Search This Blog

536. స్వాహా

దేవతలకు యజ్ఞంలో హవిస్సు అందచేసేటప్పుడు 'స్వాహా' అనే శబ్దాన్ని ఉచ్చరిస్తారు.

ఇంద్రాయస్వాహా
ఇంద్రాయ ఇదం న మమ
అగ్నయే స్వాహా
అగ్నయే ఇదం న మమ

ఈ రకంగా స్వాహా శబ్దంతో దేవతలకు ఆహుతులు అర్పిస్తారు. అంటే అగ్నిలో వేసిన ఆ హవిస్సు స్వాహాదేవి ద్వారా దేవతలకు చేరుతుంది. దేవీ భాగవతంలో బ్రహ్మదేవుడు లోకాలన్నీ సృష్టించిన తరువాత దేవతలంతా బ్రహ్మవద్దకు వచ్చి, విధాతా ! ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉన్నాము. దీనికి ఏదైనా ఒక ఉపాయం చెప్పు అని అడిగారు. దానికి బ్రహ్మ “ఇలాంటి విషయాలు చెప్పటానికి స్థితికారకుడైన నారాయణుడున్నాడు. మీరు వెళ్ళి అతన్ని వేడుకోండి. తరుణోపాయం చూపిస్తాడు' అన్నాడు

ప్రజాపతి సలహా మీద దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు ఆ హరి 'దేవతలారా ! భూలోకంలో బ్రాహ్మణులు, క్షత్రియులు చేసే యజ్ఞ యాగాలకు సంబంధించిన హవ్యము మీ ఆకలిని పోగొడుతుంది. ఆ హవ్యము మీ పేరుచెప్పి అగ్నిలో వేస్తారు. కాబట్టి దాన్ని అగ్నిమూలంగా మీకు అందించే శక్తివేరే ఉన్నది. ఆ శక్తి కోసం మీరంతా ఆ పరదేవతను ప్రార్ధించండి. ఆవిడ ప్రసన్నురాలైతే ఆ శక్తిని పంపుతుంది' అన్నాడు. దేవతలంతా అత్యంత శ్రద్ధాభక్తులతో పరమేశ్వరిని ఆరాధించారు. దేవి వారి దీక్షకు మెచ్చి ఆ శక్తిని పంపించింది. బ్రహ్మ ఆ శక్తికి నమస్కరించి "తల్లీ ! నువ్వు అగ్నిదేవునికి దాహకశక్తివై, అతని యందు హోమం చేసిన హవ్యాన్ని దేవతలకు అందించు” అన్నాడు. దానికి ఆ శక్తి "నేను శ్రీహరికి తప్ప ఇతరులకు చెందను. అగ్నికి దాహకశక్తిగా ఉండను' అని చెప్పి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చెయ్యటం ప్రారంభించింది. కొంతకాలానికి హరి ప్రత్యక్షమై "దేవీ ! నీ మనసు నాకర్ధమయింది. మరుజన్మలో నగ్నజిత్తు అనే రాజుకు నాగ్నజితిగా పుట్టి, నా అంశతో పుట్టిన శ్రీకృష్ణుని వివాహమాడు కాని ఇప్పుడు మాత్రం స్వాహ అనే పేరుతో అగ్నిదేవునికి ఇల్లాలివై, అతనికి దాహకశక్తివై ఉండు" అన్నాడు. స్వాహాదేవి విష్ణుమూర్తి మాటలకు ఒప్పుకుంది. అగ్నికి స్వాహాదేవికి వివాహమయింది. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. వారే 1. ఆహవనీయాగ్ని 2. గార్హ పత్యము 3. దక్షిణాగ్ని.

ఈ రకంగా స్వాహాదేవి అనుగ్రహంవల్ల దేవతల ఆకలిబాధ తీరింది. అని చెప్పబడింది. కాబట్టి స్వాహాదేవి అగ్నిదేవుని దాహకశక్తి. యజ్ఞంలో దేవతలకర్పించిన హవిస్సులను దేవతలకు చేరుస్తుంది.

మార్కండేయ పురాణంలో “ఓ దేవీ ! నీ నామాన్ని ఉచ్చరించటం వల్ల దేవతలందరూ తృప్తి చెందుతున్నారు. యాగాలు అన్నింటిలోనూ స్వాహా అనే నామాన్ని ఉచ్చరిస్తే చాలు దేవతలు ప్రీతి చెందుతారు” అని చెప్పబడింది. అగ్నిదేవుణ్ణి ప్రార్ధించేటప్పుడు స్వాహాంతు దక్షిణే పార్శ్వే అంటాము. అంటే అగ్నిదేవుని దక్షిణ భాగంలో స్వాహాదేవి ఉంటుంది.

No comments:

Post a Comment

Popular