జీవి చేసిన కర్మలవల్ల పాప పుణ్యాలు వస్తాయి. వాటిని అతడే అనుభవించాలి. ఇదే కర్మ. పూర్వజన్మలలో చేసిన కర్మనే సంచితకర్మ అంటారు. దీన్ని రాబోయే జన్మలలో అనుభవించాలి. కర్మ అంతటిని ఒకేసారి అనుభవించటం జరగదు. కాబట్టి ఒక్కొక్క జన్మలో ఇంతకర్మ అనుభవించాలి అని పరమేశ్వరుడు విభజిస్తాడు. ఆ ప్రకారం ఈ జన్మలో అనుభవించవలసిన కర్మ ఎక్కుపెట్టిన బాణం లాంటిది. దాన్ని ఆపటం ఎవరివల్లా కాదు. దాన్ని అనుభవించి తీరాలి. ఇక మిగిలినది సంచితకర్మ, అంటే రాబోయే జన్మలలో అనుభవించటానికి ఉన్నది. ఇది అమ్ములపొదిలోని బాణాలవంటిది. కర్మను అనుభవించి క్షయం చేసుకోవాలంటే చాలా కష్టం. కల్పాంతంవరకూ అనుభవించినా కర్మ క్షయం కాదు. దీనికి వేరే మార్గం ఉంది. అదే పరమేశ్వరుణ్ణి ఆరాధించటం. మనసా వాచా కర్మణా పరమేశ్వరుణ్ణి గనక ఆరాధించినట్లైతే ఈ సంచితకర్మ నాశనమవుతుంది. అంటే జ్ఞానంవల్ల కర్మక్షయమవుతుంది. అందుకే అమ్మ పాపాలు అనే అడవికి దావానలం లాంటిది. దావానలం అడవిని ఏవిధంగా దహించివేస్తుందో అలాగే పరమేశ్వరి ఆరాధన సంచితకర్మను నాశనం చేస్తుంది. సంచితకర్మ అంతా జ్ఞానాగ్నిలోదహించబడుతుంది. గజేంద్రమోక్షంలో గజేంద్రుడు చివరకు చేసిన పని ఇదే.
మీకు తేలికగా అర్ధం అవ్వడానికి ఒక ఉదాహరణ. మీరు ఒక బ్యాంకులో ఖాతా తీసుకున్నారు అనుకోండి. మీరు తీసుకున్న రుణాలు మీరు జమ చేసిన సొమ్ము అంతా ఈ ఖాతాలో లెక్క వేయ బడుతుంది. ఖాతా తీసుకున్న మరుక్షణం అందులో బ్యాలన్స్ 0 ఉంటుంది. మీరు రూ. 100 /- జమ చేస్తే 100 బ్యాలన్స్ ఉంటుంది. అందులోంచి రూ.40 /- ఖర్చు పెడితే బ్యాలన్స్ రూ. 60/- కి తగ్గుతుంది.
అలాగే జీవుడు మొట్టమొదటి జన్మ మొదలయినప్పుడు అతని సంచిత కర్మ 0. ధర్మ మార్గంలో ప్రవర్తించినపుడు పుణ్యం వస్తుంది. అప్పుడు సంచిత కర్మలో పుణ్య కర్మ పెరుగుతుంది. దీని వలన సుఖాలు కలుగుతాయి. అధర్మ మార్గంలో ప్రవర్తించినప్పుడు పాపం వస్తుంది. అపుడు సంచిత కర్మలో పాప కర్మ పెరుగుతుంది. దీని వలన దుఃఖం కలుగుతుంది. సుఖం అనుభవించినపుడు పుణ్య కర్మ తగ్గుతుంది. దుఃఖం అనుభవించినపుడు పాప కర్మ తగ్గుతుంది. ఇలా మనం చేసే కర్మలను బట్టి సంచిత కర్మ పెరుగుతూ ఉంటుంది. అనుభవించే సుఖదుఃఖాలను బట్టి సంచిత కర్మ తగ్గుతూ ఉంటుంది.
ముక్తి కలగాలంటే సంచిత కర్మ 0 ఉండాలి. జన్మాన్తములో అలాగ లేనట్లయితే జీవికి ఉన్న సంచిత కర్మలోని పాపము, పుణ్యము లెక్క వేసి దానికి తగిన జన్మను ఇస్తాడు ఈశ్వరుడు. అప్పుడు జీవి మళ్ళీ పుడతాడు. మళ్ళీ కర్మలు చేస్తాడు. మళ్ళీ సంచిత కర్మ పెరుగుతుంది. సుఖదుఃఖాలను అనుభవిస్తాడు కొంత కర్మ నివృత్తి అవుతుంది. ఇక ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. సంచిత కర్మను పూర్తిగా నివృత్తి చేసి 0 లో ఉంచడం అసాధ్యం. అందుకే అమ్మను ప్రార్ధించాలి. అప్పుడు ఆవిడ ఈ కర్మను జ్ఞానమనే అగ్నిలో దహించి వేస్తుంది. అప్పుడు మోక్షం వస్తుంది.