Search This Blog

వ్యాస హృదయం

బ్రహ్మాండపురాణంలో అనేక గంభీరమైన విషయాలను ప్రస్తావించారు. లలితా సహస్రనామం అందులో ఒకటి. ఈ నామాలు హయగ్రీవుడు అగస్త్యముని వారి సంభాషణ నుంచి వచ్చింది. ఇటువంటి గంభీరమైన విషయాలను ప్రస్తావించే కర్త హృదయం మరింత గంభీరంగా ఉంటుంది. ఒక చిన్న కథతో మనం దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

అది ఒక ఎత్తైన పర్వతం. అనేకానేక నిధులతో, ఘనులతో, సిరి సంపదలతో ఆ ప్రాంతం విరాజిల్లుతూ ఉంటుంది. ఎన్నో మధురమైన ఫల వృక్షముల తోనూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఎన్నో జీవరాసులు అక్కడ నివసిస్తూ ఉంటాయి. అక్కడ నివసించే మనుషులు ధనధాన్య సమృద్ధి తో జీవనం గడుపుతూ ఉంటారు. కానీ వారికి ఏదో తెలియని లోటు. కొండ పైప్రాంతం అవ్వడం వలన అక్కడ శుద్ధ జలం దొరకదు. పానీయంబులు కొరకై అక్కడివారు తేనె, పళ్లరసం మొదలైనవి తాగుతూ ఉంటారు. దాహం అక్కడ నివసించే జీవాలు  అన్నింటిలోనూ సాధారణంగా ఉండే బాధ. దీనికి కారణం శుద్ధమైన జలం దొరకక పోవడమే. 

ఆ కొండ పైకి ఎక్కితే అక్కడ ఏదో అద్భుతం ఉందని. దానిని కైవసం చేసుకుంటే తమ దాహార్తి తీరుతుందని అక్కడ మనుషులకు ఒక నమ్మకం. ఇది నిజమో భ్రమో ఎవరికీ తెలీదు. అనేక జన్మ జన్మలుగా అక్కడివారు ఈ ప్రయత్నం చేస్తూనే పుడుతూ చస్తూ కాలం గడిపేస్తున్నారు. ఆ కొండపై చివరికి ఎక్కడం అసాధ్యం. అందుకే దానిని సాధించి తిరిగి వచ్చిన వారు ఎవరు లేరు. అయినా అక్కడి ప్రజలు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

ఒకనాడు ఒక సాధువు కొండపైకి కాకుండా కొండ కిందకి వెళ్ళి చూద్దామని ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడ అతనికి ఎర్రమట్టితో ఉన్న డెల్టా ప్రాంతం కనబడింది. ఇంకా కొంచెం ముందుకు వెడితే అక్కడ ఒక నది పారుతూ కనబడింది. ఆ నీటిని చూడగానే అతనికి తాగాలి అనిపించింది.  తాగాడు. అప్పుడు జన్మ జన్మల నుంచి అతనిని బాధిస్తున్న దాహం ఒక్క క్షణం లో తీరి పోయింది. ఎంతో శాంతిని పొందాడు. ఇది నిజంగా అద్భుతం. దీని గురించి ఇంకా తెలుసుకుందాం అనుకున్నాడు. ఎంతో పరిశ్రమించి నీటి తత్వాలు అర్థం చేసుకోన్నాడు. కొండ పైకి వెళ్లి తన వారితో ఈ అద్భుతం గురించి వివరించాలి అనుకున్నాడు. 

 మిత్రులారా మనందరినీ ఎన్నాళ్లగానో బాధిస్తున్న ఈ దాహానికి నేను పరిష్కారం కనుగొన్నాను. నాతో వస్తే మీకు కూడా ఈ దాహం నుంచి ఉపశమనం కలిగించగలను అన్నాడు. అందరూ ఆత్రంగా అవునా! ఎలాగా! అని ప్రశ్నించారు. అప్పుడతను కొండపైకి వెళ్లడం కాదు.  కొండ కిందకి ప్రయాణం చేయాలి. అప్పుడు అక్కడ శుద్ధమైన జలములతో పారుతున్న నదులు కనిపిస్తాయి.  ఆ నదిలో మనందరి దాహం తీర్చే అంత నీరు ఉంది. అవి తాగితే దాహం తీరుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ కొండపైన ప్రజలు శుద్ధమైన జలమా! అది ఉండే నదియా? అదెలా ఉంటుంది?మనం ఎప్పుడూ చూడలేదే! పైగా కొండ కిందకి వెళ్లాలా? ఇలా ఎవరూ ఎప్పుడూ చేయలేదు. మా పూర్వీకులు ఎవరు ఈ మార్గం మాకు సూచించలేదు మీరు ఏదో కొత్త పద్ధతి చెబుతున్నారు. పైగా మేము ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరుగని విషయం చెబుతున్నారు.  నదులు అంటున్నారు.  మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అడిగారు  కొందరు. మరికొందరు మీరు చెబితే నమ్మాలని ఉంది గాని మేము సంసారంలో ఉన్నాము. ఇప్పుడు అన్నిటినీ వదిలి కొండ కిందకి ప్రయాణం అంటే కుదరదు కదా అన్నరు. చాలా తక్కువ మంది మేము నీతో వస్తాము పదండి అని అన్నారు. 

