Search This Blog

420.గాయత్రి



గయాన్ ప్రాణాన్ త్రాయత ఇతి గాయత్రీ

ప్రాణములను రక్షించునది గాయత్రి అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. గయలు అంటే ప్రాణాలు అని అర్ధం.

త ద్యత్ప్రాణా వ్రాయతే తద్గాయత్రీ ప్రాణరక్షణ చేయునది గాయత్రి అని బృహదారణ్యకోపనిషత్తు వివరించింది. తస్మాద్దాయంతం త్రాయతే యతః గానము చేయువానిని రక్షించునది. గీయతే తత్త్వమనయా గాయత్రీతి అని శంకర భాష్యం. ఈ మంత్రంలో దైవత్వం గానం చెయ్యబడింది. అందుచేత గాయత్రి అనబడుతుంది.

గాయత్రి మంత్రం రెండు రకాలుగా ఉన్నది.

1. బ్రాహ్మణులకు ఉపనయనకాలంలో ఉపదేశించేది.
2. వేదాలలో నిగూఢమైనది. ఇదే పంచదశి మహామంత్రము.

అందుచేతనే గాయత్రి మంత్రం బ్రాహ్మణులకోసం ఏర్పడగా పంచదశి మహామంత్రం అన్ని వర్ణాలవారికోసం ఏర్పడింది అన్నాడు అగస్త్యమహర్షి ఇంకా చెప్పాలి అంటే గాయత్రీ మంత్రము, పంచదశి మహామంత్రము రెండూ ఒక్కటే. ఈ రెండింటి అర్ధం కూడా ఒక్కటే. శరీరాదులను రక్షించటంచేత గాయత్రి అని, తేజస్వరూపమవటంచేత సావిత్రి అని, వాగ్రూపం కావటంచేత సరస్వతి అని చెప్పబడుతోంది.

సవితృద్యోతనా స్సైవ సావిత్రీ పరికీర్తితా

ప్రపంచాన్ని సృజించి ప్రకాశింపచేస్తుంది. కాబట్టి సావిత్రి అనబడుతోంది.

జాతః ప్రసవితృత్వాన్ వాగ్రూపత్వా త్సరస్వతీ
వాగ్రూపము గలది కాబట్టి సరస్వతి. ఇరవైనాలుగు అక్షరాలతో ఏర్పడ్డ ఛందస్సే గాయత్రి. ఛందస్సులు అనేకరకాలున్నాయి. కాని బ్రహ్మజ్ఞానానికి ద్వారం గాయత్రి ఛందస్సు, ఆ గాయత్రియే సోమరసాన్ని తెచ్చి దేవతల కిచ్చింది. 

ఛాందోగ్యోపనిషత్తులో
ఒకసారి దేవతలంతా గాయత్రి, త్రిష్టప్, జగతి ఛందస్సులను సోమాన్ని తీసుకురమ్మని పంపారు. వీటిలో త్రిష్టప్, జగతి ఛందస్సులు సోమాన్ని తేలేక తిరిగి వచ్చేశాయి. అంతేకాకుండా తిరిగివస్తూ త్రోవలో అలసట కారణంగా తమలోని కొన్ని అక్షరాలను వదలివేశాయి. గాయత్రి మంత్రం సోమం దగ్గరకు వెళ్ళి, దాన్ని రక్షించే వారందరినీ ఓడించి సోమాన్ని తెచ్చి దేవతలకిచ్చింది. తిరిగివచ్చేటప్పుడు త్రోవలో త్రిష్టప్ జగతి ఛందస్సులు వదలివేసిన అక్షరాలను కూడా తీసుకువచ్చింది. ఆ కారణంగా గాయత్రి ఛందస్సు అన్నింటికన్నా గొప్పది అయింది. అంతేకాకుండా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మూడింటిలోనూ వ్యాప్తమై ఉన్నది. బ్రాహ్మణునికి అత్యంతావశ్యకమవటం చేత దాని గౌరవము ఇనుమడించింది. అందుచేతనే గాయత్రిని ఉపేక్షించిన వాడు దేన్నీ పొందలేడు. గాయత్రి ఛందస్సులో 24 అక్షరాలు ఒక్కొక్క పాదానికి ఆరు చొప్పున నాలుగు పాదాలుగా ఉన్నాయి. ఇతర ఛందస్సులలో ఇంకా ఎక్కువ అక్షరాలున్నాయి. కాని వాటన్నింటిలోకి గాయత్రియే శ్రేష్టమైనది. స్థావరజంగమాత్మకమైన ప్రాణి సమూహమంతా గాయత్రియే. వాక్కు - గాయత్రి, సమస్త ప్రాణాలు - గాయత్రి, వాగ్రూపమైన గాయత్రి అందరి పేర్లనూ ఉచ్చరిస్తోంది. కాబట్టి గాయత్రి అందరి పేర్లలోనూ ఉన్నది. ఈరకంగా ప్రాణి జాతి అంతా గాయత్రియే. 

