Search This Blog

717. మాయా

ప్రసిద్ధమైన పరబ్రహ్మను ప్రకటించటానికి అనుకూలమైనది మాయ. దేవీ పురాణంలో


విచిత్ర కార్యకరణా అచింతిత ఫలప్రదా
స్వప్నేంద్రజాలవ ల్లోకే మాయా తేన ప్రకీర్తితా ||


విచిత్రమైన కార్యాలు చేసేది. కోరనటువంటి ఫలాన్ని ఇచ్చేది. ఇంద్రజాలమువలె ఉండేది మాయ. పరబ్రహ్మ నుంచి బయటకు వచ్చిన శక్తే మాయ. ఈ జగత్తు అంతా మాయాశక్తితోనే నిర్మించబడుతోంది. మాయకు లలితమ్మకు తేడా లేదు.

మాయ నీటిగుంటలో తేలి ఆడే నాచువంటిది. నాచును దూరంగా తోసివేస్తే అది విడిపోతుంది. కాని మళ్ళీ వచ్చి చేరుతుంది. అలాగే వేదాంత విచారము సజ్జన సాంగత్యము చేసినంతకాలము ఈ మాయ వదలివేసినట్లుంటుంది. కాని ఆ తరువాత వెంటనే వచ్చి చేరుతుంది. అంటే విషయవాంఛలయందు మనస్సు ఎప్పుడైతే లగ్నమవుతుందో అప్పుడు మాయ ఆవరించింది అని అర్ధం. అందుకనే ధనకనకవస్తు వ్యామోహాన్ని అణిచివేస్తూ ఆధ్యాత్మిక చింతనను ప్రోత్సహిస్తుంది మన భారతీయ సంస్కృతి.

జగత్తులోని ప్రతిప్రాణీ మాయకులోబడే ఉంటుంది. పరమేశ్వరుడు ఒక్కడే మాయకు అతీతుడు. పాము కోరలయందు విషముండటం వల్ల పాముకు ఏ అపాయమూ ఉండదు. అలాగే తనను ఆవరించి ఉన్న మాయవల్ల పరమేశ్వరుడికి ఏ విధమైన ఇబ్బందీరాదు. పాము కాటు తగిలిన ప్రాణికి మాత్రం హాని కలుగుతుంది. అలాగే మాయ కూడా. మాయతో కప్పబడ్డప్పుడు, తాను మాయా ప్రభావంలో ఉన్నాను అని తెలుసుకుంటే చాలు ఆ మాయ విడిపోతుంది.

జీవాత్మ పరమాత్మల మధ్య మాయ అనే తెర ఉన్నది. ఆ తెరను తొలగిస్తే చాలు ఆత్మ సాక్షాత్కారమవుతుంది. మాయ రెండు విధాలుగా ఉంటుంది.
  1. విద్యామాయ
  2. అవిద్యామాయ.
1. విద్యామాయ భగవంతుడి సన్నిధికి తీసుకునిపోతుంది. ఇది వివేకము, వైరాగ్యము అని రెండు రకాలు. దీనిని ఆశ్రయించినవారు భగవంతుని శరణు పొందుతారు.

2. అవిద్యామాయ. ఇది అజ్ఞానము. ఇది కామక్రోధాది అరిషడ్వర్గాలు అని ఆరు రకాలు. దీనివల్లనే మానవుడికి నేను, నాది అనే బుద్ధి పుడుతుంది. దీనివల్ల అతడు సంసారానికి బందీ అవుతాడు. కానీ విద్యామాయ వ్యక్తంకాగానే అవిద్యామాయ తొలగిపోతుంది.

మురికినీటిలో సూర్యచంద్రుల ప్రతిబింబాలు కనిపించవు. అలాగే మాయ తొలగనంతవరకు అంటే నేను, నాది అనే అహంకార మమకారాలు నశించనంత వరకు ఆత్మసాక్షాత్కారం జరగదు. మాయకు ఎవరూ అతీతులుకారు.
జ్ఞానజ్యోతులతో మాయ అనే అంధకారాన్ని పటాపంచలు చెయ్యాలి.

Popular