'బ్రహ్మది ఆకారభేదం చేత వేరుగా ఉన్నది. ఐనప్పటికీ కర్మకు సాక్షియై ప్రకాశించే ఈశ్వరశక్తియే సంధ్య' అని భారధ్వాజ స్మృతిలో చెప్పబడింది.
గాయత్రీ మంత్రము నాల్గవపాదముతో కూడినదై సంధ్యారూపిణి అవుతున్నది అని ఆగమాలు చెబుతున్నాయి. అందుచేత సంధ్యాకాలంలో ఉపాసించతగిన దేవత సంధ్య.
కాలికావురాణంలో సంధ్యాదేవి బ్రహ్మ యొక్క కుమార్తె అని చెప్పబడింది.
భగవతీపురాణంలో బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య తపస్సు చేసి శరీరాన్ని వదిలి వశిష్ఠుని భార్య అరుంధతిగా జన్మించింది అని చెప్పారు. చిఛక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరియే సంధ్య.
సంధ్యాదేవతయే గాయత్రి, సావిత్రి, పరమేశ్వరి. ఈ సంధ్యా దేవత సంధికాలమున ఉపాసించబడుతుంది. సూర్యుడు ఉదయించకముందు, నక్షత్రాలు అస్తమించకముందు కాలము ఉదయసంధ్య. అలాగే సూర్యుడు అస్తమించాడు. కాని నక్షత్రాలు పూర్తిగా లేవు. అది సాయంసంధ్య. ఇవి సంధ్యావందన కాలములు. ఈ సమయంలో ధ్యానించబడేదే సంధ్య. సూర్యుడి యందలి చైతన్యశక్తియే సంధ్య. ఈ దేవిని ఆజ్ఞాచక్రస్థానంలో ధ్యానం చెయ్యాలి.
పంచకోశాలలోను మనోమయకోశము సంధికోశము అదే సంధ్యాస్థానము అని చెప్పబడుతోంది.
సంధ్యాస్నానం జపో హోమో దేవతానాం చ పూజనం |
ఆతిధ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే |
సంధ్యావందనము, జపము హోమము, దేవతాపూజ, అతిధిపూజ వైశ్వదేవము ఈ ఆరు ప్రతినిత్యము చేయవలసినవి.