Search This Blog

670. అన్నదా

అన్నం జనేభ్యో దదాతి

జనులకు అన్నము ఇచ్చేది. అన్నము అంటే బియ్యంతో వండిన పదార్ధమే కాదు. జీవి బ్రతకటం కోసం తీసుకునే ఆహారం ఏదైనా అన్నమే. వేదంలో చెప్పినట్లుగా పంచభూతాలలో అఖరుగా భూమి ఉద్భవించింది. భూమి నుంచి ఓషధులు పుట్టినాయి. ఆ ఓషధుల నుంచే అన్నము వచ్చింది. ఈ రకంగా లోకంలోని జీవరాశులన్నింటికీ అన్నము నిస్తుంది. కాబట్టి ఆ దేవి అన్నదా అనబడుతోంది. యజ్ఞలు చేసేటప్పుడు అగ్నిలో ఆదిత్యుడికి ఆహుతులు అర్పించటం జరుగుతుంది. ఆ ఆహుతుల వలన సూర్యుడికి ప్రకాశం పెరుగుతుంది. దాంతో నదులు, సముద్రంలోని నీరు ఆవిరి అయిపోయి మేఘాలుగా మారుతుంది. మళ్ళీ వర్షరుతువు రాగానే ఆ మేఘాలు వర్షిస్తాయి. ఈ వర్షాలవల్ల వాగులు, వంకలు, యేరులుగా నీరు ప్రవహించి, నదులుగా మారి సముద్రంలో కలుస్తుంది. ఈ వర్షపునీటితోను, ప్రవహించే నీటితోను సాగుబడి జరిగి వంటలు పండుతాయి. ఆ పంటలవల్లనే జీవులకు ఆహారం లభ్యమవుతుంది. ఇక్కడ ఆదిత్యుని శక్తికి సావిత్రి అని పేరు. ఆమె పరమేశ్వరి స్వరూపము.  

పూర్వజన్మలలో చేసిన కర్మఫలంవల్ల ఎవరికి ఏ రకమైన ఆహారం ప్రాప్తమో అది అన్నంగా లభిస్తుంది. జీవులలో క్రిమికీటకాల మొదలు మానవులదాకా అనేకరకాలున్నాయి అని గతంలో వివరించాం. వీటికి అన్నింటికీ కూడా సమానమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవే ఆహారనిద్రా మైధునాలు. వీటన్నింటికన్న మానవుడికి ప్రత్యేకంగా ఉన్నది మనస్సు. ఆలోచనాశక్తి. ధర్మాధర్మ యుక్తాయుక్త విచక్షణ. మిగిలిన జీవులకు వేటికీ ఈ లక్షణం లేదు. అందుచేత మిగిలిన జన్మలన్నింటిలోకీ మానవజన్మ దుర్లభమైనది అని చెప్పబడింది. అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభము. ఎందుచేతనంటే, లోకంలో అనాదిగా కొంతమంది ఆధ్యాత్మిక చింతన, సత్యాన్వేషణలో కాలం గడుపుతున్నారు. వారే బ్రాహ్మణులు. అయితే వారి సంతతి సత్యాన్వేషణ చెయ్యకపోయినప్పటికీ, వారికి ఆ లక్షణాలు కొన్ని వంశానుగతంగా లభ్యమవుతాయి. అందుచేత మిగిలినవారి కన్న బ్రహ్మను గురించిన పరిజ్ఞానము వారికి ఎక్కువ ఉంటుంది. అందుచేత యుక్తాయుక్త విచక్షణ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టే బ్రాహ్మణజన్మ మరీ దుర్లభమని చెప్పబడింది.

