Search This Blog

715. కుళోత్తీర్ణా

కులము అంటే ఇంద్రియాల గుంపు. ఆ ఇంద్రియాలను దాటినది. అతీంద్రియమైనది. ఇంద్రియాలచే ఎరుగబడింది కాదు. లౌకిక విషయాలను అనుభవించటానికి ఉన్నవే ఇంద్రియాలు. ఇంద్రియగోచరమైన ఈ జగత్తే నిజమని, శాశ్వతమని భావించుటయే అజ్ఞానం. ఆ అజ్ఞానికి గురువురూపంలో జ్ఞానోపదేశం చేసి, సాధకుణ్ణి కడ తేర్చేది. కాబట్టి కులోత్తీర్ణా అనబడుతోంది.

ఇంద్రియాలకు అధిపతి మనస్సు, మనసును గనక వశం చేసుకుంటే ఇంద్రియాలన్నీ మన అధీనంలోనే ఉంటాయి. మరి మనస్సును వశం చేసుకోవాలంటే ఎం చేయాలి? మనస్సును ఎలా మన అధీనంలో ఉంచుకోవాలి? ఇది సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలోని 12వ అధ్యాయం - భక్తి యోగంలో వివరించబడింది.

శ్రేయాహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే
ధ్యానాత్కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరానంతరం

స్వాధ్యాయము, అభ్యాసము, జ్ఞానము, ధ్యానము, కర్మఫల త్యాగము. ఇవన్నీ మనస్సుని నీ అధీనంలో పెట్టుకోవడానికి ఉపయోగ పడతాయి. వీటిలో స్వాధ్యాయము, అభ్యాసము కన్నా జ్ఞానము గొప్పది. జ్ఞానము కన్నా ధ్యానము, దాని కన్నా కర్మఫల త్యాగము గొప్పవి. కర్మఫల త్యాగము చేయువానికి శాంతి తప్పక లభిస్తుంది.

వివరణ - స్వాధ్యాయము ద్వారా నీవు చేయవలసినవి చేయకూడనివి తెలుస్తాయి. కానీ వాటిని ఆచరించడానికి కావలిసిన మనోబలం లేకపోతె కర్మ చేయలేవు. అందుకే మనోబలం కోసం అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం వలన కొంత జ్ఞానం కలుగుతుంది, కానీ ఆ జ్ఞానం పండాలంటే ధ్యానం అవసరం. ఈ ధ్యానం నిలకడగా ఉండాలి అంటే కర్మఫలత్యాగము అత్యవసరం. ఒక ఉదాహరణతో దీనిని తర్కిద్దాం.