గాయత్రి అంటే ప్రాణులను రక్షించేది అని అర్ధం. ఈ లక్షణాలుగల గాయత్రి ఈ పృథివే తప్ప వేరేకాదు. చరాచరాలన్నీ ఈ భూమిలోనే ఉన్నాయి. అందుచేతనే చరాచరజగత్తునంతటనూ గానంచేస్తూ, పాడుతూ, త్రాణంచేస్తూ - కాపాడుతూ ఉండే గాయత్రియే ఈ భూమి. పృథివీ రూపమైన గాయత్రి శరీరంలో ఉండే పంచభూతాలు, ఇంద్రియాల సమూహము ఒక్కటే. పురుషుని శరీరరూపమైన గాయత్రి, పురుషుని హృదయకమలంలో ఉండే పురుషుడు ఇద్దరూ ఒకటే. ఆ పురుషునిలోనే అంటే గాయత్రిలోనే ప్రాణాలు ప్రతిష్టితమై ఉన్నాయి అని చెప్పబడింది. 

బృహదారణ్యకోపనిషత్తులో గాయత్ర్యోపాసన వివరిస్తూ “ఉపనిషత్తులో చెప్పిన 'భూమి, అంతరిక్ష్యం, ద్యౌః' ఈ మూడు పదాల్లోనూ మొత్తం ఎనిమిది అక్షరాలున్నాయి. ద్యౌః అనే పదంలో దకార యకారాలను రెండు అక్షరాలుగా లెక్కపెట్టాలి. ఇవి మూడులోకాల పేర్లు. గాయత్రి మంత్రానికి పాదానికి ఎనిమిది అక్షరాలున్నాయి.మూడు పాదాలున్నాయి. కాబట్టి మూడు లోకాలు మొదటి పాదం. ఈ రకంగా మూడులోకాలను గురించి తెలుసుకున్నవాడు ముల్లోకాలను జయిస్తాడు.

ఉపనిషత్తులో చెప్పిన 'ఋచ యజాంసి సామాని' అనే మూడుపదాల్లోనూ ఎనిమిది అక్షరాలున్నాయి. ఇవి గాయత్రికి రెండోపాదం. అంటే వేదాలు రెండవ పాదమన్నమాట. ఈ విషయం తెలుసుకున్నవాడు త్రయీవిద్య అనగా వేదవిద్యవల్ల వచ్చే ఫలితాన్ని పొందుతాడు. 

మంత్రంలో చెప్పిన 'ప్రాణ అపాన వ్యానం' అనే దాంట్లోని ఎనిమిది అక్షరాలు గాయత్రికి మూడవపాదం. ఇక్కడ వ్యా అనే అక్షరంలో వకార యకారాలను రెండు అక్షరాలుగా లెక్కపెట్టాలి. ఈ (అంటే ప్రాణాలను నడపడం) విషయం తెలుసుకున్నవాడు సమస్తాన్ని పొందుతాడు.

