Search This Blog

578. మాతృకావర్ణరూపిణీ

మాతృకలు అంటే అకారాది క్ష కారాంతము ఉండే అక్షరాలు. క్షరము కానిది నాశనము లేనిది అక్షరము. ఆ అక్షరముల రూపం కలది. మాతృకల యొక్క వర్ణము అంటే రంగును తెలియచేసేది అని అర్ధం. ప్రతి అక్షరానికి ఒక దేవత ఉన్నది. ఆ దేవత యొక్క చేతులయందు ఆయుధాలు, ఆ దేవత పరిధి, రంగు వివరించబడ్డాయి.

మాతృకా వశినీ యుక్తాం యోగినీభి సమన్వితాం
గంధద్వారాదిసహితాం సంస్మరేత్ త్రిపురాంబికాం ||

వశిన్యాది శక్తులతోను, యోగినీ గణములతోను, గంధాకర్షిణి మొదలైన ఆకర్షణ దేవతలతోను కూడిన మాతృకా రూపమయిన త్రిపురాంబికను పూజిస్తున్నాను.

సనత్కుమార సంహితలో అక్షర దేవతల గూర్చి చెప్పబడింది. అందులో అక్షరాలను. ఐదు భాగాలుగా చేశారు.

1. స్వరాత్మిక శక్తులు: ఇవి అకారాది శక్తులు వీటికి ఎనిమిది చేతులుంటాయి. ఆ చేతులలో పాశము, అంకుశము, అభయ, వరదముద్రలు, పుస్తకము, అక్షమాల, కమండలము, వ్యాఖ్యా ముద్రలను కలిగి ఉంటాయి.

ఆకారాది శక్తులు ధూమ్రవర్ణాలు. తెల్లని పొగ ఛాయలో ఉంటాయి.

ఈ శక్తులకు పరిధులు కూడా చెప్పబడ్డాయి
అ కార శక్తిమండల విస్తీర్ణము 80 లక్షల యోజనాలు
ఆ కార శక్తిమండల విస్తీర్ణము 160 లక్షల యోజనాలు
ఇ కార శక్తిమండల విస్తీర్ణము - 90 లక్షల యోజనాలు
ఈ కార శక్తి మండల విస్తీర్ణము 180 లక్షల యోజనాలు
ఉ కార శక్తిమండల విస్తీర్ణము కోటియోజనాలు
ఊ కార శక్తిమండల విస్తీర్ణము రెండు కోట్ల యోజనాలు
ఋ కార శక్తిమండల విస్తీర్ణము - 50 లక్షల యోజనాలు
ఋ కార శక్తిమండల విస్తీర్ణము కోటి యోజనాలు
ఎ కారశక్తి మండల విస్తీర్ణము అనంతము
ఏ ఐ శక్తిమండల విస్తీర్ణము - 150 లక్షల యోజనాలు
ఓ ఔ శక్తిమండల విస్తీర్ణము - 150 లక్షల యోజనాలు
అం అః శక్తిమండల విస్తీర్ణము 320 లక్షల యోజనాలు

2 వ్యంజన శక్తులు: క నుండి క్ష వరకు ఉన్న అక్షరాలు. వీటికి నాలుగు చేతులుంటాయి. 'క' నుండి 'మ' వరకు ఉన్న శక్తుల చేతిలో పాశము, అంకుశము, అక్షమాల, కమండలము ఉంటాయి.

3. యరలవ శక్తుల చేతులలో పాశము, అంకుశము, అభయ, వరద ముద్రలు ఉంటాయి.

4. శ ష స హ శక్తుల చేతులలో పాశము, అంకుశము, అభయ, వరదముద్రలుంటాయి.

5. ళ, క్ష శక్తులకు కూడా నాలుగు చేతులే ఉంటాయి. ఆ చేతులలో పాశము, అంకుశము, చెరకుగడ, పుష్పబాణము ఉంటాయి.

క నుంచి ఠ వరకు శక్తులు సింధూర వర్ణాలు
డ నుంచి ఫ వరకు శక్తులు గౌరవర్ణాలు. గౌరీ దేవి వర్చస్సు.
బ నుంచి ల వరకు శక్తులు అరుణ వర్ణాలు. ఉదయించే సూర్యుని తేజస్సు.
వ నుంచి సవరకు శక్తులు కనక వర్ణాలు. బంగారు రంగు మెరుపు.
హకార క్ష కారముల శక్తులు విద్యుత్ వర్ణాలు. ఆకాశంలో మెరిసే మెరుపు తీగ.

వ్యంజన శక్తులమండల విస్తీర్ణము 40 లక్షల యోజనాలు

యోగి అయినవాడు నిష్టగా ఈ బీజాలను ధ్యానం చేసినట్లైతే, వాటి శక్తులు ఇంత మేర విస్తరిస్తాయన్న మాట.

వశిన్యాదిశక్తులు, అక్షరాలు తమ తమ ఆయుధాలతో ఉన్నట్లుగా భావన చెయ్యటం వల్లనే శ్రీచక్రానికి మూడు ప్రస్తారాలు వచ్చినాయి. ఈ రకంగా అక్షర స్వరూపం గలది కాబట్టే పరమేశ్వరి మాతృకా వర్ణరూపిణి అనబడుతోంది.

యజ్ఞవైభవ ఖండంలో

యథా పరతర శ్శంభు: ద్విధాశక్తి: శివాత్మనా
తథైవ మాతృకా దేవీ ద్విధా భూతా సతీ స్వయమ్
ఏకా కారేణ శక్తి స్తు వాచికా చేతరేణ తు
శివస్య వాచికా సాక్షా ద్విద్యేయం పదగామినీ ||

పరమేశ్వరుడు శివుడు, శక్తి అని రెండుగా ఉన్నట్లుగానే మాతృకాదేవి కూడా అచ్చులు హల్లులు అని రెండు విధాలుగా ఉన్నది. దానిలో అచ్చులు శక్తి రూపము హల్లులు శివరూపము.

Popular