Search This Blog

851. జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ

ఆనందమే మనిషి యొక్క నిజ స్వరూపమైతే అసలు ఇన్ని రకాల బాధలు ఎందుకు పడుతుంటారు? ఈ నామంలో దీని రహస్యం తెలుసుకుందాం.  


పైన బొమ్మలో చూపినట్లే మన కర్మ మనమే అనుభవిస్తాము. అది సత్కర్మ అయితే సుఖం లభిస్తుంది. చెడ్డకర్మ అయితే కష్టం కలుగుతుంది. ఈ కష్టం సుఖం శరీరానికి కలుగుతాయి. జీవుడు మాయ వలన తన నిజస్వరూపం ఆత్మ అని మరచిపోయి ఈ శరీరమే తాను అనే భ్రమలో ఉన్నాడు. అందుకే శరీరానికి కష్టం వస్తే బాధ సుఖం వస్తే సంతోషంగా భావిస్తున్నాడు. శాస్త్రాధ్యయనం చేసిన విజ్ఞులు ఈ కష్ట సుఖాలను తాము పూర్వము చేసిన కర్మల ఫలితముగా ఎరిగి వాటి వలన చలించిపోకుండా ఉంటారు. ఈ శాస్త్రాలు అన్నీ అమ్మ స్వరూపాలే. 

పుట్టటము, పెరగటము, ముసలితనం, మరణం ఈ రకమైన శారీరక మార్పులవల్ల ప్రతి జీవి అవస్థ పడుతూనే ఉంటుంది. అటువంటి అవస్థలను జనులకు లేకుండాచేసేది అమ్మ లలితమ్మ. ఈ సంసార సాగరంలో పూర్వజన్మ కర్మఫలితం వలన జన్మించటం జరుగుతుంది. పుట్టిన ప్రతిజీవికి శారీరకావస్ధలు తప్పవు. మరణం తధ్యం. ఈ ప్రక్రియలో అనేకమైన కష్టాలను జీవి అనుభవిస్తాడు. ఈ కష్టాలు రెండు రకాలుగా ఉంటాయి. 

1. కర్మఫలం వల్ల వచ్చే కష్టాలు. ఇవి అనుభవించక తప్పదు.
2. మానసికమైన బాధలు. కష్టాలు అనుభవించవలసి వచ్చిందే అని జీవి బాధపడుతుంటాడు. 

కర్మఫలంవల్ల వచ్చే కష్టాలు ఎక్కుపెట్టి వదిలిన బాణం లాంటివి. వాటిని అనుభవించక తప్పదు. కేవలం సత్కర్మలే చేసి సుఖములు మాత్రమే పొందాలి అనే కాంక్ష హేతుబద్ధమైనది కాదు. తెలిసి తెలిసి తప్పులు చేయక పోయినా తెలియకుండా అనేకమైన తప్పులు జరుగుతుంటాయి. మనిషి ఊపిరి పీల్చితే కొన్ని లక్షల సూక్ష్మ జీవులు స్వాశకోశంలో చిక్కుకుని మరణిస్తాయి. దాని వలన చెడ్డ కర్మ అనుభవించవలసి వస్తుంది. దానిని ఆప గలమా? అవి అనుభవించాల్సి వచ్చింది అని మనం పడే బాధ అసలు కష్టం కన్న ఎక్కువైనది. ఈ రకమైన బాధలను ముందుగా రూపుమాపుతుంది లలితమ్మ . తన పిల్లలకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటంద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది. భౌతికమైన కష్ట సుఖాలు ఈ శరీరానికి తప్ప ఆత్మ స్వరూపమైన నాకు కాదు అనే స్థాయిని కలుగజేస్తుంది కాబట్టి జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ అనబడుతుంది

Popular