Search This Blog

742. రంభాదివందితా

రంభాది అప్సరాంగనలచే నమస్కరింపబడేది. బ్రహ్మ పిక్కల నుంచి పుట్టినవారు అప్సరసలు. అయితే క్షీరసాగరమధన సమయంలో వీరు పుట్టారు అని భాగవతం చెబుతోంది. అప్సరసలు ఇంద్రుని కొలువులో ఉండి నృత్య గీతాదులచే దేవతలను రంజింపచేస్తుంటారు. వీరిలో

1. రంభ
2. ఊర్వశి 
3. మేనక
4. తిలోత్తమ
5, ఘృతాచి

అనేవారు ముఖ్యులు. వీరు అవివాహితులు. దేవ వేశ్యలవంటివారు. మునుల తపస్సులు పాడుచెయ్యటానికి ఇంద్రుడు వీరిని పంపుతుంటాడు. ఇటువంటి వారిచే పూజించబడునది. అంటే ఈ రకంగా ముల్లోకాలతోనూ పరమేశ్వరి పూజించబడుతుంది

ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఒక సాధకుడు ముక్తికై ధ్యానం చేయునపుడు అతని/ఆమె యొక్క మనస్సు పూర్తిగా అంతర్ముఖం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపల వారి ప్రమేయం లేకుండానే వారి మనస్సులో కొన్ని ఆలోచనలు పుడుతుంటాయి. ఈ ఆలోచనలు ఈ ప్రకృతిలోని అతి తీయని అనుభవాలనో లేదా వారి జీవితంలోని ముఖ్యమైన విషయాలనో గుర్తుచేస్తుంటాయి. ధ్యానాన్ని భగ్నం చేస్తుంటాయి. ఇది ధ్యానం చేసే వారందరికీ కలిగే ఆటంకమే. మనస్సు ఇంద్రుడు అయితే దాని ఆలోచనలు రంభ,ఊర్వశి,మేనకా. ఇంద్రియాలని కట్టేసి మనస్సును ఏకాకి చేయగానే అది భ్రమించడం మొదలుపెడుతుంది. ఆ ఆలోచనలు ప్రియురాలు ప్రేమతో ఎదో అడిగినట్టు ఉంటాయి. చలింపజేస్తాయి. విశ్వామిత్రుని కధలో జరిగింది ఇదే. అయితే అమ్మను ప్రార్ధించే వారికి ఈ ఆలోచనలనే ఆటంకం త్వరగా పోతుంది. ఎందుకంటే ఈ అప్సరసలు ఆవిడని కొలుస్తుంటారు. ఆవిడ చెప్తే వారు ధ్యాన భగ్నం కలుగజేయడం ఆపేస్తారు.

Popular