అప్పుడు అతను రాతితో ఒక శిల్పం చెక్కాడు. అది అందమైన ఒక దేవి విగ్రహం ఆ విగ్రహానికి గొంతులో నుంచి కడుపు వరకు మంచు గడ్డలు ఉన్నాయి.  ఆ దేవి నిమీళిత కళ్ళతో తాప శమనం   పొంది ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఒక చేతిలో కుండ. మరొక చేతిలో వరద ముద్ర పట్టి ఉంటుంది. ఆ దేవి పాద పీఠము కాపర్ సల్ఫేటుతోనూ, చ్ఛత్రం జింక్ తోనూ చేసాడు. ఆ విగ్రహానికి సజల దేవి అని పేరు పెట్టాడు. తాపశమని, నిర్మల, మాలిన్యహరిణి, విద్యుత్ప్రకాశిని, అగ్నిజ, హెచ్టుఓ, అరూపారూపి, శీతల అనే అష్టోత్తరం ఇచ్చి అక్కడ మిగిలిన వారితో ఈ దేవిని ఈ అష్టోత్తరంతో నిత్యం పూజించండి. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్లి పోయాడు. 

ఆ దాహమే మన అజ్ఞానం. కొండ పైకి ఎక్కడమే మన ధనకనకవస్తు వ్యామోహం. కొండ క్రిందకు ప్రయాణమే ఆధ్యాత్మిక దృష్టి. ఆ జలమే ఆత్మ. ఆ సాధువే వ్యాసుడు. తాపాన్ని తీరుస్తుంది కనుక తాపశమని. ఎటువంటి దోషములు ఉండవు కనుక నిర్మల. మట్టిని మాలిన్యాన్ని కడిగేస్తుంది కనుక మాలిన్యహరిణి, జలమునుండి విద్యుత్తు పుడుతుంది కనుక విద్యుత్ప్రకాశిని.  సృష్టి ఆరంభంలో అగ్ని తరువాత నీరు వచ్చింది కనుక అగ్నిజ.  2 హైడ్రోజెన్లు 1 ఆక్సీజను కలిస్తే వస్తుంది కనుక హెచ్టుఓ. రూపం ఉందని లేదని ఏది చెప్పలేము కనుక అరూపరూపి. చల్లగా ఉంటుంది కనుక శీతల. ఇవి ఆ సాధువు ఇచ్చిన అష్టోత్తరముకు వివరణ. కాపర్ సల్ఫేట్ మరియు జింక్ అమాల్గమ్ తో హైడ్రోలిసిస్ జరుగుతుంది. కుండలో క్రింద కాపర్ సల్ఫేట్, పైన జింక్ అమాల్గమ్ పెడితే అవి యానోడ్ క్యాథోడ్ గా వ్యవహరిస్తాయి. హైడ్రొలోసిస్ జరుగుతుంది. అందుకే విగ్రహం అలా రూపుదిద్దారు. తాగగానే గొంతు నుంచి కడుపుదాకా చల్లగా అనిపిస్తుంది కనుక మంచు గడ్డలు పెట్టారు. ఏనాటికైనా ఈ అష్టోత్తరం చదువుతూ ఆ విగ్రహాన్ని పూజిస్తే తన తోటివారితో కూడా చైతన్యం కలిగి దాహం తీర్చుకోవడానికి కొండ క్రిందకు పయనిస్తారనేది ఆ సాధువు హృదయం. ఏనాటికైనా లలితా సహస్రనామాలను చదువుతూ అందులోని రహస్యాలను తెలుసుకుంటూ ధ్యాన శ్లోకంలో ఉన్న మూర్తిని పూజిస్తే మనం ముక్తి పొందుతామనేది వ్యాస హృదయం. వ్యాసులవారు భగవత్సమానులు. లలితా సహస్రనామాలలో బీజాక్షరాలను నిక్షేపించారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలను వాటి ద్వారా మనకు అందించాలనేది వారి సంకల్పం. 

No comments:

Post a Comment

Popular