Search This Blog

428. పంచకోశాంతరస్థితా

కోశము అంటే , వర అని అర్ధం.
మానవ శరీరంలో ఐదుకోశాలున్నాయి. అవే
1. అన్నమయకోశము, 2. ప్రాణమయకోశము, 3.ఆనందమయకోశము, 4.మనోమయకోశము, 5.విజ్ఞానమయకోశము
ఆనందమయకోశము మిగతా నాలుగుకోశాలనడుమ ఉంటుంది. అందులోనే పరబ్రహ్మ ఉంటాడు.

తైత్తిరీయోపనిషత్తులోని భృగుపల్లిలో వరుణ మహర్షికుమారుడు భృగుమహర్షి, విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే కోరికతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశం చెయ్యమని అడిగాడు. దానికి తండ్రి "కుమారా ! అన్నము, ప్రాణము, నేత్రము, శోత్రము, మనస్సు, వాక్కు ఇవన్నీ పరబ్రహ్మ సాధనకు మార్గలే. వీటన్నింటిలోనూ బ్రహ్మతత్త్వం ఇమిడి ఉన్నది. అది దేనిలోనుంచి ఉత్పన్నమైనదో, దేనితో పోషింపబడుతున్నదో, దేనియందులయమవుతున్నదో అన్నిటికీ మూలవస్తువేదో తెలుసుకోవాలి. దాన్ని తపస్సు ద్వారానే సాధించాలి. కాబట్టి వెళ్ళి తపస్సు చెయ్యి" అన్నాడు. తండ్రి ఆదేశాన్ననుసరించి దీక్ష తీసుకుని నియమనిష్టలతో తపస్సు చెయ్యటం ప్రారంభించాడు భృగువు. కొంతకాలం గడిచింది. ఆ తరువాత అన్నమే పరబ్రహ్మ స్వరూపము అని తెలిసింది. అన్నం మూలంగానే అన్ని ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రాణులన్నీ అన్నంవల్లనే పోషింపబడుతున్నాయి. కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపము. ఈ విషయం తన తండ్రికి చెప్పాడు. దానికి వరుణమహర్షి "నాయనా ! తత్త్వసాధనలో నువ్వు మొదటి మెట్టు మీదనే ఉన్నావు. ఇంకా సాధన చెయ్యి. అన్నం పరబ్రహ్మ స్వరూపమే. కాని అన్నమే పరబ్రహ్మ స్వరూపంకాదు. వెళ్ళి తపస్సు చెయ్యి" అన్నాడు. మళ్ళీ తపస్సు చెయ్యటం మొదలు పెట్టాడు భృగువు. కొంతకాలం గడిచింది. ప్రాణమే బ్రహ్మ అనే విషయాన్ని తెలుసుకున్నాడు. లోకంలోని సమస్త జీవరాశులు ప్రాణంవల్లనే జీవిస్తున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లయమవుతున్నాయి. అందుచేత ప్రాణమే సర్వ సృష్టికి మూలాధారం అని భావించాడు. అదే విషయం తండ్రికి చెప్పాడు.

నాయనా ! ఇదివరకటి కన్న కొంచెం ముందుకు వెళ్ళావు. అంతేకాని ప్రాణమే పరబ్రహ్మమ్ కాదు. మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు వరుణమహర్షి. మళ్ళీ తపస్సు చెయ్యటం ఆరంభించాడు భృగువు. కొంతకాలం గడిచింది. మనస్సు వల్లనే ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. స్త్రీ పురుషులు మనసుచేతనే ఆకర్షితులౌతున్నారు. అందువల్లనే ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. జన్మించిన తరువాత కూడా ఇంద్రియాల సాయం తోనే జీవనం సాగుతున్నది. చనిపోయిన తరువాత కూడా ఇంద్రియాలకు జ్ఞానం ప్రసాదించే శక్తిపోతుంది. ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమవుతాయి. కాబట్టి మనస్సే బ్రహ్మ అనుకున్నాడు భృగువు. ఇదే విషయాన్ని తండ్రికి తెలియచేశాడు. కాదన్నాడు తండ్రి ఇంకా తపస్సు చెయ్యమన్నాడు. మళ్ళీ కొంతకాలం తపస్సు చేశాడు భృగువు. అప్పుడు అతడికి అర్ధమయింది - "విజ్ఞానమే బ్రహ్మ". వెళ్లి ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. కాదన్నాడు తండ్రి. మళ్ళీ తపస్సు చెయ్యమన్నాడు. తండ్రి మాట ప్రకారం మళ్ళీ తపస్సు చేశాడు భృగువు. అప్పుడు తెలిసింది ఆనందమే బ్రహ్మ అని సర్వమూ ఆనందం నుంచే జనిస్తుంది. ఆనందంలోనే లయమవుతుంది. ఈ విషయం తండ్రికి తెలియచేశాడు. మహదానందం చెందాడు
వరుణ మహర్షి అప్పుడు చెప్పాడు. "కుమారా ! అన్నింటికన్నా ఉత్తమంగా పరమాత్మను వ్యక్తం చేసే తత్వం ఆనందం. అన్నము ప్రాణము, మనస్సు, విజ్ఞానము కూడా పరబ్రహ్మ రూపాలే. ఇవన్నీ ఒక దానికన్న మరొకటి సూక్ష్మమైనది. అన్నింటికీ మించినది ఆనందం. ఈ ఆనందం క్షణికమైనదికాదు. శాశ్వతమైనది. పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి. ఆహారాన్ని వదలకుండా తింటూ ప్రాణాన్ని నిలుపుకుని, మనసును వికసింపచేసుకుని, దానివల్ల విజ్ఞానం పొంది తద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి" అన్నాడు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపము పంచకోశములందు ఉంటుంది.

మానవశరీరం మూడురకాలయిన దేహాలుగా విభజించబడుతుంది. అవి:1. స్థూలదేహము 2. సూక్ష్మ దేహము 3. కారణదేహము

1. స్థూలదేహము-అన్నమయ కోశము
2. సూక్ష్మదేహము -ప్రాణమయ, మనోమయ,విజ్ఞానమయకోశాలు
3. కారణదేహము -ఆనందమయకోశము
ఈ కోశాలు ఐదు ఒక దానిలో ఒకటి ఉంటాయి. అమ్మవారి బొమ్మ వేసినప్పుడు ఆమె చేతిలో ఐదుపూలు వేస్తారు. అవి పంచతన్మాత్రలు. కొన్నిచోట్ల ఆ పూలు విడివిడిగా కాకుండా ఒక దానిలో ఒకటిగా ఉంటాయి. అవి పంచకోశాలు.

1. అన్నమయకోశంలో ప్రాణమయకోశం ఉంటుంది.
2. ప్రాణమయకోశంలో మనోమయకోశముంటుంది.
3. మనోమయకోశంలో విజ్ఞానమయకోశముంటుంది.
4. విజ్ఞానమయకోశంలో ఆనందమయకోశముంటుంది.

ఆనందమయకోశంలో ఉండేవాడే పరబ్రహ్మ, అదే అమ్మ. ఆమె ఆనందమయకోశమందుంటుంది. అందుచేతనే పంచకోశాంతరస్థితా అనబడుతుంది.

No comments:

Post a Comment

Popular