Search This Blog

871. బహిర్ముఖసుదుర్లభా


బాహ్యవిషయాలయందు ఆసక్తిగల వారికి లభించనిది. దుర్లభమైనది. తనలో ఉన్న ఆత్మయే పరమేశ్వరుడు అని తెలుసుకోలేనివారికి లభ్యము కానిది. ఇంద్రియాల ద్వారా ఆత్మను దర్శించాలనుకునేవారికి దుర్లభమైనది. విషయ లంపటాలలో చిక్కుకుని ఉన్నవారు స్వాధ్యాయం చేస్తూ ముందు కొంత జ్ఞానం సంపాదించాలి. తరువాత మెల్లగా దృష్టిని విషయ వ్యాపారాలనుంచి ఆత్మ వైపు మళ్లించాలి. అప్పుడు వారు అంతఃపూజ చేయ గలుగుతారు. 

పూర్వకాలంలో ఒకసారి ఇంద్రుడికి బ్రహ్మతత్త్వాన్ని గురించి తెలుసుకోవాలనిపించింది. ఆ కాలంలో దధ్యుడు అనే మహర్షి చాలా శ్రేష్ఠుడు. బ్రహ్మజ్ఞాని. అందుకని అతని దగ్గరకు వెళ్ళి "స్వామీ ! మీవల్ల నాకు ఒక సహాయం కావాలి” అన్నాడు ఇంద్రుడు. "చేస్తాను” అనే మాటను మహర్షి దగ్గర తీసుకున్న తరువాత ఇలా అన్నాడు, “నాకు పరబ్రహ్మ తత్త్వాన్ని గురించి తెలియజెయ్యండి” అని. ఆ మాటలు విన్న దధ్యుడు కొంచెంసేపు మాట్లాడలేదు. అది చూచి, మహర్షి ఏదో సంశయిస్తున్నాడని గ్రహించి “ఏమిటి మహర్షి ఆలోచిస్తున్నావు. నాకు బ్రహ్మవిద్య చెబుతావా లేదా?" అన్నాడు ఇంద్రుడు. ఆలోచించాడు మహర్షి. చెబితే అపాత్రదానం చెప్పకపోతే అసత్యపాపం.  ఏం చెయ్యాలో పాలుపోలేదు మహర్షికి. మళ్ళీ ఇంద్రుడే "ఏం మహర్షీ ! మాటిచ్చావు నిలబెట్టుకుంటావా లేదా?' అన్నాడు. చేసేందేంలేక  ఇంద్రుణ్ణి మర్నాడు ఉదయం మిగిలిన శిష్యులతో కలిసి రమ్మన్నాడు దధ్యుడు. మర్నాడు ఉదయం కౌపీనం ధరించి దర్భలు చేత్తో పట్టుకుని వచ్చాడు ఇంద్రుడు. అందరితోపాటే కూర్చున్నాడు. చెప్పటం మొదలు పెట్టాడు మహర్షి.

అంతా మిధ్య, కంటికి కనిపించేదేదీ నిజం కాదు ఈ రాజ్యాలు, సింహాసనము, అప్సరసలు, సుఖాలు ఏవీ నిజం కాదు అన్నాడు మహర్షి. ఆ మాటలు విన్న ఇంద్రుడు లేచి మహర్షీ నువ్వు అబద్దం చెబుతున్నావు. ఏది అసత్యం. నా రాజ్యామా నా సింహాసనమా, అప్సరసలా ? కేవలం నన్ను ఎగతాళి చెయ్యటానికే ఈ మాటలు చెబుతున్నావు. ఇలాంటి మాటలు ఇంకొకసారి చెప్పావంటే నీ తల నరికి పారేస్తాను జాగ్రత్త” అని హెచ్చరిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతని దృష్టిలో ఇంకా రాజ్యము. అప్సరసలూ అంతా నిజమే. కాబట్టి అటువంటి వాడికి బ్రహ్మవిద్యను చెప్పరాదు. వారికి పరబ్రహ్మ సాక్షాత్కారం కాదు. అందుకే ఆ పరమేశ్వరి బహిర్ముఖ సుదుర్లభా అనబడింది. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలోని 95వ శ్లోకంలో

పురారాతేరన్తః పురమసి తాత స్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా
తథా హ్యేతే నీతాశ్శత మఖముఖాస్సిద్ధి మతులాం
తవ ద్వారోపాన్తస్ధితిభి రణిమాద్యాభిరమరాః.ll

తల్లీ ! నీ పాదపద్మములను పూజించు భాగ్యము చపలచిత్తులైన వారికి లభించదు. ఇంద్రాదిదేవతలకు కూడా నిను సేవించే భాగ్యము లభించక నీ ద్వారము చెంతకావలి ఉన్నారు. స్థిరచిత్తులకే కాని చంచల చిత్తులకు నిన్ను సేవించే భాగ్యము లభించదు.

Popular