వివిధ రకముల రోగాల బారిన పడకుండా నన్ను నేను రక్షించుకోవాలి అనేది నీ సంకల్పం అనుకుందాం. ఏవో కొన్ని యూట్యూబ్ వీడియోల ద్వారానో లేదా పుస్తకాల ద్వారానో లేదా టీవీ ద్వారానో ఎం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అన్న విషయం తెలుసుకో. ఇది స్వాధ్యాయం. కానీ వీటి ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. వీటిలో ఏది ఆచరించాలి? అది తెలుసుకోవడానికి కొంత అభ్యాసం చేయాలి. ముందు నీ సంకల్పం ఏమిటో మనస్సుకు పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి. ఉదయం వ్యాయామ సమయంలోనో రాత్రి పడుకునే ముందో ఒక 15 నిమిషాలు 'నేను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి', 'నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచుకోవాలి' అని మననం చేసుకోవాలి. ఇలా చేస్తే నీ మనస్సు తన దృష్టిని ఏకాగ్రతని సంకల్పం వైపు కేంద్రీకరిస్తుంది. ఏ పరిష్కారానికైనా ఇదే మూలం. అభ్యాసం దీనితోనే మొదలవుతుంది. ఇంతవరకూ వస్తే సంకల్ప సిద్ధి సగం వరకూ వచ్చినట్లే. రోజూ తాజా పళ్ళు తిని ప్రాణాయామం వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని ప్రసారాల సారాంశం ఇదే ఉంటుంది. అయితే దీనిని అభ్యసించాలి. తెలుసుకున్నంత తేలిక కాదు ఆచరించడం. పెందరాళే లేచి వ్యాయామం చేయాలి అనే విషయం మనసుకి రోజూ గుర్తు చేయాలి. పడుకునే ముందు ప్రాణాయామం చేయాలి అనే విషయం మనసుకి పదే పదే గుర్తు చేయాలి. ఇలా పదే పదే మననం చేస్తే మనస్సు మాట వింటుంది. వ్యాయామం/యోగాసనాలు ఎలా చేయాలో నేర్చుకో. ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకో. అభ్యాసము ద్వారా రోజూ వీటిని ఆచరించు. ఉదయాన్నే లేవడం అలవాటయిపోతుంది. ఎంత బిజీగా ఉన్న ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకుని వచ్చేద్దాం అనిపిస్తుంది. ఇదే మనస్సు యొక్క స్వభావం. దానిని ఒక్కసారి మంచి దారిలో పెడితే తరువాత అదే నిన్ను సర్వకాల సర్వావస్థలయందు ఉద్ధరిస్తుంది. అభ్యాసం తరువాత జ్ఞానం. నీవు చేస్తున్నది సరైనదా కాదా అని పలు మార్లు సింహావలోకనం చేసి చూసుకో. తెలియని/అనుమానమున్న విషయాలు మళ్ళీ అధ్యయనం చేసి చూసుకో. తెలుసుకోగానే సరిపోదు జ్ఞానం బాగా పండాలి. విషయాన్ని తర్కం అనే త్రాసులో వేసి పరీక్షించి చూడు. ధ్యానం ఈ ప్రక్రియను సునాయాసం చేస్తుంది. రోజులో ఒక్క 5 నిమిషాలు నీకు ఇష్టమైన దేవుడిని తలచుకో. ఆయన/ఆవిడ నామాన్ని స్మరించు. అదే ధ్యానం. ఈ 5 నిమిషాలు మనస్సుని భ్రమించనీకుండా ఆ దేవతా మూర్తి పైన నిలకడ చెయ్యి. ఈ ధ్యానం నీకు ఎనలేని ఏకాగ్రతను మనో బలాన్ని ఇస్తుంది. ఇక ఇప్పుడు ఆఖరి మెట్టు. ఇంతవరకు జరిగిన ప్రక్రియతో నీవు కర్మ సక్రమంగా చేయగలవు. మరి దాని ఫలము? పైన చెప్పిన విధంగా నీవు చేసిన కర్మకు ఫలితం నీ ఆరోగ్యం మెరుగు పడటం. దానిని ఎలా చవి చూసుకోవాలి? నిజంగా నీకు ఆ ఫలితం వచ్చిందా? ఇది నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. అయితే అందరికి కర్మ ఫలం ఒకే లాగ ఉండదు. కొందరు చాలా త్వరగా విజయం సాధించవచ్చు. కొందరికి ఎక్కువ సమయం పట్టవచ్చు. పొరపాటున కూడా పక్కవారిపైకి దృష్టి మళ్ళిపోకూడదు. వారితో పోల్చుకుని నీ విజయానికి లెక్క చూసుకోకూడదు. ఆలా జరిగిందా ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ అంతా వృధా అయిపోతుంది. మనస్సు మళ్ళీ గాడి తప్పిపోతుంది. అతనికి/ఆమెకు కలిగిన ప్రయోజనం నాకు కలగలేదేం అనే ఆందోళన మొదలవుతుంది. మనస్సు మళ్ళీ ఏకాగ్రత తప్పుతుంది. ఇప్పటివరకు సాధించినదంతా పోతుంది. అందుకే కర్మ ఫలాన్ని నీ ఇష్ట దైవానికి అర్పించు. 'ఓ దైవమా! నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాను. ఇంకా బాగా ప్రయత్నించే ఉపాయముంటే చెప్పు తప్పక ఉపయోగిస్తాను. ఇక మిగిలినదంతా నీ ఇష్టం అని చెప్పు. కేవలం దండం పెట్టి లెంపలు వేసుకోవడం కాదు. దేవుడితో మాట్లాడు. నీ మనస్సులో ఉన్న మాట ఆయనికి విన్నవించు. ఆయన ఉన్నాడు అని గట్టిగా నమ్ము. ఆయన నీతో మాట్లాడాలని కాంక్షించు. ఆయన నీ మాట వింటాడు. తప్పకుండా నీకు జయం కలుగజేస్తాడు. మరచిపోకు సోదరా/సోదరీ నీవు సాధించాలనుకుంటే అది మానవ సంకల్పమే. అదే దేవుడు ఇవ్వాలనుకుంటే అది దైవ సంకల్పము.

ఇలా నీ మనస్సుని నీ అధీనములో ఉంచుకో. గొప్ప గొప్ప విషయాలు సాధించడానికి నడుం బిగించు. విజయ లక్ష్మి నిన్ను తప్పక వరిస్తుంది.

No comments:

Post a Comment

Popular