Search This Blog

423. ద్విజబృందనిషేవితా

ద్విజులు అంటే రెండు జన్మలు గలవారు. బ్రహ్మక్షత్రియవైశ్యులు. వీరిచే పూజించబడునది. రేణుకాపురాణంలో “సంధ్యాదేవి దేవతలచేత, ద్విజులచేత మహాత్ములచేత కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, సర్వకాల సర్వావస్థలయందు పూజించబడుతుంది" అని చెప్పబడింది.

సంధ్యాదేవి యొక్క ప్రాముఖ్యతనే ఇంకా వివరిస్తున్నారు. బ్రహ్మక్షత్రియ వైశ్యులు త్రికాలములందు సంధ్యాదేవిని ఉపాసనచేస్తారు. కాబట్టి ద్విజబృందనిషేవితా అనబడుతుంది. వీరికి ఉపనయన సంస్కారము జరుగుతుంది. ఆ తరువాతనే బ్రహ్మవిద్యకు అర్హత వస్తుంది. కాబట్టి బ్రహ్మవిద్యకు అర్హత పొందటానికి సంధ్యాదేవిని ఉపాసించాలి.

అసలు బ్రహ్మక్షత్రియవైశ్యులను ద్విజులని ఎందుకంటారు? శూద్రులను ఎందుకలా పిలవరు? రెండు జన్మలు ఎలా వస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ క్రింద వివరణలో తెలుసుకోండి.

జన్మచే అందరూ శూద్రులే. శూద్రులకు ధర్మాధర్మ విచక్షణ అంతగా తెలియదు. బాల్యంలో మనమందరం అంతే కదా! అందుకే జన్మచే అందరూ శూద్రులే. బాల్యావస్థ పూర్తి అయ్యే సమయానికి (అంటే 8 ఏళ్లు) మనిషిలో కొంత పరివర్తన మొదలవుతుంది. లింగ భేదం అవగతమవుతుంది. పిల్లలు సిగ్గు బిడియం వంటివి ప్రదశించడం జరుగుతుంది. సభ్య సమాజంలోను, కుటుంబంలోను వారి స్థానం ఏమిటో తెలుసుకుంటారు. అంటే క్రమేపి నేను ఫలానా అనే గుర్తింపు బలపడి తద్వారా నేను అనే అహంకారం వేళ్లూనుకొని విస్తరితోంది అన్నమాట.

మానుషలందరికి పూర్వ జన్మ వాసనలు ఉంటాయి. ఈ వాసనలు మూడు రకాలు. అవి 1.జ్ఞాన 2.దేహ 3.లౌక్య. మనం చేసే ప్రతీ కర్మలోను ఈ వాసనల ప్రభావం ఉంటుంది. అంతే కాదు. ఆ కర్మ వలన ఈ వాసనలు మరింత బల పడుతూ ఉంటాయి. ఇదే గమ్మత్తు. వాసన వలన కర్మ మళ్ళీ తిరిగి కర్మ వల్ల వాసన ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఇలా ఒక జన్మ గడిచిన తరువాత, చేసిన కర్మల యొక్క వాసనలు మళ్ళీ తరువాతి జన్మలో కొనసాగుతూ ఉంటాయి. వాసన నీడ అయితే కర్మ శరీరం. కర్మ అనే ఈ శరీరానికి అహంకారం ప్రాణం. ప్రాణం లేనిచో శరీరం లేదు. శరీరం లేనిచో నీడ లేదు. వీటికి ఇటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. అందరూ దొంగలే అందుకే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.

బాల్యావస్థ దాటిన పిదప క్రమేపి అహంకారం బలపడుతుంది అని మనం పైన చెప్పుకున్నాం. అందుకని తల్లిదండ్రలు ఆ పిల్లవాడికి గురువులచే ఉపనయయం చేయిస్తారు. ఆ తంతులో గురువులు అతని వాసనా బలాన్ని పసికట్టి తల్లి దండ్రులకు చెబుతారు. గురువుల ఉపదేశము బట్టి తల్లిదండ్రులు పిల్లవాడి భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేసుకుంటారు.

