Search This Blog

770. యజ్ఞరూపా



యజ్ఞోవైవిష్ణుః అంటోంది వేదం. అంటే యజ్ఞమే విష్ణువు. పద్మపురాణంలో ఈశ్వరుణ్ణి గురించి చెబుతూ

వేదపాదో యూపదంష్ట్రః క్రతుహస్త శ్చితీముఖః అగ్నిజిహ్వా ధర్మరోమాః బ్రహ్మ శీర్షీ మహాతపాః
అహోరాత్రేక్షణీ దివ్యో వేదాంతశ్రుతి భూషణః స్రువతుండ శ్చాజ్యనాసః సామఘోష్యస్వనో మహాన్
ధర్మసత్యమయః శ్రీమాన్ క్రమవిక్రమ సత్క్రియః ప్రాయశ్చిత్తనఖో ధీరః పశుజానుర్మహా భుజ:
ఔద్దా త్రాం. హోమలింగః ఫలబీజ మహషధిః వాయ్వంతరాత్మా మంత్రస్పిగ్వికృతః సోమశోణితః
వేదస్కంధో హవర్గంధో హవ్యక వ్యాతి వేగవాన్ ప్రాగ్వంశకాయో ద్యుతిమాన్ నానాదీక్షాభిరర్చితః
దక్షిణాహృదయో యోగీ మహామంత్రమయో మహాన్ ఉపాకర్మోల జచుబుకః ప్రవర్యావర్తభూషణ: నానాచ్ఛందోగతిపథో గుహ్యోపనిషదాసనః ఛాయాపత్నీ సహాయోవై మేరు శృంగ ఇవోచ్ఛితః వేదాలే - అతనిపాదాలు, యూపస్తంభాలు - కోరలు, క్రతువులు - హస్తాలు, చితి -ముఖము అగ్నియే -నాలుక, ధర్మాలే - రోమాలు, తపోవంతులైన బ్రాహ్మణులే - తల, అహోరాత్రాలు - చూపులు దృష్టి, వేదాంతశ్రుతులు - చెవికమ్మలు (అలంకారాలు), స్రువమే -తుండము, ఆజ్యమే - ముక్కు, సామఘోషయే - గొప్పధ్వని, సత్క్రియలే - అతని క్రమవిక్రమములు, ప్రాయశ్చిత్తములే - నఖములు, పశువు - జానువు, ఔద్దాత్రమే - ఆంత్రము (ప్రేగు), హోమమే - లింగము, ఫలములే - అవయవాలు, వాయువు - అతని అంతరాత్మ, మంత్రాలు - పెదవులు, సోమరసము - రక్తము, వేదాలు - భుజాలు, వేది - స్కందము, హవిస్సు - గంధము, హవ్యకవ్యములు -వేదాలు, ప్రాగ్వంశికలు - దేహము, దానము - హృదయము, ఉపకర్మలు - పెదవులు, గడ్డము, ప్రవర్యలు - భూషణములు, నానాఛందస్సులు - మార్గాలు, గుహ్యోపనిషత్తు - అతని ఆసనము ఛాయ - పత్ని అతడు ధర్మసత్యమయుడు, నానాదీక్షలచే అర్చించబడినవాడు, పర్వతమువలె ఉన్నతుడు అని చెప్పబడింది.

ఆమ్నాయ రహస్యంలో ఇంద్రియ ద్వారసంగృహ్యైః గంధాద్యై రాత్మదేవతాం | స్వభావేన సమారాధ్య జ్ఞాతు స్సోయం మహాముఖః || ఇంద్రియాలను జయించి మిక్కిలి భక్తితో ఆత్మను ఆరాధించటమే మహాయజ్ఞము అని చెప్పబడింది. భగవద్గీతలో అన్నా ద్భవంతి భూతానీ పర్జన్యా దన్నసంభవః యజ్ఞ ద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ప్రాణులు అన్నం వలన వృద్ధి చెందుతాయి, ఈ అన్నం మేఘము వలన సంభవిస్తుంది. ఆ మేఘాలు యజ్ఞం వలన వస్తాయి. యజ్ఞము కర్మవలన సంభవిస్తాయి. ప్రజాపతి యజ్ఞంవల్ల ప్రజలను సృష్టించి మీరు వర్ణాశ్రమధర్మాలను నెరవేరుస్తూ వేదంలో చెప్పబడ్డట్లుగా యజ్ఞకర్మలు చేస్తుండండి. అప్పుడు దేవతలు మీ కోరికలు నెరవేరుస్తారు అని చెప్పాడు. అందుచేత యజ్ఞాలు మానవ కల్పితాలుకావు అని గుర్తించాలి. యజ్ఞాలు మూడురకాలు. అవి 1. పాకయజ్ఞాలు 2. హవిర్యాగములు 3. సోమసంస్థలు. 1. పాకయజ్ఞాలు : ఇవి మళ్ళీ ఏడువిధాలు. 1. ఔపాసన, 2. స్థాలీపాకము, 3. వైశ్వదేవము, 4. అష్టకము, 5. మాసశ్రాద్ధము, 6. సర్పబలి, 7. ఈశానబలి 2. హవిర్యాగాలు : ఇవి మళ్ళీ ఏడురకాలు. 1. అగ్నిహోత్రాలు, 2. దర్శపూర్ణిమాసలు, 3. ఆగ్రయణం, 4. చాతుర్మాస్యాలు, 5. పిండ, పితృయజ్ఞాలు, 6. నిరూఢపశుబంధము, 7. సౌతామణి
3. సోమసంస్థలు : ఇవి మళ్ళీ ఏడురకాలు. 1. అగ్నిష్టోమము, 2. అత్యగ్నిష్టోమము, 3. ఉక్రము, 4. అతిరాత్రము, 5. ఆప్తోర్యామం, 6. వాజపేయం, 7. పౌండరీకం
ఇవి కాకుండా అంబాయజ్ఞము, అంతర్యాగము, బహిర్యాగము అని కూడా ఉన్నాయి. ఇవన్నీ పరమేశ్వరి రూపమే. అందుచేత పరమేశ్వరి యజ్ఞరూపా అనబడుతోంది.

భక్తితో, పరోపకార దృష్టితో, వేదప్రోక్తంగా చేయబడే కర్మలు యజ్ఞాలు.

Popular