ఉపనిషత్ మంత్రంలో 'తురీయదర్శి తంపదం' అనేది నాల్గవపాదము. 'దర్శితపదం' అనే పదానికి ఆదిత్యమండలాంతర్గతుడైన పురుషుడు కనిపిస్తున్నాడని అర్ధం. అంటే అన్ని లోకాలకు పైన ఆధిపత్యం స్థాపించి ప్రకాశిస్తున్నాడు. ఈ రకంగా గాయత్రిలో నాల్గవపాదం తెలుసుకున్నవాడు కీర్తితో ప్రకాశిస్తాడు. తురీయపదం సత్యంలో ప్రతిష్టితమై ఉన్నది. నేత్రమే సత్యం. ఏదైనా ఒక విషయాన్నినేను చూశాను. నేను విన్నాను అని చెప్పినప్పుడు చూసినదాన్నే నమ్మటం జరుగుతుంది. అందుచేతనే నేత్రం సత్యం. తురీయపాదానికి ఆశ్రయమైన సత్యం బలంలో ప్రతిష్ఠితమై ఉన్నది. అందుకనే సత్యంకన్న బలం ప్రకాశమైనది. ప్రాణమే ఆ బలం. త్రిపద ా గాయత్రి ప్రాణాలను రక్షిస్తుంది. గాయత్రి ప్రాణంలో ప్రతిష్టితమై ఉన్నది. వాగాది ప్రాణాలను రక్షించేది గాయత్రి. గానము చేసే వాడిని రక్షించేది గాయత్రి. ఉపాసనచేసే వాణ్ణి రక్షించేది గాయత్రి. ఉపనయన సమయంలో వటువుకు త్రిపదగాయత్రి ఉపదేశిస్తారు.

అస్య శ్రీ గాయత్రీ మహామంత్రస్య విశ్వామిత్ర ఋషిః | గాయత్రీఛందః| శ్రీ సవితాదేవతా| యంబీజం| ఈం శక్తిహ్| ణం కీలకం| జపే వినియోగః 

న్యాసము : 
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే| వరేణ్యం విశ్వాత్మనే| భర్గోదేవస్యరుద్రాత్మనే| ధీమహి సత్యాత్మనే| ధియో యోనః జ్ఞానాత్మనే| ప్రచోదయాత్ సర్వాత్మనే || 

ధ్యానము:
ముక్తా విద్రుమ హేమ నీల దవాలచ్చాయై ర్ముఖై స్త్రీక్షణైః
యుక్తా మిందునిబద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం | 
గాయత్రీమ్ వరదాభయాం కుశకాశా శ్ముభ్రం కపాలం గదాం 
శంఖం చక్ర మధా రవిందయుగళామ్ హస్తయ్ ర్వహంతీమ్ భజే || 

మంత్రము : 

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం || భర్గోదేవస్య ధీమహి |
ధియోయోనః ప్రచోదయాత్ |

ఇది త్రిపదగాయత్రి. అయితే కొన్ని శాఖలవారు అనుష్టుప్ ఛందస్సులో ఉండే గాయత్రిని ఉపాసిస్తారు.
తత్సవితు ర్వృణీ మహే ౹ వయం దేవస్య భోజనం | శ్రేష్ఠం వై సర్వధాతమమ్ |
తురంగ భగస్య ధీమహి
వాక్కే అనుష్టుప్. వాక్కే శరీరంలో ఉండే సరస్వతి. కాబట్టి వాక్స్వరూపమైన సరస్వతిని వీరికి ఉపదేశిస్తున్నామని వీరికి నమ్మకం. గాయత్రి ఉపాసకుడు ఆవులు, గుర్రాలు, భూమి దానంగా తీసుకున్నా దానివల్ల కలిగే దోషం మొదటి పాదాన్ని జపిస్తే పోతుంది. వేదవిద్యతో సమానంగా దానం తీసుకున్నా ఆ దానం వల్లవచ్చే పాపం మంత్రంలోని రెండవపాదాన్ని జపం చేస్తే పోతుంది. “లోకంలో ఉన్న ప్రాణాలన్నీ దానం తీసుకున్నా, ఆ పాపం మూడవపాదం జపం చేస్తే పోతుంది. అంటే గాయత్రిమహిమ చాలా గొప్పది” అని చెప్పబడింది.

శుద్ధ గాయత్రీ ప్రత్యక్షరం బ్రహ్మైక్య బోధితా
శుద్ధగాయత్రిలోని ప్రతి అక్షరము పరబ్రహ్మను గురించే బోధిస్తున్నది. అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని వివరిస్తుంది.

