Search This Blog

584. ఆత్మవిద్యా

ముడిపదార్ధం గురించి మనకు తెలిసినట్లైతే ఆ పదార్ధంతో తయారయిన వస్తువుల గురించి తేలికగా తెలుస్తుంది. ఉదాహరణకు మట్టిని గురించి తెలిస్తే, మట్టితో తయారుచేసే కుండలు, బాబాసలు, చట్లు, మొదలైన వస్తువులగురించి తెలుస్తుంది. అలాగే బంగారం గురించి తెలిస్తే దానితో తయారుచేసే నగల పేర్లు వేరయినా, వాటన్నింటిలో ఉండేది బంగారమే అని తెలుస్తుంది. అదే విధంగా ఏ విషయం తెలుసుకోవటంవల్ల సర్వమూ తెలుస్తాయో, దాన్ని తెలుసుకోవాలి. ప్రతివిషయంలోనూ అంతర్గతంగా ఉండే తత్త్వాన్ని గనక తెలుసుకుంటే మిగిలిన విషయాలన్నీ తెలుస్తాయి.

ఆత్మవిద్యయే శ్రీవిద్య. అదే మహాషోడశి అని చెప్పి 583 నుంచి 589వ నామం వరకు ఆత్మవిద్యను వివరిస్తున్నారు.

ఆత్మజ్ఞానరూపత్వాత్ ఆత్మవిద్యా 
ఆత్మ జ్ఞాన రూపము గలది కావటంచేత ఇది ఆత్మవిద్య అనబడుతుంది. అసలు ఆత్మ అంటే ఏమిటి?

ఐతరేయోపనిషత్తులో పరమేశ్వరుడు పూర్వకల్పంలో
ఏ విధంగా అయితే సృష్టి ఉన్నదో, అదే విధంగా మళ్ళీ సృష్టి చెయ్యాలి అని సంకల్పించాడు. లోకాలను సృష్టించాడు. లోక పాలకులను సృష్టించా    డు. ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను
సృష్టించాడు. చివరకు విరాడ్రూపాన్ని పోలిన మానవుణ్ణి సృష్టించాడు. ఇప్పుడు పరమేశ్వరుడు మానవదేహంలో ప్రవేశించాలి అనుకున్నాడు. అలా ప్రవేశించటానికి రెండు మార్గాలున్నాయి. 1. పై నుంచి (శిరస్సు నుంచి) 2. క్రింద నుంచి (పాదాల దగ్గర నుంచి) పాదాల దగ్గర నుంచి ప్రవేశించటమనేది సేవకా లక్షణం. అందుచేత పరమాత్మ శిరస్సునుంచే మానవదేహంలో ప్రవేశించాడు. అదే ఆత్మ. అని చెప్పబడింది. హకార సంజ్ఞగల పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగిన ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై నవరంధ్రాలతోనూ, దశేంద్రియాలతోనూ కూడినటువంటి మానవదేహంలో
ప్రవేశించి, బయటకు వెళ్ళే మార్గం తెలియక పంజరంలో బంధించబడిన పక్షిలాగా కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదే జీవాత్మ. ఈ జీవాత్మ గనక వచ్చిన దారిగుండానే బయటకు వెళ్ళగలిగినట్లైతే పరమాత్మలో లీనమవుతుంది. అంటే ఆత్మను బ్రహ్మరంధ్రంగుండా గనక బయటకు పంపగలిగినట్లైతే అది పరమాత్మలో లీనమవుతుంది. 

తైత్తిరీయోపనిషత్తులో వరుణమహర్షి కుమారుడు భృగుమహర్షి. విద్యాభాసం పూర్తిచేసి ఆత్మవిద్యను బోధించమని తండ్రిని అడుగుతాడు. ఈ విషయమంతా గతంలో పంచకోశాంతర స్థితా అనే నామంలో వివరించటం జరిగింది. 

బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి ఒకసారి ఆత్మను గురించి ఒక ప్రకటన చేశాడు. “ఆత్మకు పాపం అంటదు. ముసలితనం రాదు. మృత్యువు దాన్ని కబళించదు. శోకం తాకదు. ఆత్మకు ఆకలిదప్పికలు లేవు. మానవుడు సత్యకాముడు సత్యసంకల్పుడు అయి ఆత్మజిజ్ఞాసను అలవరచుకోవాలి. ఆత్మకోసం అన్వేషించినవాడు, ఆత్మను
అనుభవించిన వాడు ఆత్మ స్వరూపాన్ని పొందుతాడు.

ఈ మాట విని దేవతల రాజైన ఇంద్రుడు, రాక్షసరాజైన విరోచనుడు బ్రహ్మదగ్గరకు వచ్చి ఆత్మవిద్యను పొందేటందుకుగాను, ఆయనకు శిష్యరికం చేస్తారు. విరోచనుడు దేహమే ఆత్మ అనుకుని వెళ్ళిపోతాడు. కాని ఇంద్రుడు మళ్ళీ, మళ్ళీ బ్రహ్మచర్యమవలంబిస్తాడు. చివరకు ఇంద్రునిపట్టుదలకు మెచ్చి బ్రహ్మ ఆత్మతత్త్వాన్ని పూర్తిగా వరించాడు. శరీరం అశాశ్వతమైనది. ఆఖరు క్షణాలు రాగానే మృత్యువు శరీరాన్ని కబళిస్తుంది. శాశ్వతమైన ఆత్మకు అశాశ్వతమైన శరీరమే ఆవాసం. శరీరంలో ఉన్నంతకాలమూ ఆత్మకు సుఖదు:ఖాలు, గుణదోషాలు అంటినట్లు, వాటితో శతమతమవుతున్నట్లు కనిపిస్తుంది. ఆత్మ శరీరంతో సంబంధం ఏర్పరచుకోవటంవల్లనే జీవులకు సుఖదుఃఖాలు ఏర్పడతాయి. శరీరం నుంచి విడిపోగానే ఆత్మకు ఈ బంధనాలతో సంబంధముండదు. భౌతిక విషయాలనుండి విముక్తి పొంది, ఆత్మను మనస్సుకు, ఇంద్రియాలకు విలక్షణమైనదిగా గ్రహించి ఆత్మ తేజోమయము అని భావించి అనుభవజ్ఞుడు ఆనందిస్తాడు. ఆత్మజ్ఞానం పొందినవాడు ముక్తి సామ్రాజ్యంలో విహరిస్తాడు. అని చెప్పబడింది. 

కఠోపనిషత్తులో వాజశ్రవుడు 'విశ్వజిత్' అనే యాగం చేస్తూ, దానిలో భాగంగా తనకుమారుడైన నచికేతుణ్ణి యమధర్మరాజుకు దానమిస్తాడు. నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళేసరికి అతడు ఇంట్లో లేడు. అందుచేత మూడు రోజులపాటు యముడు తిరిగి వచ్చేదాకా అతని ఇంటనే నిరాహరియై ఎదురుచూస్తూ కూర్చున్నాడు. యముడు తిరిగి వచ్చి, విషయం తెలుసుకుని, నచికేతుడికి మూడు వరాలిస్తాను కోరుకోమంటాడు. అందులో మూడవ వరంగా ఆత్మజ్ఞానం ఉపదేశించమని అడుగుతాడు నచికేతుడు. చివరకు యముడు నచికేతుడికి ఆత్మజ్ఞానాన్ని వివరిస్తాడు.

