Search This Blog

792. సత్యజ్ఞానానందరూపా


ఇక్కడినుంచి 813వ నామం వరకు కపర్దినీ విద్య.

సత్యం జ్ఞానం ఆనందశ్చ రూపం యస్యాః

సత్యము, జ్ఞానము, ఆనందము రూపములుగా గలది. వేదంలో చెప్పినట్లుగా సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ. విజ్ఞానమానందం బ్రహ్మ. అక్షరమైనది. అనశ్వరమైనది. సత్యము అంటే - త్రికాలాబాధ్యమైనది. ఎల్లవేళలయందు ఉండేది. శాశ్వతమైనది. మాండూక్యోపనిషత్తులో చెప్పినట్లుగా త్రికాలాతీతం తదస్యం కారమేవ భూతభవిష్యద్వర్తమాన కాలాలు మూడింటికీ అతీతమైనది. అన్ని కాలాలలోను ఒకే రకంగా ఉండేది. వృద్ధిక్షయాలు లేనిది. నిత్యమైనది. అదే పరబ్రహ్మ. దానికి జాతిమతభేదాలు లేవు. తనవారు, బయటవారు అనే తేడాలేదు ఏకాకి. తనుగాక రెండవది ఏదీలేదు. ఇతరుల సహాయసహకారాలు లేకుండా ప్రకాశించేది. సూర్యచంద్రాగ్నులు ప్రకాశించటానికి కాంతులను శక్తిని ఇచ్చేది. లోకంలో అన్ని జీవులయందు ఉన్న చైతన్యము. సంకల్ప వికల్పాలు లేనటువంటిది. కేవలము సాక్షి మాత్రము అయినటువంటిది. అదే సత్యము. జ్ఞానస్వరూపము. ఆసందము అంటే - ప్రేమస్వరూపం. ప్రియము - పుత్రాదులను చూసినప్పుడు కలిగేది. మోదము - కోరుకున్నది దొరికినప్పుడు కలిగేది. ప్రమోదము - మోదము ఎక్కువగా కలగటము వీటిని మించినటువంటిది ఆనందం. అది అనిర్వచనీయము. అనుభవైకవేద్యము. అమ్మ ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటుంది. కాబట్టే సత్యజ్ఞానానందరూపా అనబడుతోంది. ఈశావాశ్యోపనిషత్తులో అంధం తమః ప్రవిశన్తి యే విద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమోయట విద్యాయాగం రతాః అవిద్యను ఆరాధించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. అనగా కర్మిష్ఠులకు మోక్షం లేదు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. ఇంకా అంధకారంలో కూరుకుపోతారు. వీటివల్ల కోరికలు తీరి ఆనందం కలిగినా, అది తాత్కాలికానందమే. ఆ ఆనందం తరువాత దుఃఖముంటుంది. కాబట్టి శాశ్వతమైన ఆనందం కావాలి అంటే కైవల్యమొక్కటే మార్గము. అదే సాయుజ్యము. బ్రహ్మను తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మమే కాబట్టి, అప్పుడు సాధకుడు పొందే ఆనందం బ్రహ్మానందము, ఈ రకంగా పిపీలికాది బ్రహ్మపర్యంతము ఒకే రకమైన ప్రేమతో ఉంటుంది. కాబట్టి ఆమె సత్యజ్ఞానానందరూపా అనబడుతోంది.

Popular