మహా మంత్రస్య చాపస్య స్థానే స్థానే పదే పదే
గూడో రహస్య గర్భేన | న్తో ప దేశ సముచ్ఛయః |
గాయత్రీ మహామంత్రంలోని ప్రతి అక్షరంలోనూ, ప్రతిస్థానమందు మహా రహస్యమున్నది.
గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేసేవారికి ఇహపరసుఖాలు పూర్తిగా లభిస్తాయి.
హృదయపద్మమందు అధిష్టించి ఉన్న గాయత్రిని ఉపాసన చేసేవారు ధర్మాధర్మవిముక్తులై ముక్తిని పొందుతారు. గాయత్రీమంత్రానికి 24 అక్షరాలున్నాయి. ప్రజాపతి సంవత్సర స్వరూపుడు. అతడే కాలస్వరూపుడు. సంవత్సరానికి 12 మాసాలు. మాసానికి రెండు పక్షాలు. ఈ రకంగా  24 పక్షాలుంటాయి. ఆ 24 పక్షాలే గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. సంవత్సరానికి
మూడుకాలాలు.

1. వేసవి కాలము 2. వర్షాకాలము 3. శీతాకాలము. వీటి స్వరూపంగానే గాయత్రీ మంత్రము మూడు పాదాలుగా ఉన్నది. మంత్రంలోని మూడుపాదాలు 1. భూలోకం 2. భువర్లోక 3. సువర్లోకాలకు ప్రతీక. అందుచేతనే ఆ పాదాలను లోకాలకు అన్వయించి ధ్యానించాలి.

1. మొదటిపాదము : భూలోక సమన్వయము. భౌతికమైన సృష్టిరూపంలో ధ్యానం చెయ్యాలి.
2. రెండవ పాదము : భువర్లోక సమన్వయము. అంటే శక్తి మయాత్మకరూపంలో ధ్యానం చెయ్యాలి.
3. మూడవ పాదము : సువర్లోక సమన్వయము. అంటే ప్రజ్ఞామయాత్మక దృష్టితో ధ్యానం చెయ్యాలి.

ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు ముందు ద్రవ్యాత్మక లోకానికి అధిష్టాన దేవతలయిన అష్టవసువులు అనుగ్రహం కలుగుతుంది. ఆ తరువాత శక్తి మయాత్మక లోకానికి అధిష్టాన దేవతలయిన ఏకాదశరుద్రుల అనుగ్రహం కలుగుతుంది. అటుపైన ప్రజ్ఞామయాత్మకలోకానికి అధిష్టానదేవతలయిన ద్వాదశాదిత్యుల అనుగ్రహం కలుగుతుంది. గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరానికి ప్రత్యేకమైన అర్ధం ఉన్నది. ఇప్పుడా అర్ధాన్ని వివరిస్తున్నాం.

ఓమ్ - బ్రహ్మ, భూః - ప్రణవస్వరూపము, భువః -దుఃఖనాశనము, స్వః- సుఖస్వరూపము, తత్ - ఆ 
సవితుః -  తేజస్సుచే ప్రకాశించు, దేవస్య - దేవుని యొక్క, వరేణ్యం - శ్రేష్ఠమైన, భర్గః - పాపనాశనమైన తేజమును, ధీమహి - ధ్యానింతును, యః - ఏదైతే, నః - మా యొక్క, ధియః - బుద్ధులను, ప్రచోదయాత్ - ప్రేరేపించునో, ఆ తేజస్సును ధ్యానింతును.

పంచదశీ మహామంత్రము గాయత్రీమంత్రము రెండూ ఒక్కటే అని చెబుతూ భాస్కరరాయలవారు తమ వరివశ్యా రహస్యంలోని 60, 61, 63 శ్లోకాలలో పంచదశీ మహామంత్రానికి గాయత్రి మంత్రార్థం నిరూపించారు. 
          పంచదశీ మహామంత్రంలోని కకారానికి సర్వజగత్తునూ సృష్టించాలనే కోరిక గల బ్రహ్మ అని అర్ధం. గాయత్రీ మంత్రంలోని మొదటి మూడుపదాలకు బ్రహ్మ అని అర్ధం. పంచదశిలో రెండవ అక్షరమైన ఏ కారానికి గాయత్రీ మంత్రంలోని సవితుః - శ్రేష్టమైన అని అర్ధం. మూడువ అక్షరమైన ఈ కారము గాయత్రి మంత్రంలోని భర్గోదేవస్యధీ అయిన పరమేశ్వరుణ్ణి సూచిస్తుంది.

