ఒక నగరంలో బాగా పేరు మోసిన వైజ్ఞానికుడు ఉన్నాడు. ఫిజిక్స్లో అతనిని ఢీ కొట్టేవాడే లేడు. ఎన్నో గొప్ప సాంకేతిక పరిశోధనలు చేశాడు. సంఘంలో మంచి గౌరవం సంపాదించుకున్నాడు. అతను నాస్తికుడు. అందరి ముందు నిర్భయంగా దేవుడు లేడు అని వాదిస్తుంటాడు. జరిగే సృష్టి స్థితి లయ ప్రకృతి అనంత విశ్వం బ్రహ్మాండం ఇదంతా అణువు లతో తయారయింది. ఇది సైన్సు. ఇది ఇలాగే ఎందుకు ఉంది అంటే దానికి సమాధానం ఇది కేవలం యాదృచ్ఛికం అనే చెప్పాలి. అంతేగానీ ఇందులో దేవుడి పాత్ర ఏమీ లేదు. దైవభక్తి కేవలం ఒక మూఢ నమ్మకం అని వాదించేవాడు. అతని భార్యకి గొప్ప దైవ భక్తి. ఆవిడ మంచి చిత్రకళా నైపుణ్యం కలది. దైవభక్తి విషయంలో భర్త ప్రవర్తనకు నొచ్చుకునేది. ఒకరోజు ఆమె ప్రకృతి సౌందర్యానికి అద్దంపట్టేటటువంటి చిత్రపటం ఒకటి గీసింది. భర్తకు చూపించింది. అది చూసి భర్త భేష్! చాలా బాగా గీశావు. నీ చిత్ర కళా నైపుణ్యం శ్లాఘనీయం అన్నాడు. అప్పుడు ఆవిడ ఆబ్బె! ఇందులో నా పాత్ర ఏమీ లేదండి. ఇది కేవలం యాదృచ్ఛికం. కొన్ని అణువులు రంగులు వాటంతటవే చిత్రపటంలో అమరిపోయాయి. ఇది సైన్సు. అన్నది. భార్య మాటలకు ఖంగుతిన్న సైంటిస్ట్ తన వాదనలో తప్పు తెలుసుకున్నాడు.
మీరు నిలుచున్న చోటు నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. మీ కాళ్ళ కింద ఉన్న నేల. నేల ఉన్న ఇల్లు. ఇల్లు ఉన్న వీధి. వీధి ఉన్ననగరం. నగరం ఉన్న దేశం. దేశం ఉన్న ఖండం. ఖండం ఉన్న మహా సముద్రం. మహాసముద్రాలు ఉన్న భూగోళం. నవగ్రహాలు. సూర్యుడు. పాలపుంత. ఇవన్నీ ఉన్న ఆకాశం. ఆ ఆకాశంలోని మేఘాలు. మేఘాల నుండి వచ్చే వర్షం. దాని నుండి వచ్చే వృక్షములు. వాటినుండి వచ్చే ఫలములు. వాటి వలన వచ్చే జీవములు. భూమి క్షితిజం సూర్యునికి 17 డిగ్రీల కోణంలో ఉండటం. దానివలన వస్తున్న ఋతువులు. ఆ ఋతువుల వలన సాగే వ్యవసాయం. దాని ద్వారా వచ్చే పాడి పంట . తద్వారా జరిగే అనేక వ్యాపారములు. ఇవన్నీ ఒక చరాచర సమతుల్యత. వర్షం ఎక్కువ అవ్వకూడదు తక్కువ కాకూడదు. ఉష్ణోగ్రత ఎక్కువ అవ్వకూడదు తక్కువ కాకూడదు. భూమి ఒక్క అడుగు కదిలితే పెద్ద భూకంపం. ప్రకృతిలోని సమతుల్యత కొంచెం తప్పినా జీవములకు మనుగడ కష్టమే. మరి ఇంతటి సమతుల్యతను కాపాడుతున్నది ఎవరు? బ్రహ్మాండం విసర్జించేది పిండాండం తీసుకుంటుంది. పిండాండం విసర్జించేది బ్రహ్మాండం తీసుకుంటుంది. వీటికి ఈ సమన్వయం ఎలా వచ్చింది? ఎవరూ నేర్పక పోయినా తనంతట తానే నేర్చుకో గలిగె చైతన్యం మనిషికి ఎలా వచ్చింది? ఇదంతా అమ్మ వల్లే. ఆవిడ యావత్ సృష్టికి రాజ్ఞి. అంతా సృష్టించి, సమతుల్యత, సమన్వయము ఏర్పరిచి, తన శాశనాలతో ఏది ఎలా జరగాలో నిర్దేశించింది. మనకు మాత్రం స్వేచ్ఛనిచ్చింది. అదే ఆవిడ గొప్పతనం. అందుకే శ్రీ మహారాజ్ఞి అన్నారు.