Search This Blog

98.సమయాచారతత్పరా

లలితమ్మ సమయాచారమునందు ఆసక్తి కలది. 

సమయాచారం అనగానేమి:

1. దక్షిణామూర్తి ఋషిగా, కామేశ్వరీ కామేశ్వరులు అధిదేవతలుగా ఉన్న మంత్రానుష్టానమే సమయాచారము. శివ శక్తులకు పంచసామ్యమున్నది అని చెప్పటమే సమయాచారము. కుండలినీని మూలాధార చక్రం నుండి పైకి లేపి సహస్రారం చేర్చి మళ్ళీ తిరిగి మూలాధారం వద్దకు తీసుకురావడమే సమయాచారము. 

2. వ్యాసం పాణిని, సూర్య, పింగళ, యావకా, మను, యాజ్ఞవల్క్య, ఆపస్తంబ, గౌతమ మొదలగు ఋషులు వ్రాసిన స్మృతులు సమయాచారాన్ని బోధించాయి. 

3. హృత్పద్మంలో పరమేశ్వరిని భావన చేసి, షట్చక్రాలలోను భావనోపనిషత్తులో చెప్పిన విధంగా అర్చన చెయ్యటమే సమయాచారము. 

4. గురువు వద్ద మహావేధ అనే సంస్కారము పొంది షట్చక్రబేధనము, చదుర్విదైక్య సంధానము తెలుసుకుని, వాటి ప్రకారము జగన్మాతను అర్చించటాన్ని అంతర్యాగము అంటారు. ఈ రకమైన అర్చన అమ్మకు చాల ఇష్టం. అందుచేతనే సమయాచార తత్పరా అని చెప్పబడింది. 

మకారపంచకం - దేవీపూజకు మకారపంచకమును వినియోగిస్తారు. మకారపంచకం అంటే 

మద్యం మాంసం తథా మత్స్యం ముద్రా మైధున మేవ చ
శక్తిపూజా విధానాధ్యయ్హ్ పంచతత్వహ్ ప్రకీర్తితః

కొంతమంది తెలియక ఈ మకారపంచకముయొక్క బాహ్యార్ధాన్ని గ్రహించి తప్పుచేస్తుంటారు. శక్తి సంగమతంత్రంలో ఈ మకార పంచకానికి నిజమైన నిర్వచనం ఇచ్చారు. 

  1. మద్యము అంటే బెల్లపు పానకం 
  2. మాంసము అంటే గారెలు తెలగపిండి
  3. మత్స్యము అంటే వెల్లుల్లి, తిత్తిడిపదార్థాలు
  4. ముద్ర అంటే గోధుమలు మినుములచే చేయబడిన పదార్థాలు
  5. భక్ష్యభోజ్యముల కలయికే మైధునము 

ఇది కౌళాచారము. 

మహానిర్వాణ తంత్రంలో మకార పంచకం గురించి ఇలా చెప్పారు 

న మద్యం మాధవీ మద్యం, మద్యం శశికిరణ రషోద్భవం
కర్మాకర్మ పశున్ హత్వా జ్ఞానఖడ్గేన చేశ్వరీ
మానోమీనం తృతీయే చ హత్యాసంకల్ప వాసనః 
భక్ష్యభోజ్యాన్నం భక్ష్య మింద్రియనిగ్రహః తాం చతుర్ధామ్ విజానీయాత్
హంసఃసోహం శివః శక్తి శ్చైవ ఆనందానిర్మలః పంచమీమ్ తాం విజానీయాత్

  1. చంద్రబింబము నుంచి జాలువారు అమృతమే మద్యము
  2. కర్మాకర్మలను పశువులను జ్ఞాన ఖడ్గంతో సంహరించటమే మాంసము. 
  3. మనస్సే మత్స్యము దాని సంకల్పవాసనాలను హరించుటయే మత్స్య సమర్పణ.
  4. ఇంద్రియ నిగ్రహమే భక్ష్యభోజ్యాలు. ఇది ముద్ర.
  5. హంసస్సోహం అనే మంత్రార్థమయిన శివశక్తుల కలయికే మైధునము. 

ఇది సమయాచారము 

పంచపుష్పాలు:

అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహః 
దయాక్షమాజ్ఞానపుష్పం పంచపుష్పం తతః పరం 

  1. మొదటిపుష్పం - అహింస 
  2. రెండవ పుష్పం - ఇంద్రియ నిగ్రహం 
  3. మూడవ పుష్పం - దయా 
  4. నాల్గవ పుష్పం - క్షమా 
  5. ఐదవపుష్పం - జ్ఞానం 

Popular