ప్రాణములను ఇచ్చేది. ప్రాణమే బ్రహ్మ. తైత్తిరీయోపనిషత్తులోని భృగువల్లిలో “వరుణమహర్షి కుమారుడు భృగుమహర్షి. విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మోపదేశం చెయ్యమని తండ్రిని కోరాడు. తండ్రి ఆదేశం మేరకు తపస్సుచేసి ప్రాణం బ్రహ్మ అని తెలుసుకున్నాడు అని చెప్పబడింది. ఈ విషయాన్ని 'పంచకోశాంతరస్థితా' అనే నామంలో వివరించటం జరిగింది. లోకంలోని సమస్త జీవరాశులు ప్రాణంవల్లనే జీవిస్తున్నాయి. ప్రాణంవల్లనే రక్షించబడుతున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లీనమైపోతున్నాయి. అందుచేత ప్రాణమే సర్వసృష్టికీ మూలాధారం.
ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉన్నది.
పూర్వకాలంలో ఒకసారి ఇంద్రియాలన్నీ తమలో తాము పోట్లాడుకోవటం మొదలు పెట్టాయి. దీనికి కారణం ఎవరు గొప్ప అనే విషయం తేలకపోవటమే. ఆ వాదన ఎంతకీ తెగలేదు. చివరకు అన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి తమకు జన్మనిచ్చిన ప్రజాపతి దగ్గరకు పోయి 'మాలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పండి' అన్నాయి. ప్రజాపతి ఒక్కక్షణం ఆలోచించి “మీలో ఎవరు గొప్పో తేల్చుకునే ఉపాయం ఒకటి ఉన్నది చెబుతాను వినండి. మీలో ఏదిలేకపోతే ఈ శరీరం పనికిరాకుండా పోతుందో, పనిచెయ్యకుండా పోతుందో అది అన్నిటికన్నా శ్రేష్టమైనది. మీరందరూ విడివిడిగా ఒక సంపత్సరంపాటు ఈ శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది” అన్నాడు ప్రజాపతి. ముందుగా వాక్కు శరీరంనుంచి నిష్క్రమించింది. ఒక సంవత్సరంపాటు శరీరానికి దూరంగా ఉండి తరువాత వచ్చి మిగిలిన ఇంద్రియాలను అడిగింది. నేను లేనప్పుడు మీరు ఎలా జీవించి ఉండగలిగారు ? నువ్వు వెళ్ళిపోవటంవల్ల శరీరానికి పెద్దనష్టం ఏమీ జరగలేదు. కేవలం మాటరాలేదు. అంతేకాని మిగిలిన శరీరం యథాతథంగా పనిచేసింది. కళ్ళు చూస్తూనే ఉన్నాయి. చెవులు వింటూనే ఉన్నాయి. మనసు ఆలోచిస్తూనే ఉన్నది. ఈ రకంగా మిగిలిన పనులన్నీ సాగాయి. పసిపిల్లవాడికి మాటలు రావు. అతడు బ్రతకటంలేదా ? మూగవాడు జీవించటంలేదా ? అలాగే శరీరం జీవించే ఉన్నది” అన్నాయి. ఆ మాటలు విన్న వాక్కు మారు మాట్లాడకుండా శరీరంలో ప్రవేశించింది.తరువాత శరీరం నుంచి దృష్టి నిష్క్రమించింది. సంవత్సరం తరువాత తిరిగివచ్చి తను లేకపోవటం చేత శరీరం ఎలా ఉన్నది ? అని అడిగింది. దానికి మిగిలిన అవయవాలు. “నువ్వు లేకపోతే చెప్పుకోతగ్గ ఇబ్బంది ఏదీ కలగలేదు. ఈ శరీరం బ్రతికే ఉన్నది. కేవలం చూపు మాత్రం లేదు. అయితే ఏం ? గ్రుడ్డివాడు బ్రతకటం లేదా ? అలాగే శరీరం జీవించే ఉన్నది” అన్నాయి. మారు మాట్లాడకుండా దృష్టి శరీరంలో ప్రవేశించింది.
