Search This Blog

852. సర్వోపనిష దుద్ఘుష్టా

అమ్మ అన్ని ఉపనిషత్తులలోనూ ప్రతిపాదించబడిన పరబ్రహ్మ స్వరూపిణి. వేదాలు మొత్తం మూడు కాండలుగా ఉన్నాయి. అవి 1. కర్మ 2. ఉపాసన 3.జ్ఞానకాండలు. వీటిలో ఉపాసన, జ్ఞానకాండలను ఉపనిషత్తులు అంటారు. ఉప అంటే సమీపము నందు ని అనగా దిగువ స్థానంలో షద్ అంటే కూర్చునుట
ఉపనిషద్ అంటే గురువుగారి దగ్గర ఆయన కన్న దిగువస్థానంలో కూర్చుని, వారు చెప్పే బ్రహ్మోపదేశాన్ని శ్రద్ధగా వినటం. మనోవాక్కాయ కర్మలలో ఎక్కడా కూడా గురువు తనకన్న తక్కువ వాడు అనే భావన రాకూడదు. గురువు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అతను తనకన్న గొప్పవాడే అని మరిచిపోకూడదు. ఉపనిషత్తులన్నీ గురుశిష్య సంవాదంగానే ఉంటాయి. బ్రహ్మశోధకుడైన శిష్యుడు, బ్రహ్మజ్ఞాని అయిన గురువును సమీపించి, ఆయన దగ్గర నియమనిష్ఠలతో కొంతకాలం గడిపి, గురువుగారి అనుగ్రహం పొంది ఆయన దగ్గర బ్రహ్మోపదేశం పొందుతాడు. ఆ సమయంలో శిష్యుడు తన అనుమానాలను అడుగుతుంటాడు. గురువుగారు వాటినితీరుస్తుంటారు. వేదాలన్నింటికీ కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో 108 ముఖ్యమైనవి. అందులోనూ ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య తిత్తిరి: ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం దశః 1. ఈశావాశ్యోపనిషత్తు, 2. మాండూక్యోపనిషత్తు, 3. కేనోపనిషత్తు, 4. తైత్తిరీయోపనిషత్తు, 5. కఠోపనిషత్తు, 6. ఐతరేయోపనిషత్తు, 7. ప్రశ్నోపనిషత్తు, 8. ఛాందోగ్యోపనిషత్తు, 9. ముండకోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు ఇవి ముఖ్యమైనవి అన్నారు శంకరభగవత్పాదులవారు
వేదాల యొక్క సారాంశమే ఉపనిషత్తులు. వీటిలో పరమాత్మ స్వరూపాన్ని వివరించటానికి ఎక్కువ ప్రయత్నం చేశారు.
బ్రహ్మసత్యం జగన్మిథ్య
పరబ్రహ్మ ఒక్కటే సత్యము, నిత్యము అయినది.శాశ్వతమైనది. ఈ జగత్తు అశాశ్వతమైనది.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
సత్యమైనది. జ్ఞానమయమైనది. అనంతమైనది ఆ పరబ్రహ్మ. బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి
బ్రహ్మమును తెలుసుకున్న వారు బ్రహ్మమే అవుతారు

No comments:

Post a Comment

Popular