          ఈ రకంగా శ్రీవిద్యలోని ప్రధమకూటమిలోని అక్షరాలు గాయత్రీమంత్రంలోని ప్రధమపాదంచే తెలియబడు జగత్కారణభూతులైన కామేశ్వరీ కామేశ్వరులను చెబుతోంది. వారిద్దరి సామరస్యమే పరమశివుడు. అతని పరిణామమే ఈ జగత్తు. అతడే సమస్త బుద్ధులకు ప్రేరకుడు. త్రిగుణాతీతుడు. ప్రణవస్వరూపుడు.

             గాయత్రీ మంత్రంలోని మహి అనే శబ్దము శ్రీవిద్యలోని ల కారాన్ని సూచిస్తున్నది. ల కారమనేది పృథివీ బీజం. కాబట్టి దాని నుంచి పంచభూతాత్మకమైన జగత్తు తెలుస్తుంది. ఈ జగత్తంతా పరమేశ్వరునివల్ల సృష్టించబడింది. ఆ పరమేశ్వరుని ప్రతిబింబమే మహాత్రిపురసుందరి.

గాయత్రీమంత్రంలోని చివరి రెండుపాదాల అర్ధం శ్రీవిద్యలోని హ్రీం కారముచే సూచించబడుతుంది. ఈ రకంగా గాయత్రి, పంచదశి మహామంత్రాల అర్ధం ఒక్కటే. దేవీ భాగవతంలోని 12వ స్కంధంలో గాయత్రీమంత్రాన్ని వివరించారు. ఈ మంత్రానికి 24 మంది ఋషులు, 24 ఛందస్సులు, 24 మంది దేవతలు, 24 శక్తులు, 24 రంగులు, 24 వర్ణతత్త్వాలు 24 వర్ణముద్రలు చెప్పబడ్డాయి. వాటిని కూడా ఇక్కడ ఉటంకిస్తున్నాం.

గాయత్రీ మంత్రానికి 24 మంది ఋషులున్నారు. వారు
1. వామదేవుడు 2. అత్రి. 3. వశిష్ఠుడు 4. శుక్రుడు 5. కణ్వుడు 6. పరాశరుడు 7. విశ్వామిత్రుడు
8. కపిలుడు 9. శౌనకుడు 10. యాజ్ఞవల్క్యుడు 11. భరద్వాజుడు 12. జమదగ్ని 13. గౌతముడు
14  అగస్త్యుడు 15 కౌశికుడు 16  వ్యాసుడు 17. వత్సుడు 18 పులత్స్యుడు 19 మాండూకుడు
20 ముద్గలుడు 21 దుర్వాసుడు 22నారదుడు 23 లోమశుడు 24. కశ్యపుడు

గాయత్రీ మంత్రానికి 24 ఛందస్సులున్నాయి. అవి
1. గాయత్రి 2. శక్వరి 3 ఆకృతి 4 ఉష్ఠిక్ 5. అతిశక్వరి 6. అనుష్టుప్ 7. ధృతి 8. సంకృతి 9.బృహతీ 10 అతిధృతి 11. అక్షరపంక్తి 12. త్రిష్టుభము 13. విరాట్ 14. భూః 15 పంక్తి 16 ప్రసారపంక్తి 17 ర్భువః 18 జగతి 19 స్వః 20 అతిజగతి 21 ప్రకృతి 22. జ్యోతిష్మతి 23 వికృతి 24. కృతి 

గాయత్రీ మంత్రానికి దేవతలు 24 మంది ఉన్నారు. వారు
1. భగుడు 2. మైత్రావరుణుడు 3. ప్రజాపతి 4 యముడు 5. వైశ్వదేవుడు 6. చంద్రుడు 7. గణేశుడు 8. మాతృకలు 9. ఈశానుడు 10. త్వష్ట 11. విష్ణువు 12. సవిత 13. పూష 14 వసువు 15. ఆదిత్యుడు 16. ఇంద్రాగ్ని 17 రుద్రుడు 18. బృహస్పతి 19. వాయువు 20. కుబేరుడు 21 మైత్రావరుణుడు 22. వామదేవుడు 23. అశ్వనీకుమారులు 24.అగ్ని
ఈ దేవతలలో మైత్రావరుణుడు పేరున్నవారు ఇద్దరున్నారు. అంతేకాని పొరపాటుకాదు.