“ఆత్మజ్ఞానం అనే పదం వినటానికి కూడా చాలామందికి అర్హత ఉండదు. అందుకే వాళ్ళు దానికి ఇష్టపడరు. కొందరికి ఇది విన్నా అర్ధం కాదు. దీన్ని గురించి చెప్పే గురువు దొరకటం కూడా చాలా విశేషం. బ్రహ్మజ్ఞానం పొందిన గురువుద్వారా ఈ విషయాన్ని
తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతం. అంటూ ప్రారంభించి...
ఆత్మసాక్షాత్కారమనేది వేదాలు వల్లించటం వల్ల, శాస్త్రాలు చదవటంవల్ల, ధారణశక్తివల్ల, ఉపన్యాసాలు వినటంవల్ల, ఉపదేశించటంవల్ల లభించదు. అది ఆత్మవల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అర్హుడైన వ్యక్తికి ఆత్మ తన నిజస్వరూపం చూపుతుంది.

ఆత్మ అనేది సూక్ష్మమైన బుద్ధిచేత మాత్రమే గ్రహించబడుతుంది. ఆత్మసర్వవస్తువులందు ఉన్నది. కాని పైకి కనపడదు. శబ్దము, రూపము, రసము, వాసన లేనిది, ఆద్యంతాలు లేనిది, అయినటువంటి ఆత్మతత్త్వాన్ని తెలుసుకున్నవాడు మృత్యువాత పడదు. అని చెబుతాడు.

ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతువు. విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆత్మవిద్యను తెలుసుకోవాలనీ, దాన్ని వివరించమని తండ్రిని అడిగాడు. చెప్పటం మొదలుపట్టాడు.ె ఉద్దాలకుడు.నదులు తూర్పునుంచి పడమరకు ప్రవహించినా, పడమర నుంచి తూర్పుకు ప్రవహించినా చివరకు అవి సముద్రంలోనే కలుస్తాయి. సూర్యరశ్మికి నీరు ఆవిరి అయి మేఘాలుగా మారి కొండలమీద వర్షం కురిసి, వాగులుగా, ఏరులుగా, నదులుగా
ప్రవహించి చివరకు సముద్రంలో కలుస్తుంది. నీరు ప్రవహించేటప్పుడు ఇది గంగానది, ఇది డొంకవాగనీ, ఇది బుడమేరు అని రకరకాల పేర్లతో పిలువబడుతుంది. కాని సముద్రంలో చేరగానే నదులకు, వాగులకు అన్నింటికీ వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఇంక ఉండదు. అలానే జీవి అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ, చైతన్య సముద్రంలో కలిసిపోయాక తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. ఈ రకంగా జీవులన్నీ ఏ తత్త్వంలో కలిసిపోతాయో, అదే ఆత్మ తత్త్వం. అది అద్వితీయమైనది, సూక్ష్మమైనది, సర్వవ్యాపకమైనది. అదే నీవు తత్త్వమసి శ్వేతకేతూ అదే నీవు. 

అదే విధంగా ఉపకోశలుడికి అగ్నులు ఆత్మ తత్త్వాన్ని వివరిస్తాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు అన్నీ ఆ పరబ్రహ్మ యొక్క రూపాలే, ఆకాశంలోని సూర్యునిలో ఏ తత్త్వమైతే ఉన్నదో అదే నాలోనూ, నీలోనూ కూడా ఉన్నది. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు, నేల, నీరు, నింగి, ఆకాశము, నక్షత్రాలు వీటన్నింటిలో ఉన్నతత్త్వం ఒక్కటే. ఆకాశంలోని మెరుపులో ఏ తత్త్వమైతే ఉన్నదో, అదే నాలోనూ ఉన్నది. అదే చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. అదే ఆత్మతత్త్వం. అదే బ్రహ్మతత్త్వం.

సనత్కుమారుడు నారదుడికి ఉపదేశించిన భూమా విద్య అంతా ఆత్మవిద్యే. ఈ రకంగా ఆత్మ విద్యను గురించి ఉపనిషత్తులన్నింటిలోనూ వివరించబడింది. పరబ్రహ్మను గురించిన జ్ఞానమే ఆత్మజ్ఞానము. ఆత్మవిద్యయే బ్రహ్మవిద్య, ఆత్మవిద్య కలది కాబట్టి పరమేశ్వరి ఆత్మవిద్యా అనబడుతోంది.

Popular