దక్షుని యొక్క కుమార్తె దాక్షాయని అని గతంలో వివరించటం జరిగింది. దక్షుడు తన కుమార్తె అయిన సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు. ఒకరోజున బ్రహ్మ ఒక యాగం చెయ్యటానికి ఉపక్రమించి, ఆ యాగానికి దేవతలనందరినీ ఆహ్వానించాడు. అనుకున్నట్లుగానే అందరూ విచ్చేశారు. దక్షప్రజాపతి కొద్ది ఆలస్యంగా వచ్చాడు. అతడు రావటంతోనే దేవతలంతా లేచి నుంచుని ఆయన్ను గౌరవించారు. శివుడు మాత్రం లేవలేదు సరికదా తలత్రిప్పి చూడను కూడా లేదు.
అది అవమానంగా భావించాడు దక్షుడు. తన ఇంటికి మిగిలిన కుమార్తెలను పిలిచేవాడు. కాని సతీదేవిని మాత్రం పిలవటం మానేశాడు. ఈ రకంగా చాలాకాలం గడిచింది. ఒకసారి దక్షుడు యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. దేవతలందరికీ వర్తమానం పంపాడు. కుమార్తెలందరికీ కబురంపాడు. కానీ సతీదేవిని మాత్రం పిలువలేదు. పుట్టింటికి వెళ్ళి చాలాకాలమయింది. సోదరీమణులను చూసి ఎంతో కాలమయింది. తండ్రి యాగం చేస్తున్నాడు. పిలవకపోతే మాత్రం ఏమిటి? వెడదామనుకుంది. భర్తతో అదే మాట చెప్పింది. పిలవకుండా వెళ్ళటం మంచిది కాదు. వద్దు అవమానం పొందవలసి వస్తుంది అన్నాడు భర్త. సతీదేవి వినలేదు. సరే వెళ్ళమని భటులను తోడిచ్చి పంపాడు.
పుట్టింటికి చేరింది దాక్షాయణి. తండ్రి పలకరించలేదు. తనే వెళ్ళి నేను వచ్చాను అంది. ఎందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు. అన్నాడు దక్షుడు, నేను చేసిన తప్పేమిటి? అని అడిగింది సతీదేవి. నీ భర్త ఒక అహంభావి. నా అంతటివాణ్ణి గౌరవించడు. సేవలు చెయ్యడు. అంటూ శివుణ్ణి దూషించాడు. ఈ అవమానం భరించలేక యోగాగ్ని సృష్టించుకుని అందులో దగ్ధమైపోయింది దాక్షాయణి. ఈ వార్తను భటులు ద్వారా విన్నాడు శివుడు. సతీ వియోగాన్ని భరించలేకపోయాడు. ప్రళయకాల రుద్రుడై పోయాడు. వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞం నాశనం చెయ్యమన్నాడు. శివుని ఆజ్ఞను శిరసా వహించిన ప్రమధగణాలు దక్షుని యజ్ఞాన్ని పాడుచేశాయి. వీరభద్రుడు దక్షప్రజాపతిని సంహరించాడు. ఆ తరువాత దేవతలందరి కోరికపై దక్షునికి మేకతల అంటించి బ్రతికించారు. అప్పటి నుంచే దక్షుడు అజముఖుడైనాడు. ఈ రకంగా దక్షుని యజ్ఞం నాశనం కావటానికి కారణమైంది కాబట్టి ఆవిడ దక్ష యజ్ఞ వినాశినీ అనబడింది.