Search This Blog

927-928 - స్తోత్ర ప్రియా, స్తుతి మతి

లలితా సహస్రనామ స్తోత్రం మనల్ని అమ్మకు చెరువుగా తీసుకెళ్తుంది. అందుకని ఆవిడని స్తోత్రప్రియా అన్నారు. అంతే కానీ అమ్మకి ఇష్టమైనవీ ఇష్టంకానివీ అని ఏమి ఉండదు. 

ఇక్కడ ఒక రహస్యం ఉంది. లలితా సహస్రనామ స్తోత్రం చేసేవారు అందరూ ఈ రహస్యం తప్పక తెలుసుకోవాలి. మనిషులకి అపారమైన మేధా శక్తి ఉంది. ఆ శక్తితో వారు నిత్యం మేధో మధనం (రంధ్రాన్వేషణ అని కూడా చెప్పవచ్చు) చేస్తుంటారు. ఈ మేధో మధనం జరిగే ప్రక్రియలోనే అసలు రహస్యం ఉంది. అది ఏమిటంటే, ముందు ఒక విషయం మెదడులోకి చేరుతుంది. ఆ విషయానికి  ఇంకొక విషయంతో లంకి పడుతుంది. ఈ రెండు కలిసి మూడవ విషయంతో లంకి పడతాయి. ఇలా విషయాలన్నీ పూసలున్న తాడులాగా ఒకదానికి ఇకటి లంకి పడి గొలుసు లాగ ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన గొలుసులే తెలివితేటలు. ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు మనం ఈ గొలుసుయొక్క మొదటి కొసకు ప్రశ్నను తగిలించి, చేవారికొసకు సమాధానం తగిలించి, చివరగా ప్రశ్ననూ సమాధానాన్ని జత చేర్చి ఒక రంధ్రం ఏర్పరుస్తాము, అదే జ్ఞానం. 

ఉదాహరణ: ఒక వ్యక్తి కొత్త బట్టలు వేసుకుని బయటకు వెళ్ళాడు. తన మిత్రుడు అతన్ని చూసి నువ్వు ఇవాళ చిరంజీవిలా ఉన్నావు అని అన్నాడు. ఇప్పుడు ప్రశ్న 'కొత్త బట్టలు బావున్నాయా లెవా?'  దీనికి తన మేధస్సులో ఉన్న విషయాల ద్వారా జవాబు వెతకాలి. ఆ వ్యక్తి తెలుగువాడైతే, సినిమాలు చూసేవాడైతే చిరంజీవిగారి పట్ల చాలా విషయాలు అతని మేధస్సులో ఉంటాయి. ఆయన ఎలా ఉంటారు, ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన నాట్యం ఎలా ఉంటుంది. ఏయే సందర్భాలలో ఎవరెవరు చిరంజీవి గారిని ఎలా కొనియాడారు మొదలైన విషయాలన్నీ అతని మేధస్సులో ఉంటాయి. అతను వెంటనే ఇలాంటి దుస్తులు చిరంజీవిగారు ఎప్పుడు వేసుకున్నారో గుర్తు తెచ్చుకుంటాడు. ఆ దుస్తులలో ఆయన అప్పుడు ఎంత హుందాగా ఉన్నారో గుర్తు తెచ్చుకుంటాడు. ఈ విషయాలన్ని అతని మెదడులో ఒక గొలుసులా ఏర్పడి ఉంటాయి. అందుకే క్షణంలో వీటన్నిటినీ ఊహించగలుగుతాడు. ఆ గొలుసు మొదట్లో 'ఈ దుస్తులలో నేను ఎలా ఉన్నాను అనే ప్రశ్నను తగిలిస్తాడు.' గొలుసు చివరిలో అటువంటి దుస్తులలో ఉన్న చిరంజీవిగారి ఫోటో ఉంటుంది. ఇప్పుడు తన మిత్రుడు చెప్పిన దానిని ఆలంబనగా చేసి ఈ ప్రశ్నను ఆ గొలుసు చివరిలో ఉన్న ఫొటోతో తగిలిస్తాడు. అప్పుడు ఒక రంధ్రం ఏర్పడుతుంది. అంటే సమాధానం దొరికిందన్నమాట. వెంటనే అతని మోహంలో చిరునవ్వు వస్తుంది (సంతోషకరమైన సమాధానం కనుక). ఇదే మాట వెయ్యి మంది చెప్పారనుకోండి, అతని మెదడులో ఇలాంటి రంధ్రాలు వెయ్యి ఏర్పడతాయి. అప్పుడు మెదడు వీటన్నింటి మడిచి  'నేనే చిరంజీవి' అనే కొత్త  విషయంగా మార్చుకుంటుంది. ఇలా అనేక విషయాలు కలిసి రంధ్రాలవుతాయి, అనేక రంధ్రాలు ముడుచుకుని విషయాలవుతాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అదే మేధో మధనం/రంధ్రాన్వేషణ. అదే ఆ వ్యక్తి ఏ బెంగాలీయో, కొరియా వాడో అనుకోండి. చిరంజీవి గురించి అతని మేధస్సులో ఏమీ ఉండకపోవచ్చు. అప్పుడు అతనికి జవాబు దొరకదు. అప్పుడు అతను 'చిరంజీవా? ఆయన ఎవరు అని ప్రశ్నిస్తాడు' ఇలా అనేక ప్రశ్నల ద్వారా విషయాలు సేకరించి, వాటితో గొలుసులు ఏర్పరిచి, వాటితో రంధ్రాలు ఏర్పరుచుకుని అప్పుడు సమాధానం తెలుసుకుంటాడు. 

పదే పదే ఒకే మాటను వల్లే వేయడమే స్తుతి. దేన్నీ స్తుతిస్తే అత్యంత గొప్ప ఫలితం దక్కుతుందో అది స్తోత్రం. లలితా సహస్రనామాలను స్తుతిస్తే అవి విషయాలుగా మెదడులోకి చేరతాయి. అక్కడితో ఆగిపోకూడదు. వాటిపై రంధ్రాన్వేషణ చేయాలి. ఆలా జరగాలి అంటే ఒక్కొక్క నామము యొక్క పూర్తి వివరణ మెదడులో ఉండాలి. 'పంచకృత్య పారాయణ' అంటే ఏమిటి, 'చైతన్య కుసుమ' ప్రియ అంటే ఏమిటి, 'చిదగ్నికుండ సంభూత' అంటే ఏమిటి, ఇలా ఒక్కొక్క నామానికి ఒక ప్రశ్న వేసుకుని, నామాల వివరణ తెలుసుకుని వాటి విషయాలను మెదడులో  గొలుసులుగా ఏర్పరుచుకుని వాటితో రంధ్రాలు ఏర్పరుచుకోవాలి. అప్పుడు ఆ జ్ఞానం సాధనకు ఉపయోగపడుతుంది. అప్పడు స్తోత్రం యొక్క పూర్తి ఫలితం దక్కుతుంది. 

No comments:

Post a Comment

Popular