జీవులకుండే లక్షణాలు కొన్ని ఉన్నాయి. అందులో మానవుడికి ఉండేవి 33. అవి

సప్తధాతువులు 7 
ఇంద్రియాలు 10 
ప్రాణాలు 5 
మానసిక ప్రవృత్తులు 11 
వెరసి 33

ఈ 33 లక్షణాలు గలవాడే మానవుడు. మిగిలిన జీవులకు ఈ లక్షణాలు ఒకటొకటి తగ్గుతూ ఉంటాయి. ఈ లక్షణాలను బట్టే ఇది మృగమని, పశువని, పక్షిఅని, క్రిమిఅని, కీటకము అని నిర్ణయించటం జరుగుతుంది. స్థావర జంగమాత్మకమైన జగత్తులో మొత్తం 84 లక్షల జీవరాసులున్నాయి. వాటిలో

స్థావరములు 20 లక్షలు 
మృగాలు 30 లక్షలు 
క్రిములు 11 లక్షలు 
పక్షులు 10 లక్షలు 
జలచరాలు 9 లక్షలు 
మానవులు 4 లక్షలు 
వెరసి 84 లక్షలు
జీవులు అన్నింటికీ ఒకటే ఆహారంకాదు. ఎక్కువ లక్షణాలు గల జీవులు, తక్కువ లక్షణాలు గల వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇది ప్రకృతి సహజము కాని మానవుడు జగత్తులోని అన్ని పదార్దాలను ఆహారంగా తీసుకుంటాడు.

విజ్ఞుడైనవాడు కేవలము శాఖాహారం మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. అయితే శాఖాహారంలో కూడా సత్వరజస్తమోగుణాలు గల పదార్ధాలున్నాయి. ఆహారంలోని సూక్ష్మాంశ భోక్త యొక్క మనస్సుగా మారుతుంది. అందుకని తీసుకునే ఆహారాన్ని బట్టి మనస్సు యొక్క ప్రభావము, ప్రవృత్తి ఉంటాయి. అందుకే పవిత్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీటిలో

రాజసాహారంవల్ల - మనోచాంచల్యం కలుగుతుంది. 
తామసాహారం వల్ల - నిద్ర ఎక్కువ అవుతుంది 
కాబట్టి సాత్వికాహారమే శ్రేష్ఠము.
అయితే మనం తీసుకునే ఆహారం ఏవిధంగా వచ్చింది అనే దానిమీద కూడా ఉపాసకుడికి ఫలితము వస్తుంది. ఎవరైనా దానం చేసిన పదార్థాలు తింటే, మన ఉపాసన ఫలం కొంతవారికి చెందుతుంది. అన్యాయార్జితమైన ఆహారం తింటే, దాని ఫలితం కూడా అనుభవించాలి. అందుచేత కష్టపడి సంపాదించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

ఈశావాశ్యోపనిషత్తులోని మొదటి మంత్రంలో

ఈశావాస్య మిందగ్ం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథాః మా గృఢః కస్యస్విద్ ధనమ్
అనిత్యమైన ఈ ప్రపంచంలో పరివర్తనాశీలమైనది ఏదైతే ఉన్నదో అదంతా పరమేశ్వరుడిచే ఆవరించబడి ఉన్నది. ఈ ఐశ్వర్యము నిత్యముకాదు. అశాశ్వతమైన వాటి మీద కోరికలు వదలిపెట్టు. ప్రాపంచిక సుఖాలను పరిత్యజించు. ఇతరుల ధనాన్ని ఆశించకు. ఇతరులమీద ఆధారపడకు అని చెప్పబడింది. అంటే నీకు కావలసిన ధనం నువ్వే సంపాదించుకో అంతేకాని ఎవరినీ యాచించవద్దు అంటోంది. ఈ రకంగా కష్టపడి సంపాదించిన ధనంతోనే ఫలితం ఎక్కువ వస్తుంది. అది కూడా మంచి పనిచేసి ధనార్జన చెయ్యాలి. అలా సంపాదించే ఆహారం కూడా దోషరహితంగా ఉండాలి.

దోషాలు మూడురకాలు.

జాతిదోషము - ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి పంటలు ఈ రకమైనవి
అశ్రయదోషము - పాలు సాత్వికమైన ఆహారము. కాని రాగి గిన్నెలో పోస్తే దోషము. 
నిమిత్త దోషము - స్మశానంలో పండించినవి, మలమూత్రాదులతో కలిసిన మురుగు నీటితో పండించిన పంటలు.

Popular