గాయత్రీమంత్రానికి 24 శక్తులున్నాయి. అవి
1. వామదేవి 2. కాంతా 3. సూక్ష్మా 4. ప్రియా 5. విశ్వయోని 6. సరస్వతీ 7. విజయా 8. విశ్వభద్ర 9. విద్రుమా 10. వశా 11. విలాసినీ 12. విశాలేశా 13. పద్మాలయా 14. ప్రభావతి 15. వ్యాపినీ 16. పరాశోభా
17 జయా 18. విమలా 19. భద్రా 20 శాంతా 21 తమోపహారిణీ 22. త్రిపదా 23. దుర్గా 24. సత్యా 

గాయత్రీ మంత్రానికి వర్ణాలు (రంగులు) 24 అవి.
1. సంపంగి 2. పద్మరాగము 3. పసుపు 4. అవిసె 5. ఇంద్రనీలమణి  6. పాలమిశ్రణము 7. పగడము
8. ముత్యము 9. సూర్యకాంతి 10. స్పటికము 11. కుంకుమ 12. చిలుకతోకరంగు 13. పద్మపుష్పము
14. కాటుక 15. శతపత్రకాంతి 16. బాలాదిత్యుడు 17 రక్తము 18. కౌతకీపుష్పము 19. శంఖకుందేలు
20. వైడూర్యము 21. మల్లికాకుసుమము 22. పగడము 23. కరవీరపుష్పకాంతి 24. తేనె

గాయత్రీ మంత్రానికి 24 వర్ణతత్త్వములున్నాయి. అవి
1. నేల 2 చక్షువు 3. నీరు 4. చర్మము 5. కాంతి 6 వాక్కు 7. శోత్రము 8 గాలి 9. పాణి, పాదము 10. ప్రాణము 11. ఆకాశము 12. పాయు 13. అపానము 14.గంధము 15.వ్యానము 16. రసము 17. ఘ్రాణము 18.ఉదానము 19. రూపము 20.జిహ్వా 21.సమానము 22. స్పర్శ 23. శబ్దము 24. ఉపస్థ

గాయత్రీ మంత్రానికి 24 రకాల ముద్రలున్నాయి. అవి.
1. సుముఖము 2. షణ్ముఖము 3 ముష్టికము 4. సంపుటము 5. అధోముఖము 6. మత్స్యము 7. వితతము 8. వ్యాపకాంజలికము 9. కూర్మము 10.విస్తృతము 11. శకటము 12. వరాహము 13. ద్విముఖము 14. యమపాశము 15. సింహక్రాంతము 16. త్రిముఖము  17. గ్రధితము 18. మహక్రాంతము 19. చతుర్ముఖము 20. షణ్ముఖోన్ముఖము 21. ముద్గరము 22. పంచముఖము 23. ప్రలంబము 24. పల్లవము

అయితే ముఫైరెండు అక్షరాలు గల గాయత్రీ మంత్రానికి ముద్రలు ఈ విధంగా ఉంటాయి.

1. త్రిశూలము 2. లింగము 3. యోని 4. సురభి 5. అక్షమాలా 6. అంబుజము

ఈ రకంగా ఉన్న గాయత్రి మంత్రం బ్రహ్మ క్షత్రియ, వైశ్యులందరిచేత జపించబడుతోంది. అయితే
ఓంకారవ్యాహృతిపూర్వాం గాయత్రీం బ్రాహ్మణో జపేత్
త్రిష్టుభం చైవ రాజన్యో జగతీం వైశ్య ఏవ చ.

ఓం కారవ్యాహృతి పూర్వకమైన గాయత్రిని - బ్రాహ్మణులు
త్రిష్టుప్ ఛందస్సులో - క్షత్రియులు
జగతీ ఛందస్సులో - వైశ్యులు ఈ మంత్రాన్ని జపిస్తారు.

అంతేకాకుండా మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రానికి గాయత్రి ఉంటుంది.

