Search This Blog

343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ

జగన్మాతయే క్షేత్రక్షేత్రజ్ఞ పాలిని. దేహము, దేహి ఈ రెండింటినీ పాలించేది.

క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. క్షేత్రము అంటే శరీరము. విష్ణుస్మృతిలో “ఓ భూదేవీ ! ఈ శరీరమే క్షేత్రము అనబడుతోంది. దీన్నిగురించి తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు. అన్ని శరీరములందు నేనే క్షేత్రజ్ఞుడుగా గుర్తించు” అని విష్ణుమూర్తి చెబుతాడు.

భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్రీ కృష్ణభగవానుణ్ణి అర్జునుడు అడుగుతాడు.

ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ |
ఏత ద్వేదితు మిచ్ఛామి జ్ఞానం జేయం చ కేశవ ||

కేశవా ! ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్జీయము వీటన్నింటిని గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఆ మాటవిన్న శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు.

ఇదం శరీరం కౌంతేయ ! క్షేత్ర మి త్యభిధీయతే |
ఏత ద్యో వేత్తి తం ప్రాహః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||

కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రము. దీనిని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. అని ఈ రెండు విషయాలు తెలిసినవాళ్ళు చెబుతున్నారు.

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ! |
క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జనం యత్తద్ జ్ఞానం మతం మమః ||

అర్జునా ! క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరి అయినది. పూర్వకాలంలో మహర్షులు ఎన్నోరకాలుగా క్షేత్ర క్షేత్రజ్ఞతత్వాన్ని చాటిచెప్పారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ స్వరూపాన్ని నిరూపించాయి.

మహాభూతా స్యహంకారో బుద్ధి రవ్యక్త మేవ చ |
ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ||
ఇచ్చాద్వేష స్సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్ ||

పంచభూతాలు, అహంకారము, బుద్ధి, మూలప్రకృతి దశేంద్రియాలు, మనస్సు, ఇంద్రియాల విషయాలు. సుఖం, దుఃఖం, కోరిక, ద్వేషం, తెలివి, ధైర్యం ఈ వికారాలతో పాటు వీటి సముదాయాన్ని కలిపి క్షేత్రం అంటారు. అని చెబుతాడు.

లింగపురాణంలో

చతుర్వింశతితత్త్వాని క్షేత్రశబేన సూరయః |
ఆహుః క్షేత్రజ్ఞ శబేన భోక్తారం పురుషం తథా ||

ఇరవై నాలుగు తత్వాలను పండితులు క్షేత్రము అంటున్నారు. వాటిని అనుభవించే వాడు క్షేత్రజ్ఞుడు అన్నారు.

వాయుపురాణంలో

అవ్యక్తం క్షేత్రముద్దిష్టం బ్రహ్మాక్షేత్రజ్ఞ ఉచ్యతే

అవ్యక్తము క్షేత్రము. బ్రహ్మ క్షేత్రజ్ఞుడు అని చెప్పబడింది.

బ్రహ్మపురాణంలో శరీరాలు క్షేత్రాలు, వాటిని ఎరిగినవాడే యోగాత్మ. అందువలన అతడే క్షేత్రజ్ఞుడు అనగా శరీరంతో
చేరిన జీవుడే క్షేత్రజ్ఞుడు అని చెప్పారు.

మనుస్మృతిలో ఎవరు ఆత్మల లేదా జీవులతో క్రియలను చేయిస్తాడో అతడే క్షేత్రజ్ఞుడు. క్రియలుచేసేవాడు భూతాత్మ. జీవుడు అనే పేరుగల అంతరాత్మ అన్ని దేహాలలోనూ ఉంటాడు. ఆ జీవుడివల్లనే గతజన్మలలోని సుఖదుఃఖాలు తెలుస్తున్నాయి. ఈ క్షేత్రజ్ఞుడు అన్ని ప్రాణులయందు అంటే ఉన్నతము, నీచము అయిన సర్వప్రాణులయందు వ్యాపించి ఉంటాడు. అతడి నుంచి లెక్కలేనన్ని దేహాలు ఆవిర్భవిస్తున్నాయి. అతడే అన్ని ప్రాణులను క్రియావంతులుగా చేస్తున్నాడు.

క్షేత్రము అంటే సర్వప్రాణుల శరీరములు అని ఇంకొకసారి చెబుతున్నాం. కేవలము మానవులే కాదు. క్రిమికీటకాలు, జంతువులు, పశుపక్ష్యాదుల శరీరాలు కూడా క్షేత్రాలే. ఆ క్షేత్రాలకు అధిపతి వాటిలోనే ఉన్న జీవాత్మ లేదా అంతరాత్మ. అదే క్షేత్రజ్ఞుడు. ఈ రెండింటినీ అంటే క్షేత్రము క్షేత్రజ్ఞులను పాలించేది ఆ పరమాత్మ. నిజానికి జీవాత్మ పరమాత్మ వేరు కాదు. కానీ అజ్ఞానం వలన జీవాత్మ పరమాత్మకు దూరమై శరీరమే తాను అనే భ్రమలో ఉంటున్నాడు. ఈ భ్రమ తొలగిపోయి మళ్ళీ జీవాత్మ పరమాత్మలో ఐక్యమవ్వడమే యోగం, ఆత్మసాక్షాత్కారం, మానవ శరీరం యొక్క అంతిమ లక్ష్యం.

Popular