మహా అంటే - చాలా గొప్పదైన ఈశ్వరి. మహా అంటే బ్రహ్మ. ఈ జగత్తును సృష్టించటానికి, వాటి స్థితికి, లయకు కూడా కారకురాలు. ఆమెయే ప్రభవి. మహేశ్వరుని శక్తి మహేశ్వరి. ఈమెయే మంగళచండి అనబడుతోంది.
మంగళ చండీ విద్య కధ - కశ్యపుడికి దితియందు జన్మించినవాడు వజ్రాంగుడు. ఇతడి భార్య వరాంగి. ఇతడు వీలైనంతవరకు దేవతలను బాధించేవాడు. వీరి కుమారుడు తారకాసురుడు. బ్రహ్మను గూర్చి తపస్సుచేసి తనతో సమానమైన వారు ప్రస్తుత సృష్టిలో లేకుండా వరం పొందాడు. వరబలంతో దేవతలను నానా హింసలపాలుచేశాడు. చివరకు కుమారస్వామి చేతిలో మరణించాడు.
తారకాసురుడికి ముగ్గురు కుమారులున్నారు. 1. విద్యున్మాలి, 2. తారకాక్షుడు, 3.కమలాక్షుడు.
వీరు బ్రహ్మను గురించి తపస్సుచేసి సకలసౌఖ్యాలు కామగమనము గల మూడు పట్టణాలు కావాలి అన్నారు. వారడిగినట్లే మూడు పట్టణాలు ఇస్తూ బ్రహ్మదేవుడు
ఆ పట్టణాలు ఒకదానితో ఒకటి కలియకుండా ఉన్నంతవరకూ మిమ్ములను ఎవరూ ఓడించలేరు అవి కలిశాయంటే మీరు బలహీనులౌతారు అన్నాడు. అంతట వాళ్ళు మయుణ్ణి పిలిచి వెండి, బంగారము, ఇనుములతో ఆ పట్టణాలను తయారుచేయించారు. తారకాక్షుని కుమారుడు హరి. అతడు విష్ణువును గూర్చి తపస్సుచేసి తమ వారిలో ఎవరు చచ్చిపోయినా సరే, వాళ్ళని నీళ్ళలో పడెయ్యగానే వారు బ్రతికి, వారితో పాటు సమానమైన బలం గల వాళ్ళు ఇంకా పదిమంది పుట్టేటట్లు వరం సంపాదించి, అలా చెయ్యగల బావులను తమ పట్టణాలలో నిర్మింపచేశాడు. ఇప్పుడు వారు అజేయులు, వారికి మరణం సంభవించటం కూడా చాలా కష్టం. ఈరకంగా అభేద్యమైన త్రిపురాలను కలిగి ఉన్నారు కాబట్టి వారిని త్రిపురాసురులు అన్నారు. త్రిపురాసురులు తమ పట్టణాలలోనే ఉంటూ కామగమనంతో కావలసిన చోటికిపోతూ, ఎక్కడబడితే అక్కడ ఆ పురాలతోసహా దిగేవారు. ఆ ధాటికి అక్కడ పట్టణాలు, కట్టడాలు నాశనమైపోయేవి. ఈ రకంగా భూలోకం, దేవలోకం నాశనమవుతున్నాయి. వాళ్ళని చంపటానికి దేవతల శక్తి చాలటం లేదు. దేవతలంతా శివుణ్ణి ఆశ్రయించి, త్రిపురాసురసంహారం చెయ్యటానికి తమ శక్తులన్నీ అతడికిచ్చారు. అప్పుడు శివుడు.
భూమి - రథముగా, రవి, చంద్రులు - చక్రాలుగా, నాలుగు వేదాలు - గుర్రాలు, బ్రహ్మ - సారథి, మేరువు - విల్లు, శ్రీహరి - అస్త్రం గా చేసుకుని త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు. ఆ యుద్ధంలో శివుని రథచక్రం త్రిపురాసురులు ఆయుధాలవల్ల దెబ్బతిన్నది. అప్పుడు శివుడు విష్ణుమూర్తి సలహామేరకు పరమేశ్వరిని ప్రార్ధించగా చండరూపంలో ఉన్న దుర్గ ప్రత్యక్షమై అతడికి సాయం చేసింది. పాసుపతాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు. చండిక అనే ఈ దేవత దుర్గకు ఇంకొకరూపం. మూలప్రకృతి. స్త్రీలకు ప్రత్యక్ష దైవం, కరుణామయి.
ఈ రకంగా శివునిచే పూజింపబడి ఆయనకు మంగళం చేకూర్చింది కాబట్టి ఆమె మంగళచండి అయింది. ఆ తరువాత మనువంశంలో పుట్టిన మంగళుడనేవాడు ఈ దేవిని ఆరాధించాడు. కన్యలు మంగళవారాలలో ఈ దేవిని ఆరాధిస్తారు. కాబట్టి ఈమె మంగళచండి. ఈ దేవత అభీష్టఫలదాయిని.
No comments:
Post a Comment