ప్రాణమే బ్రహ్మ. బృహదారణ్యకోపనిషత్తులో ఈ విషయం చెప్పబడింది.
దేవదానవులిద్దరూ ప్రజాపతి పుత్రులే. కాని వారిలో దేవతల సంఖ్య తక్కువ. అసురుల సంఖ్య ఎక్కువ. వీరు ధర్మాధర్మాలకు, న్యాయాన్యాయాలకు ప్రతీకలు. అందుచేత మంచి, ధర్మము, న్యాయము గలవారు దేవతలయ్యారు. ఆవి లేనివారు అసురులయ్యారు. వీరిద్దరి మధ్యనా ఎప్పుడూ యుద్ధమే జరుగుతుంది. దానిలో తాత్కాలికంగా అధర్మం జయించినా, చివరకు ధర్మానికే విజయం లభించేది. కాని ప్రతిసారి అసురులను జయించటం కష్టమయ్యేది. అందుకని దేవతలు ఉద్గీతను ఉపాసించి, తద్వారా అసురుల మీద విజయం సాధించాలనుకున్నారు.
ఉద్గీత అంటే ఓంకారమే. ఈ విధంగా ఆలోచించిన దేవతలు ముందుగా వాగింద్రియంతో నువ్వు మా కోసం ఉద్గానం చెయ్యి అన్నారు. వాగింద్రియం సరేనన్నది. దేవతల కోసం ఉద్గానం చేసింది. అందులోని భోగాన్ని దేవతల కోసం కాగా స్పష్టమైన నిర్దుష్టమైన ఉచ్ఛారణను తన కోసం గానం చేసింది. ఈ ఉద్గానంవల్ల దేవతలు తమను జయిస్తారని భయపడ్డ రాక్షసులు పాపంతో వాగింద్రియాన్ని హింసించారు. అందువల్ల వాక్కు తన శక్తిని కోల్పోయింది. నోటివెంట వచ్చే వాటిలో అపశబ్దాలు, అబద్ధాలు, నిషిద్ధమైన మాటలు వచ్చాయి. అనరాని మాటలు అనటం మహాపాపం. అందుచేత వాక్కులో ఉద్గాన మహాత్మ్యం తగ్గిపోయింది.
తరువాత దేవతలు ముక్కును ఆశ్రయించారు. నువ్వు మా కోసం ఉద్గానం చెయ్యమని కోరారు. సరేనంది ముక్కు అందులోని సామాన్యభోగాన్ని దేవతలకు కాగా చక్కటి ఘ్రాణశక్తిని తనకోసం ఉపయోగించుకుంది. అసురులకీ విషయం తెలిసి ఈ ఉద్గానంద్వారా దేవతలు తమను జయిస్తారేమోనని భయపడ్డారు. ఘ్రాణశక్తిని పాపంతో కొట్టారు. దాని ఫలితంగా ముక్కు అనర్హమైన వాటిని పీల్చటం మొదలు పెట్టింది. ఉద్గాన ఫలితం తగ్గిపోయింది.
తరువాత దేవతలు చక్షురింద్రియాన్ని ఆశ్రయించారు. తమకోసం ఉద్గానం చెయ్యమన్నారు. సరేనన్నది చక్షువు. అందులోని సామాన్య భోగాన్ని దేవతలకిచ్చి దృశ్యశక్తిని తన కోసం ఉంచుకున్నది. దీనిపల్ల దేవతలు తమను జయిస్తారేమోనని భయపడి అసురులు
చక్షువును పాపంతో కొట్టారు. దానిఫలితంగానే చక్షువు చూడరాని దృశ్యాలను చూస్తున్నది. అది మహాపాపం. దానివల్ల ఉద్గానఫలం తగ్గిపోయింది.
తరువాత దేవతలు మనస్సును ఉద్గానం చెయ్యమని కోరారు. సరేనన్నది మనస్సు, అందులో సామాన్యభోగాన్ని దేవతలకిచ్చి శుభసంకల్పాన్ని తన కోసం ఉంచుకుంది. ఈ విషయం తెలిసిన అసురులు మనసును పాపంతో కొట్టారు. దాని ఫలితంగానే మనస్సు చేయకూడని పాపాలుచేస్తున్నది. దానివల్ల ఉద్గానఫలం తగ్గిపోయింది.
ఇప్పుడు దేవతలు ప్రాణాన్ని ఆశ్రయించి తమ కోసం ఉద్గానం చెయ్యమన్నారు. సరే అంది ప్రాణం. తనను శరణువేడిన దేవతల కోసం ఉద్గానం చెయ్యటం ప్రారంభించింది. ఈ విషయం తెలిసిన అసురులు ప్రాణాన్ని పాపంతో కొట్టాలనుకున్నారు. కాని రాతికి తగిలిన మట్టిబెడ్డలాగా పొడిపొడిగా అయిపోయారు. ప్రాణాన్ని ఢీ కొన్న అసురులు అనేకవిధాలుగా ధ్వంసమైపోయారు. అసురులు దేవతలచేతిలో పరాభూతులైనారు.
ఈ ప్రాణం అన్ని అవయవాలకు రసం. (సారం) కాబట్టి అంగిరసం అయింది. ఏ ఆధారము లేకుండా నోటిలో (ఆకాశంలో) ఉంటుంది. కాబట్టి అయాస్యమైంది. ప్రాణం ఏ అవయవాన్నుంచైనా తప్పుకుంటే ఆ అవయవం నిర్జీవమవుతుంది. ప్రాణమే బ్రహ్మణస్పతి. ఎందుకంటే ప్రాణమే యజస్సులకు పతి. ప్రాణమే సామము. ఈ రకంగా ప్రాణమే బ్రహ్మము కాబట్టి పరబ్రహ్మస్వరూపమైన మన అమ్మ ప్రాణరూపిణి అవుతున్నది.
శరీరంలో రెండురకాలయిన వాయువులు సంచరిస్తుంటాయి. అవి.
1. ప్రధానవాయువులు - ఇవి మళ్ళీ ఐదురకాలు,
1. ప్రాణ, 2. అపాన, 3. వ్యాన, 4. ఉదాన, 5, సమానవాయువులు
2. ఉపవాయువులు - ఇవి మళ్ళీ ఐదురకాలు.
1. నాగ, 2. కూర్మ, 3. కృకర, 4. దేవదత్త, 5. ధనుంజయములు.
ఈ వాయువులవల్లనే శరీర వ్యాపారం సాగుతున్నది. ఇవన్నీ ప్రాణస్వరూపాలే. ఇవి లేకపోతే శరీరం నశిస్తుంది. అందుకే అమ్మ ప్రాణరూపిణీ అనబడుతోంది.
No comments:
Post a Comment