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిిః ప్రచోదయాత్ |
మహాదేవ్యై చ విద్మహే | విష్ణుపత్యైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
గాయత్రీమంత్రం అత్యంత మహిమోపేతమైనది

పూర్వకాలంలో ఒకసారి అనావృష్టి వచ్చింది. దాదాపుగా పదిహేను సంవత్సరాలు వర్షపు చుక్కైనా కురవలేదు. పాడిపంటలు లేవు. చెట్లు చేమలు కూడా అంతరించి పోయాయి. భరించలేని కరువు. పశువులు గడ్డిలేక చచ్చిపోతున్నాయి. పసిపిల్లలకు పాలులేవు. ఆకలికి తాళలేక కొందరైతే మృతకళేబరాలను పీక్కుతినే స్థితికి వచ్చారు. ఇంతదాకా ఎందుకు పిల్లలకు పాలు ఇవ్వలేక, వారిని పెంచలేక గొంతు పిసికి చంపేసిన వారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఘోరకలి విలయతాండవం చేస్తోంది. ఆ రోజుల్లో కొంతమంది పండితులు ఒకచోట చేరి ఈ దుర్భర స్థితి నుంచి తప్పించుకోవటానికి మార్గం ఏమిటా అని ఆలోచించసాగారు. అప్పుడు వారికి గౌతముడు గుర్తు వచ్చాడు. గౌతముడు ఒక మహర్షి. మహాతపస్సంపన్నుడు. పరదేవతను ఆరాధిస్తూ ఉండేవాడు. ఆవిడ యొక్క కరుణవల్ల విత్తనాలు చల్లగానే అవి మొలకెత్తి ఫలితాన్ని ఇచ్చేటట్లుగా వరం పొందాడు. కాబట్టి ఇప్పుడు మనమంతా గౌతముడిని శరణువేడితే ఆ మహర్షి మనలను కరుణిస్తాడు అని ఆలోచించి గౌతముడి ఆశ్రమానికి ప్రయాణమయ్యారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఇంతమంది పండితులను చూసి, వారికేదో ఆపద వచ్చిందని గ్రహించి, వారిని ఆహ్వానించి ఆతిధ్యమిచ్చాడు గౌతముడు. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకుని, ప్రజలు ఆకలిదప్పులకు అల్లాడుతున్నారన్నమాట విని విచారించి ఆపరదేవతను ప్రార్ధించాడు.

నమో దేవి ! మహావిద్యే ! వేదమాతః ! పరాత్పరే !
వ్యాహృత్యాది మహామంత్రరూపే ! ప్రణవరూపిణి !
సామ్యావస్థాత్మికే ! మాతః ! నమో హ్రీంకార రూపిణి
స్వాహా స్వధా స్వరూపే ! త్వాం నమామి సకలార్ధదామ్
భక్తకల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం
కుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం
సర్వవేదాంత సంవేద్యాం సూర్యమండల వాసినీం
ప్రాతర్బాలాం రక్తవర్ణాం మధ్యాహ్నే యువతీం పరాం
సాయాహ్నే కృష్ణవర్ణాం తాం వృద్ధాం నిత్యం నమా మ్యహమ్ ||

ఆ దేవత మహిమవల్ల వచ్చిన వారందరికీ నివాసం ఏర్పాటుచేసి, గతంలో దేవత తనకిచ్చిన వరము ద్వారా వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఇంతకాలం అన్న పానాదులు లేక, అవి ఎలా ఉంటాయో కూడా మరచిపోయిన వాళ్ళకి ఆ పరదేవత దయవల్ల పంచభక్ష్యాలతో సమృద్ధిగా ఆహారం దొరికింది. ఆ ఆనందానికి తట్టుకోలేక అన్నదానం చేసి తమ ప్రాణాలని నిలబెట్టిన గౌతముణ్ణి వేనోళ్ళ కొనియాడారు. ఆ పరమేశ్వరిని పరిపరివిధాల స్తుతించారు. పండితులంతా యజ్ఞయాగాలు చెయ్యనారం భించారు. ఆశ్రమానికి ఎటు చూసినా నూరు యోజనాల వరకు ఆశ్రితులున్నారు. అందర్నీ సంరక్షిస్తున్నాడు గౌతముడు.