తరువాత శ్రవణశక్తి శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి, ఒక సంవత్సరం తరువాత తిరిగివచ్చి 'నేను లేకపోతే శరీరం ఎలా ఉంది ?' అని అడిగింది. దానికి మిగిలిన ఇంద్రియాలు. “నువ్వు లేకపోతే వచ్చిన నష్టం ఏమీ పెద్దగా లేదు. చెవిటివాడు బ్రతకటం లేదా ? చెవులు పనిచెయ్యలేదు. అంతేకాని మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నది” అన్నాయి. మారు మాట్లాడకుండా శ్రవణం శరీరంలో ప్రవేశించింది.
తరువాత మనస్సు శరీరం నుంచి నిష్క్రమించి సంవత్సరం తరువాత తిరిగివచ్చి 'నేను లేకపోతే ఈ శరీరం ఎలా ఉన్నది ? అని అడిగింది. దానికి ఇంద్రియాలు నువ్వు లేకపోయినా పెద్దగా నష్టం ఏమీరాలేదు. మిగిలిన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. అయితే కేవలం ఆలోచన మాత్రం లేకపోయింది. అయితే మాత్రం ఏం ? పసిపిల్ల వాడికి మనసుండదు కదా ? అతడు జీవించటంలేదా ? పిచ్చివాడు ఆలోచించలేడు. అతడు జీవించటంలేదా ? అలాగే ఈ శరీరం ఉన్నది” అన్నాయి. మనస్సు కూడా మారుమాట్లాడకుండా శరీరంలో ప్రవేశించింది.
అఖరుకు ప్రాణం బయటకు పోవటానికి సిద్ధమవుతున్నది. అప్పుడు ఇంద్రియాలతో తనకున్న బంధాన్ని తెంచి పారేస్తున్నట్లనిపించింది. శరీరానికి ఊపిరి అందటం కష్టమవుతోంది. కళ్ళు కనిపించటం మానేస్తున్నాయి. కాళ్ళుచేతులు కదలటం మానేస్తున్నాయి. శరీరం గాలిలో తేలిపోతున్నట్లనిపించింది. దాంతో ఇంద్రియాలకు భయం పట్టుకున్నది. అప్పుడు ఇంద్రియాలన్నీ ప్రాణం చుట్టూ చేరి “ప్రాణమా ! నువ్వు మాత్రం శరీరం నుంచి బయటకు వెళ్ళకు. నువ్వు గనక వెళ్ళిపోతే శరీరం చచ్చిపోతుంది. అప్పుడు మేమంతా ఉపయోగం లేకుండా పోతాము. మా అందరిలోకీ నువ్వే శ్రేష్ఠుడివి. ఈ మాట మేమంతా అంగీకరిస్తున్నాం. నువ్వు ఇక్కడే ఉండి మమ్మల్ని జీవింపచెయ్యి” అని వేడుకున్నాయి.
“ఈ రకంగా ఇంద్రియాలన్నీ ప్రాణం లేకపోతే తమ ఉనికి లేదు అని ఒప్పుకున్నాయి. అందుచేతనే వాక్కు చక్షువు, శ్రోత్రము అన్నీ ప్రాణవంతమైతేనే పనిచేస్తాయి. అందుకనే అవన్నీ ప్రాణము అనే సంకేతంతోనే పిలువబడతాయి. అంటే ప్రాణం లేకుండా వీటికి స్వేచ్ఛలేదు. అసలు ప్రాణమే ఇన్ని రూపాలుగా మారింది” అని చెప్పబడింది. ఈ రకంగా అన్ని ఇంద్రియాలకు ఆధారమైన ప్రాణాన్ని ఇచ్చేది ఆ పరమేశ్వరి. కాబట్టే ఆమె ప్రాణదా అనబడుతున్నది.