Search This Blog

642. ధ్యానగమ్యా

ధ్యానముచేత ఎరుగబడినది. వేదంలో ధ్యానయోగము చేత దేవతా శక్తిని పొందవచ్చును అని చెప్పబడింది. పరమేశ్వరిని పూజించటము, స్తోత్రం చెయ్యటమువల్ల కాకుండా నిశ్చలమైన మనస్సుతో ధ్యానించటంచేత మాత్రమే పొందదగినది ఆ పరమేశ్వరి. అందుచేతనే ధ్యానగమ్యా అనబడుతుంది. భగవంతుడు సత్యజ్ఞానస్వరూపుడు. అనంతుడు, అవ్యయుడు. వీటికి భిన్నమైనవాడు జీవి. పరమాత్మ - జీవాత్మల మధ్య భేదాలు

పరమాత్మ -    జీవాత్మ
సత్యము -      అసత్యము
శాశ్వతము -   అశాశ్వతము
అనంతము - అంతముగలది
జ్ఞాని -             అజ్ఞాని
శాశ్వతమైన ఆనందము - క్షణికానందము

ఈ రకంగా జీవాత్మ పరమాత్మలు భిన్న ధృవాలు. అయితే జీవుడు అవిద్యను వదిలి, తానే పరబ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు అతడే పరబ్రహ్మ అవుతాడు. అజ్ఞాని అయిన జీవి ధ్యానము ద్వారా గాని, ఇంకొక మార్గం ద్వారా కాని పరమాత్మ దర్శనం చేసుకోలేదు. ఇది కేవలము జ్ఞానంద్వారానే జరగాలి. బ్రహ్మను గురించి తెలుసుకోవటం బ్రహ్మద్వారానే జరుగుతుంది. ధ్యానం చెయ్యాలంటే ఇద్దరికీ ఒకే లక్షణాలుండాలి. ధ్యానం కాని ఇంకొకటిగాని చేసి పరమాత్మను చేరలేడు. జ్ఞాని మాత్రమే ఆ పని చెయ్యగలడు. అందుచేతనే పరమేశ్వరి భక్తులను కనికరించాలనే ఉద్దేశ్యంతో సగుణ బ్రహ్మను ఏర్పరచింది. ఆ సగుణ బ్రహ్మయే భగవంతుడు. సాధకుని యొక్క కోరిక మేరకు భగవంతుడికి రూపం కల్పించబడింది.

సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనా

భంగవంతుడికి ఆరు లక్షణాలుంటాయి. అవి
1. సర్వజ్ఞత
2. అనాదిబోధ
3. అనంతత
4 నిత్యతృప్త
5. స్వతంత్రత
6. అలుప్తత

వీటిని గతంలో వివరించటం జరిగింది. ఈ లక్షణాలు జీవిలో కూడా ఉంటాయి. కాని అవి అతని అజ్ఞానం వల్ల బయటకు కనపడవు. ఈ అజ్ఞానం గనక వదలినట్లైతే, జీవికి భగవత్సాక్షాత్కారము జరుగుతుంది. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తుల బలం తగ్గి విజ్ఞానం పెరిగితే, జీవి తానే భగవత్స్వరూపుడనని తెలుసుకుంటాడు. దీనికి సగుణోపాసనే సాధనము.

ధ్యానము అంటే - విషయాన్ని ధారణచేసే స్థలంలో బుద్ధిని స్థిరంగా ఉంచటము. మళ్ళీ ధ్యానము రెండు రకాలు 1. సగుణ ధ్యానము 2. నిర్గుణ ధ్యానము. ధ్యానంలో ఒక ముఖ్యసూత్రం గుర్తుంచుకోవాలి. ఏ దేవతనైతే అర్చిస్తామో, అదే రూపాన్ని మనం కూడా పొందుతాము. అంటే ఆ రూపం పూర్తిగా మనకు రాకపోయినా, దాని లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి. అందుచేతనే సగుణ బ్రహ్మను ఆరాధించేవారికి ఆ దేవత లక్షణాలే వస్తాయి. మరి నిర్గుణ బ్రహ్మోపాసన చేసేవారికి నిర్గుణత్వం, నిరాకారత్వం వస్తుంది. అదే సాయుజ్యం. అంటే నిరాకార అయిన పరమేశ్వరిని ధ్యానం చేస్తే మోక్షం కలుగుతుంది.

Popular