కోరిక మరియు ప్రయత్నం రెండు కలిస్తే 'కర్మ'. కోరిక లేకుండా ప్రయత్నిస్తే 'కర్మ ' అవ్వదు. నిస్వార్ధ సేవ అవుతుంది. కర్మను వేదవిధితో అనుసంధానం చేస్తే సంకల్పం అవుతుంది. యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, వ్రతాలు హోమాలు ఇందుకొరకే చెప్పబడ్డాయి. మనస్ఫూర్తిగా కోరుకుని వేదంలో చెప్పనట్లు చేస్తే సంకల్ప సిద్ధి లేదా కర్మ ఫలం లభిస్తుంది. కోరిక నెరవేరుతుంది. సంతృప్తిగా ఉంటుంది.
కర్మఫలం అనుభవించాక ఇంకో కోరిక కలుగుతుంది. మళ్లీ ప్రయతించాలి. వేద విధితో అనుసంధానం చేయాలి. మళ్లీ సంకల్పం జరుగుతుంది. కోరిక నెరవేరుతుంది. సంతృప్తి కలుగుతుంది. కర్మ ఫలాన్ని అనుభవిస్తాము. మళ్ళీ కోరిక కలుగుతుంది. ఇలా కర్మ బంధం మనల్ని తిప్పుతూనే ఉంటుంది.
కోరిక కలిగించేది అమ్మే. అదే ఇచ్చాశక్తి. ఆ కోరిక ఎలా తీర్చుకోవాలో చెప్పేది అమ్మే. అదే జ్ఞాన శక్తి. దానికి సరిపడా శక్తినిచ్చేది అమ్మే. అదే క్రియ శక్తి. కర్మ ఫలాన్ని అనుభవించినంత కాలం మనం ఈ ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తులలోనే తిరుగుతూ ఉంటాము.
ఇందులోంచి బయట పడటానికి అత్యంత సులభమైన మార్గం కర్మఫల త్యాగం. సంకల్పం నెరవేరిన తరువాత వచ్ఛే ఫలితాన్ని త్యాగం చేస్తే మళ్ళీ కోరిక కలగదు. అప్పుడు మనం ఈ క్షణభంగురం నుంచి బయట పడతాము. అప్పుడు మన నిజస్వరూపం ఆనందమని తేలుకుంటాము. అది ఎలాగో ఈ క్రింద వివరం చదివి తెలుసుకోండి.
మానవులు సహజంగానే ఆనంద స్వరూపులు. ఆత్మ సౌందర్యాన్ని ఆస్వాదించేవారు. ఎప్పుడైతే మనస్సులో ఒక కోరిక కలుగుతుందో అప్పుడు అది ఆత్మను మరచి బయట ప్రపంచంవైపు దృష్టి మళ్ళిస్తుంది. అప్పుడు ఆత్మకు మనస్సుకు మధ్య దూరం పెరుతూగుంది. ఆత్మనుండి దూరం పెరిగింది కనుక ఆనందం తగ్గిపోతుంది. పైన చెప్పిన విధంగా ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తులతో వేదవిధానాలతో సంకల్పం నెరవేరుస్తాము. అప్పుడు మనస్సు మళ్ళీ ఆత్మవైపు వెళ్లడం మొదలుపెడుతుంది. ఆత్మకు మనస్సుకు దూరం తగ్గుతుంది. ఆనందం కలుగుతుంది. కానీ మనస్సు ఇంకా బయట ప్రపంచాన్నే చూస్తోంది కనుక అది కోరిక తీరడం వలన ఆనందం కలుగుతోంది అని భ్రమ పడుతుంది. ఆత్మకు చేరువయ్యే లోపే వెంటనే ఇంకో కోరిక బయలు దేరుతుంది. ఇది వికల్పం. మళ్ళీ ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తులతో వేదవిధానాలతో సంకల్పం నెరవేరుస్తాము. ఇలా క్షణభంగురంలో చిక్కుకు పోతాము. అందుకుకే మనస్సును సంకల్ప-వికల్ప సంఘాతం అంటారు. కర్మఫలత్యాగము దీనికి విరుగుడు.
కోరికలు తీర్చుకోవద్దు అని వేదంలో ఎక్కడా చెప్పలేదు. కోరికలు తీర్చుకోవడం కోసమే ఇన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞాలు మొదలైనవి ప్రతిపాదించారు. కానీ అవి క్షణికాలు అని తెలుసుకుని, ఈ క్షణభంగురంలోంచి బయట పడటానికి ఉపయోగించాలి. బాగా ఆకలి వేసినప్పుడు మంచి దోస తినాలి అనిపించిందనుకోండి. మీరు ధర్మబద్ధంగా ఆర్జించిన విత్తంతో కావలిసినన్ని దోశలు తినండి. కానీ కడుపునిండి తృప్తిచెందాక మిగిలిన దోశలు లేని వారికి దానం చేయండి. కష్టపడి సంపాదించిన డబ్బుతో నెల ఖర్చులు పోగా మిగిలిన డబ్బు ఏ అన్నదాన సత్రంకో లేదా వేరే ఏదైనా నిస్వార్థ సేవకో వెచ్చించండి. అలా చేస్తూ అమ్మను క్షణభంగురం నుంచి తప్పించమని అర్ధించండి. మీరు తప్పక తరిస్తారు.