Search This Blog

08-09. రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల


అరిషడ్వర్గాలు ఆరు అవి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము. మనసు ధర్మ విరుద్ధమైన ఆలోచనలు చేయడానికి ఇవే కారణం. వీటికి రాగద్వేషాలు బీజము. రాగము ద్వేషము వేరుకాదు. ఇవి నాణానికి రెండు వైపులు. రాగం ఉన్నచోట ద్వేషమూ ఉంటుంది. ఇవి మన అభ్యున్నతికి అవరోధాలు.  మనం చేసే కర్మ ధర్మబద్ధమైనపుడు మనం తప్పక విజయం సాధిస్తాం.  కానీ ఇవి మన ప్రయత్నాలలో ధర్మ వైక్లబ్యాలను కల్పించి మనకు దక్కవలసిన విజయము విత్తము  భాగ్యము మనకు రాకుండా చేస్తాయి. లలితమ్మ చేతిలో పాశం ఉంటుంది.  ఆవిడని ప్రార్థించిన వారికి ఆ పాశము ద్వారా రాగద్వేషాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. అందుకే ఆవిడ రాగస్వరూప పాశాఢ్యా అని పిలవబడుతుంది. అంటే మనసును నిర్మలం చేసి నిలకడ ప్రసాదిస్తుంది. నిలకడ గల మనసు ధ్యానం చేసేటప్పుడు దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించ గలదు. అప్పుడు మనము అత్యుత్తమమైన సచ్చిదానందమును అనుభవించగలము. 

కోరిక తీరితే కామము లేకుంటే క్రోధము. ఆశ తీరేది అయితే లోభము లేకుంటే మోహము. మన కన్నా చిన్నవాడు కనిపిస్తే మదము లేకుంటే మాత్సర్యము. ఇలాగా అరిషడ్వర్గాలు మనసుని నిర్లిప్తంగా ఉండకుండా చేస్తాయి. వీటిని అదుపు చేయడం చాలా కష్టం. కానీ అమ్మవారి దగ్గర ఇంతటి  భయంకరమైన మదపుటేనుగును కూడా నిర్వహించగల అంకుశం ఉంది. అందుకే ఆవిడ క్రోధాకారాంకుశోజ్వల. మనసు చాలా ముఖ్యమైనది బలమైనది పదునైనది కూడా.  జ్ఞానేంద్రియాలు , కర్మేంద్రియాలు, శరీరంలోని ఇతర అవయవాలు ఏం పని చేయాలి ఎలా పని చేయాలి ఇదే నిర్దేశిస్తుంది. మనిషి నేర్చుకునే విజ్ఞానాన్ని తనలో దాచుకుని ఆ విద్యతో ఎన్నో ఉపాయాలు అందించి సమస్యలు గట్టెక్కిస్తుంది. ఇంత గొప్ప మనసుని మన జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. చేసే ఆలోచనలు సరి అయినవా కాదా అని లెక్కలు వేసుకుంటూ ఉండాలి. 

మనసుకి ఒక గొప్ప లక్షణం ఉంది. అదే సాధన. దీని ద్వారానే అది ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించి పెడుతుంది. ఉదాహరణకి పొద్దున్నే లేవడం చాలామందికి కొంచెం కష్టతరంగానూ ఇబ్బందికరంగానూ ఉండే విషయం. కానీ ఎవరైనా నేను పొద్దున్నే లేవాలి అని దృఢంగా సంకల్పించుకుని రోజంతా  అదే విషయాన్ని తన మనసుకి గుర్తు చేస్తే అది పొద్దున్నే లేవడం జరిగేలా చూస్తుంది. రాత్రి పడుకునే ముందు ఉదయం ఐదు గంటలకు లేవాలి అని పలుమార్లు మనసుకు గుర్తు చేస్తే అది నిజంగానే మరునాడు ఉదయం ఐదు గంటలకు వారిని నిద్ర లేపుతుంది.  వారు లేచి ఏదైనా వ్యాయామో, పూజో లేదా విద్యాభ్యాసము చేశారు అనుకోండి అది చాలా బలంగా నిద్రలేవడం అనే విషయాన్ని తనలో పొందుపరుచుకుంటుంది. ఆ మరుసటి రోజు ఎవరూ గుర్తు చేయకుండానే ఉదయాన్నే లేపుతుంది. అలా రెండు మూడు రోజులు చేశాక దానిని తన అలవాటుగా మార్చేస్తుంది. ఆ తరువాత ఉదయం 5 తర్వాత వారికి ఇక  నిద్ర పట్టదు.  ఇది మనసుకు ఉన్న బలం. అది చేయలేనిది అంటూ ఏదీ ఉండదు. అయితే ముందు దాన్ని సాధనామార్గంలో పెట్టాలి. దానికి పదును పెట్టాలి. అప్పుడది ఏదైనా సాధించిపెడుతుంది.

నాకు సుపరిచితులైన ఒక గొప్ప వ్యక్తి గురించి చెబుతాను వినండి. ఆయనకి ధూమపానం అలవాటు ఉండేది. సుమారు 30 ఏళ్లుగా ఆయన ఆ విలాసాన్ని అనుభవించారు. ఒకరోజు ఆయన నేను ధూమపానం మానేశాను అని నాతో చెప్పారు. అప్పుడు నేను ఇది చాలా కష్టతరమైన పని అని విన్నాను. ఇది మీకు ఎలా సాధ్యమయింది? ఇప్పుడు మానేశాను అంటున్నారు సరే ఉత్తరోత్తరా మళ్లీ అటువంటి ఊహ మదిలో మెదిలితే చలించకుండా ఎలా ఉండగలరు? అని అడిగాను . దానికి ఆయన ఇకనుండి ధూమపానం గుర్తుకొచ్చినప్పుడు నా మనసు చలించ కూడదు. నేను ఆ వ్యాసనం నుండి బయట పడదలచుకున్నాను అని గట్టిగా నా మనసులో అనుకున్నాను. మొదట్లో కొన్నాళ్ళు ఇబ్బంది అనిపించింది. కానీ నా లక్ష్యాన్ని పదే పదే గుర్తుతెచ్చుకున్నాను. ధూమపానం మధ్యలో వచ్చింది. అంతకుముందు కూడా నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు  మానేశాక కూడా అంతే సంతోషంగా ఉంటాను అని నాకు నేనే ధైర్యం చెప్పుకునే వాడిని. కొంతకాలానికి ఆ అలవాటు పోయింది అని జవాబిచ్చారు. అంతే కాదు ధూమపానం మానేసి తద్వారా దాచిన డబ్బులతో ఆయన భార్యకి నగలు కూడా కొనిచ్చారు. ఇదే మనో బలం అంటే. మనసును మెల్ల మెల్లగా సాధనామార్గంలో పెడితే అది మనల్ని ఎంత కష్టమైనదైన సాధించగలిగేలా చేస్తుంది. 

Popular