Search This Blog

733. నామపారాయణప్రీతా

నామ పారాయణం అంటే అమ్మ నామాలను మననం చేయడం.

అసలు రూపమే లేని పరమాత్మకు నామాలు ఎందుకు? ఆవిడ అత్యధికంగా ప్రీతి చెందేది అమ్మా అనే పిలుపుకి. మరి అలానే పిలిస్తే సరిపోదా? ఇన్ని నామాలు ఎందుకు?

వివరణ: మనందరికీ ఒక శరీరం ఉంది. ఆ శరీరానికి గుర్తింపుగా ఒక పేరు పెట్టుకుంటాం. ఆ పేరు/నామం మన ప్రయోజనం కోసం పెట్టుకున్నది. కానీ అమ్మ నామాల వల్ల ఆమెకేమీ ప్రయోజనం ఉండదు. అవి కూడా మనకొరకే. ఎన్ని నామాలు ఉంటె అన్ని విధాలుగా మనకు ప్రయోజనం కలుగుతుంది. కనుకనే వేల నామాలు.

అసలు ఈ నామాలు ఏమిటి? పరమాత్మకు రూపమే లేదంటే ఇవి వారి నామాలు ఎలా అవుతాయి?

వివరణ: ఈ సృష్టి అంతా శాస్త్ర బద్ధంగా చేయబడింది. ప్రతీ మార్పుకి/కదలికకి ఒక కారణం, లెక్క, గమ్యం ఉంటాయి. ఆ శాస్త్రాలనే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తలుగా మనకు అందించారు. లలితా సహస్రంలోని ఒక్కొక్క నామం ఎదో ఒక గొప్ప శాస్త్ర పరమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. తెలియజేయబడుతున్న విషయము, తెలియజేస్తున్న శాస్త్రము, దాని వెనకున్న కారణము అంతా ఆమె కాబట్టి ఇవి అమ్మ నామాలు అని అంటారు.

ఎదో ఒక వ్యాపారం/లేదా ఉద్యోగం చేస్తూ జీవితం గడిపే వారికి ఇంత  గొప్ప శాస్త్ర విషయాల అవసరం ఏమిటి? 

వివరణ: మనిషి పుట్టుక బాగా డబ్బు సంపాదించటానికో లేదా గొప్ప పేరు సంపాదించటానికో లేదా లెక్కలేనన్ని భోగాలు అనుభవించటానికో రాలేదు. చైతన్యం కోసం వచ్చింది. మనిషి మెదడులో చిదగ్ని రగులుతూ ఉంటుంది. అందుకే ఖాళీగా ఏదీ ఆలోచించకుండా మనుషులు ఉండలేరు. ఈ చిదగ్నికి శాస్త్ర విషయాలే ఆజ్యం. పురాణాలలో చెప్పే ప్రతీ విషయానికీ మూడు అర్ధాలు ఉంటాయి. అవి: 1. లౌకికం - లౌకిక పరమైన విషయాన్ని తెలుపుతుంది, 2. సాంకేతికం - సాంకేతిక పరమైన విషయం తెలుపుతుంది, 3. ఆధ్యాత్మికం - ఆధ్యాత్మికమైన విషయం తెలుపుతుంది. ఎలాంటి వారికైనా ఈ మూడిట్లో ఎదో ఒక విషయం తప్పక ఉపయోగ పడుతుంది. 

ఈ నామాలు చదివితే అమ్మ ఎలా ప్రీతి చెందుతుంది?

వివరణ: పరిపూర్ణమైన భక్తితో అర్ధం తెలుసుకుంటూ అమ్మ నామాలు రోజూ చదివితే అవి మన మెదడులో రంధ్రాలను ఏర్పరుస్తాయి. అదే జ్ఞానం. అది మన ఆలోచనలనీ అవసరాలనీ మార్చేస్తుంది. మన సామర్ధ్యం పెరుగుతుంది. మనం అభివృద్ధి వైపుకు సాగుతాం. ఎంతో గొప్ప విషయాలను సాధిస్తాము. ఐహిక వాంఛలన్నీ ధర్మ బద్ధంగా తీర్చుకుంటాం. ఇలా చేసేకొద్దీ జ్ఞానం పండుతూ ఉంటుంది. చివరికి జ్ఞానం వైరాగ్యం అవుతుంది. మోక్షం వస్తుంది. అమ్మను చేరుకుంటాం. అందుకే నామ పారాయణ చేసే వారంటే అమ్మకు ఇష్టం. వారికి ధర్మావలంబనలో ఏవైనా కష్టాలు వస్తే వాటిని తగ్గించి సహాయం కూడా చేస్తుంది. 

No comments:

Post a Comment

Popular