రహ్మ స్వరూపం ఉంది, లేదు అనే ద్వైదీభావము మొదలైనవన్నీ పరబ్రహ్మమనే అగ్నిలో విలీనము అనే ఆహుతి చేయటమే హోమము. “స్వయం తత్పాదుకా నిమజ్జనం పరిపూర్ణధ్యానమ్” ధ్యానము : సాధకుడు తాను ఆ దేవి యొక్క పాదముల నుండి వచ్చే తేజస్సులో లీనమయినట్లుగా తలచి, తానుకూడా ఆ తేజస్సులో ఒక భాగమేనని, సర్వము పరబ్రహ్మమమయని భావించటమే పరిపూర్ణ ధ్యానము. “ఏవం ముహూర్తత్రయం భావనయా యుక్తో భవతి, తస్య దేవతాత్మైక్యసిద్ధిః" బ్రహ్మత్వసిద్ధి : ఈ విధంగా తనను తాను పరబ్రహ్మ స్వరూపంగా భావించి మూడు ముహూర్తముల కాలము దేవియందు మనసును లగ్నం చేసినవాడు ఆ దేవితో ఐక్యత పొందుతాడు. దీనినే బ్రహ్మత్వం సిద్ధించటం అంటారు. 1 ముహూర్తం అంటే 48 నిమిషాలు. 3 ముహుర్తాలు అంటే 1 గంటా 20 నిముషాలు. “చించితకార్యాణ్యయత్నేన సిధ్యంతి స ఏవ శివయోగీతి కథ్యత ఇత్యుపనిషత్” ఫలము : ఈ విధంగా అంతఃపూజ చేసి సిద్ధుడైన సాధకుడికి కోరిన కోరికలు అప్రయత్నంగా నెరవేరతాయి. అతడినే శివయోగి అంటారు అని ఈ ఉపనిషత్తులో చెప్పబడింది.

No comments:

Post a Comment

Popular