కొంతకాలానికి నారదుడు వచ్చి గౌతముడు చేస్తున్న పనికి మెచ్చుకుని “మహర్షీ ! ఆపదకాలంలో వీళ్ళని ఆదుకున్నావు. వారికోసం ఆ పరాశక్తి ఇచ్చిన వరం ఉపయోగించటం వల్ల నీశక్తి మరింతగా పెరిగింది. తనకున్న శక్తితో పదిమందికీ ఎవరైతే ఉపకారం చేస్తారో వారి శక్తి ద్విగుణీకృత మౌతుందని చెప్పబడింది. ఇప్పుడు నీకూ అదే జరిగింది. ఇంద్రాది దేవతలంతా నువు చేస్తున్న పనిని వేనోళ్ళ కొనియాడుతున్నారు” అన్నాడు. ఈ మాటలు విన్న పండితులకు ఈర్ష్య కలిగింది. గౌతముడికి ఇంత పేరు రావటం వాళ్ళు సహించలేక పోయారు. ఎలాగైనా సరే గౌతముడి ప్రతిష్ఠకు మచ్చ కలిగించాలి అనుకున్నారు.

వానలు పడటం మొదలు పెట్టాయి. క్రమంగా నేల చల్లబడింది. ఏరులు పారాయి. నదులు పొంగాయి. విత్తనాలు మొలకెత్తుతున్నాయి. పండితులు కూడా వెళ్ళిపోవటానికి సన్నద్ధమౌతూ మాయాగోవును ఒకదాన్ని సృష్టించారు. అది వచ్చి ఆశ్రమ ప్రాంగణంలోని పంటను, ఆహారాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టింది. అది చూసిన గౌతముడికి కోపం వచ్చింది. ఆవును కొట్టటం ఇష్టం లేక అదిలించాడు. అంతే ఆ అదిలింపుకు మాయాగోవు కింద పడి చచ్చిపోయింది. ఇదంతా చాటునుంచి చూస్తున్న పండితులు “గౌతముడు గోవును చంపాడు. గోహత్య మహాపాతకం. ఇంక ఇతడి ఇంట భోజనం చెయ్యటం కూడా పాపం. మేం వెళ్ళిపోతున్నాం” అని చెప్పి బయలుదేరారు. అది మాయ అని తెలియక గౌతముడు వారిని బ్రతిమాలాడు. ఈ పాపం పోయే ఉపాయం చెప్పమన్నాడు. అప్పుడు వారు గౌతముడికి అసాధ్యమయ్యేపని ఏదా ? అని ఆలోచించి చివరకు గంగను తెచ్చి గోవుమీద ప్రవహింపచేస్తే ఈ పాపం పోతుందన్నారు.

గౌతముడు చాలా సంవత్సరాలు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై గౌతముడి కోర్కె ప్రకారం తన జటాజూటం నుంచి రెండు బొట్లు విదిల్చాడు. అంతే చచ్చిన గోవు లేచి నుంచుంది. ఈరకంగా గౌతముని చేత తేబడింది కాబట్టి గౌతమి అనీ, గోవును బ్రతికించటానికి వచ్చింది కాబట్టి గోదావరి అనీ ఆనదికి పేరు వచ్చింది. ఆవు లేచి నుంచోగానే 'గౌతముడు మాయాగోవును బ్రతికించాడు' అని గేలిచేశారు పండితులు. దివ్య దృష్టితో అసలు విషయం తెలుసుకున్న మహర్షి వారిమీద కోపించి “ఇక నుంచీ గాయత్రీ జపం మీకు నిష్పలమవుతుంది. వేదాధ్యయనం, యజ్ఞకర్తవ్యం మీకు ఉండవు. మీరంతా ధర్మహీనులు, నీతిదూరులు అయి భ్రష్టుపట్టిపోతారు. వావీ వరుసాలేకుండా పశువుల్లా ప్రవర్తిస్తారు. తరతరాలకు మీగతి ఇంతే” అని శపించాడు. చేసిన తప్పు క్షమించమని పండితులంతా ప్రాధేయపడగా ద్వాపరయుగంలో
పరమేశ్వరి అంశతో యదువంశంలో నందగోవుని ఇంట శ్రీకృష్ణుడు పుడతాడు. అతని
జన్మతో మీకు శాపవిమోచన మవుతుంది అన్నాడు. ఈ రకంగా పండితులు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి, పరమేశ్వరి దయవల్ల మళ్ళీ గాయత్రీ అనుష్ఠానం చేసి బ్రహ్మతేజస్సును పొందారు. గాయత్రి జపం చేసినవాడు బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతాడు.

Popular