Search This Blog

కృష్ణ! ఒక్కసారి రావా!

అచ్యుత కేశవ కృష్ణ దామోదర 
ఎన్ని సార్లు పిలవాలి స్వామీ?
ఎప్పుడు వస్తావు నాయనా?

మీరాబాయిలా పిలవలేదనా, 
యశోదమ్మలా లాలించలేదనా, 
శబరిలా తినిపించలేదనా, 
గోపికలలా క్రీడించలేదనా, 
ఎందుకు రావు నాదగ్గరికి?

అన్నమయ్యలా కీర్తించలేననా, 
ప్రహ్లాదునిలా విశ్వసించలేననా, 
హనుమలా సేవ చేయలేననా,
హాథీరామ్ లాగ తపించలేననా, 
అందుకేనా నేనంటే చిన్నచూపు?

సాధన పరిశ్రమలతో శక్తి యుక్తులు సంపాదించగలం,
కానీ భక్తి శ్రద్ధలు మాత్రం నువ్వే ఇయ్యాలి. 
వారికి ఇచ్చినంత భక్తి నాకెందుకు ఈయలేదు? 
నిన్ను చేరెంత పురుషార్థం నాకు లేదా?
లేకపోతే అది నా తప్పా ? 

ఎదో ఉడతాభక్తితో నేనూ కొలిచాను, 
తప్పు చేసినప్పుడల్లా లెంపలేసుకున్నాను,
అప్పుడప్పుడు గుళ్ళకి పుణ్యక్షేత్రాలకి వెళ్లాను,
నీగురించి తెలిసింది పదిమందికి చెప్పాను,
ఇంతకుమించి చేతకాకపోతే నన్ను వదిలేస్తావా?

అంత గొప్పగా ధ్యానం, కీర్తనం, గానం నాకు రావు, 
భక్తి పొంగినప్పుడల్లా ఎదో ఇలా రాసుకుంటాను, 
కుదిరినప్పుడల్లా నిన్నే తలుచుకుంటాను,
ఇది నీకు అసలు ఆనదా? ఇంతైనా పట్టించుకోవా? 

నాలాంటివారిని కూడా ఉద్ధరిస్తావనే కదా, 
నీకు ఇన్ని సహస్రనామాలు, అష్టోత్తరాలు! 
అవన్నీ అప్పుడప్పుడు చదువుతున్నాను కదా,  
ఒక్కసారి నీ సౌందర్యం చూపిస్తే అరిగిపోతావా?

నీప్రేమ కోసం జీవితాంతం ఎదురుచూడాలంటే ఎలా?
నావంటి సామాన్యులు అంత ధృతితో నిలబడలేరు,
అరిషడ్వార్గాలు నన్ను అంత త్వరగా వదలవు,
అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండాలి,
మనోరంజకమైన లీలతో ఆకర్షించుకోవాలి, 

అచ్యుత కేశవ కృష్ణ దామోదర 
మళ్ళీ మళ్ళీ అర్ధిస్తున్నాను, శరణు వెడుతున్నాను  
అహంకారపు సంకెళ్లను తెంపి అక్కున చేర్చుకోవా ?

Popular