Search This Blog

705. సరస్వతి

సరస్వతి జ్ఞానాధిష్ఠానదేవి. జ్ఞానముద్రాస్వరూపిణి. ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి గురించి చెబుతున్నారు. ఈమె విద్యాదేవత. జ్ఞానస్వరూపురాలు ద్వైతభావన నశింపచేసి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానమనేది అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుంది. దీనితో జీవులన్నీ భ్రమిస్తాయి ఆ అజ్ఞానం ఛేదించబడితే జ్ఞానసముపార్జన కలుగుతుంది. అదే ముక్తి.

మత్స్యపురాణంలో సృష్టి చెయ్యాలని బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని శరీరం నుంచి 10 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు ఉద్భవించారు. వారిలో ఆఖరుది శతరూప. ఆమె సరస్వతి అని చెప్పబడింది.

బ్రహ్మవైవర్త పురాణంలో సృష్టి కోసం రాధ తన నాలిక నుండి ఒక కన్యను ప్రసవించింది. ఆమె సరస్వతి అని చెప్పబడింది.

ఋగ్వేదంలో ఇంద్రునికి, శంబరాసురునికి యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడు కోటలోని రహస్యాలను చెప్పమని సరస్వతిని ప్రార్ధిస్తాడు. అప్పుడు సరస్వతి శంబరుని కోటలో చిక్కుకుంటుంది. అందుచేత ఆమె తన పూర్వపు ఔన్నత్యం కోల్పోయింది. కారణంగానే శుద్ధవైదికమైన సంస్కృతం ప్రాకృతంగా మారిపోయింది అని చెప్పబడింది.

ఐం అనేది వాగ్బీజము. దీనిని జపించినవారు సర్వశాస్త్ర పండితులౌతారు.

దేవీ భాగవతంలో ఒక కధ - పూర్వకాలంలో కోసలదేశంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడికి సంతానం లేదు. అందుచేత పుత్రకామేష్ఠి చెయ్యాలనుకుని తమసానదీ తీరాన యాగం ఆరంభించాడు. ఆ యాగానికి వేదవేదాంగవిదుడైన సుహోత్రుడు - బ్రహ్మ యాజ్ఞవల్క్యుడు - ఆధ్వర్యుడు, బృహస్పతి - హోత, గోబిలుడు - ఉద్గాత. యాగం ఆరంభమైంది. గోబిలుడు సామవేదాన్ని గానం చేస్తున్నాడు. దేవతలు కూడా ఆ గానానికి ముగ్ధులవుతున్నారు. కాని మధ్యలో చిన్న పొరపాటు జరిగింది. ఊపిరి పట్టటంవల్ల గోబిలుడికి స్వరం తప్పింది దాంతో కోపించిన దేవదత్తుడు గోబిలుని మూర్ఖుడా ! అని సంబోధించాడు. దానికి కోపించి గోబిలుడు “నీకు మూర్ఖుడైన కుమారుడే కలుగుతాడు" అని చెప్పి వెళ్ళిపోయినాడు. యజ్ఞం పూర్తయింది. దేవదత్తుని భార్య గర్భవతి అయింది. పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఏళ్ళు గడిచినాయి. బాలుడికి విద్యరాలేదు. పిల్లలు అందరూ ఎగతాళి చేస్తున్నారు. అది భరించలేక అడవికి వెళ్ళిపోయాయి. అక్కడ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు బాలుడు. అడవిలో ఒక వేటగాడు పందిని కొట్టి దాని వెంట పరుగెడుతున్నాడు. అది అరుస్తూపోయి ఈ బాలుడి (ఉతద్యుని) ఆశ్రమం ప్రక్క నుంచి పారిపోయింది. పంది అరిచిన అరుపు ఐం వాగ్బీజంగా వినిపించింది బాలుడికి. దాంతో అతడు 'ఐం' బీజోపాసన మొదలు పెట్టాడు. పార్వతీ పరమేశ్వరులు అతడి దీక్షకు మెచ్చి అతణ్ణి సర్వశాస్త్ర పండితునిగా అనుగ్రహించారు. కాబట్టి ఆ దేవిని అర్చిస్తే పాండిత్యం అబ్బుతుంది. వేదవేదాంగాలు ఉపనిషత్తులు సర్వశాస్త్రాలు, సంగీతము, సాహిత్యము అబ్బుతాయి.

ఈ దేవిని అర్చించటానికి జాజులు, మల్లెలు, మొల్లలు, పొగడలు, తామర, మందార, మొగలి, నల్లకలువపూలను, ఆ ఋతువులలో పూచే పూలను మాత్రమే వాడాలి. అని శారదా తిలకం చెబుతోంది. ఎర్రకలువలు, పలాశ, బిల్వపుష్పాలను తేనెతో కలిపి హవనం చేస్తే మహామేధావి అవుతాడు. బృహస్పతితో సమానమైన వాడవుతాడు. అని తంత్ర గ్రంథాలలో చెప్పబడింది. అయితే మలినమైనవి, వాడిపోయినవి, నేలమీదపడినవి, సగము విరిగినవి, పురుగులున్నవి, ఎలుకలు కొరికినవి, వెంట్రుకలతో కలసినవి, దొంగిలించిన పుష్పాలు పూజకు వాడరాదు. మధ్యాహ్నం తరువాత పూలను కోయరాదు. అని శారదాతిలకంలో చెప్పబడింది.

ఈమె చదువులతల్లి, ఈ దేవత బ్రహ్మస్వరూపిణి. బ్రహ్మను గురించి చెప్పే గ్రంథాలన్నీ కూడా సరస్వతీ రూపంలోనే పూజింపబడతాయి. ఋగ్వేదంలో సరస్వతీ సూక్తము ఉన్నది. అలాగే సరస్వతీ దేవి దశశ్లోక మహామంత్రాలున్నాయి. ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి.

వీణాధరే ! విపులమంగళదానశీలే !
భకార్తినాశినివిరించి హరీశవంద్యే !
కీర్తిప్రదేం ఖిల మనోరథదే ! మహారే !
విద్యాప్రదాయిని ! సరస్వతి ! నౌమి నిత్యమ్ ||

Popular