బ్రాహ్మణుడిగా ప్రసిద్ధికెక్కాలంటే బలమైన జ్ఞాన వాసన కలిగి ఉండాలి. వాక్కు ద్వారా దీన్ని పసిగడతారు. అందుకే బ్రాహ్మణులు విష్ణువు ముఖము నుంచి వచ్చారు అని అంటారు. ఈ జ్ఞాన వాసనతో బ్రాహ్మణులు గురువుల వద్ద శిష్యరికం చేసి సకల శాస్త్రాలు అభ్యసిస్తారు. లోకానికి ధర్మ బోధ చేస్తారు. యజ్ఞ యాగాది క్రతువులు, పూజాది కర్మలు నిర్వహిస్తారు. తాము శ్రమించి సంపాదించిన వేద విజ్ఞానాన్ని లోకానికి అందిస్తారు.

క్షత్రియడిగా ప్రసిద్ధికెక్కాలంటే బలమైన దేహ వాసనా, కొంత లౌక్య వాసనా ఉండాలి. ఇది పిల్లవాడి భుజ బలం, గుండె ధైర్యం, వ్యవహారం బట్టి తెలుస్తుంది. అందుకే క్షత్రియులు విష్ణువు భుజములనుంచి వచ్చారు అంటారు. ఈ వాసనలతో క్షత్రియులు ఒక క్షేత్రం ఏర్పాటు చేసుకుని అందులో ధర్మాన్ని రక్షించే బాధ్యతను స్వీకరిస్తారు.

వైశ్యుడిగా ప్రసిద్ధికెక్కాలంటే బలమైన జ్ఞాన వాసనా, బలమైన లౌక్య వాసన ఉండాలి. ఇది పిల్లవాడి ఆలోచన, వ్యవహారం బట్టి తెలుస్తుంది. ఈ వాసనా బలంతో వారు వర్తక వాణిజ్యాలను పెంపొందించి పలువురికి జీవనోపాధి కలిపిస్తారు. వైశ్యులది పోటీ ప్రపంచం. అందుకే వారి వ్యవహారంలో కొంత గోప్యత కనబడుతుంది. అందుకే వైశ్యులు విష్ణువు యొక్క తొడలనుండి వచ్చారు అంటారు. తొడలు మన శరీరంలో అత్యంత రహస్యమైన ప్రదేశం కదా.

పిల్లవాడి వాసన బట్టి గురువులు అతనికి ఉపనయనం చేస్తారు. తద్వారా అతని వర్ణం మారిపోతుంది. అప్పటిదాకా శూద్రుడిగా ఉన్న బాలుడు బ్రాహ్మణుడిగానో, క్షత్రియుడిగానో, వైశ్యుడిగానో గురువుల దగ్గర శిక్షణ మొదలు పెడతాడు. వర్ణం మారింది కాబట్టి అక్కడి నుంచి రెండవ జన్మ మొదలైందని అర్ధం. అందుకే ద్విజుడు అనే పేరు వచ్చింది. ఇటువంటి వాసనా బలములు లేని పిల్లలు శూద్రులు గానే ఉండిపోతారు. వారికి ఓర్పు ఎక్కువ ఉంటుంది. కర్షకులుగా జీవనం గడుపుతారు. అందుకే విష్ణువు పాదములనుండి వచ్చారు అని అంటారు.

మనిషిలోని వాసన బలాన్ని ధర్మ సంస్థాపన మరియు పరిరక్షణ కొరకు వినియోగించడమే ఉపనయన ప్రక్రియ యొక్క ముఖ్యోద్దేశ్యం. అంతే తప్ప సంఘాన్ని విభజించి వివాదాలకు పునాదులు వేయడం కాదు. మనకు సహజంగా వచ్చిన ప్రతిభను గుర్తించి ఆ దిశలో శిక్షణ ఇప్పిస్తే మంచి సమర్థులుగా తీర్చిదిద్దబడతాము. అందుకే ఈ ఉపనయన ప్రక్రియ వచ్చింది.

దేవుని దృష్టిలో చాతుర్వర్ణాలలో ఎవ్వరూ తక్కువ కాదు. మోక్షపదంలో అందరికన్నా ముందుండేది శూద్రులే. ఎందుకంటే వారికి బలమైన వాసనలు లేవు, కనుక బలమైన అహంకారం ఉండదు. అందుకని చాలా సులువుగా అహాన్ని జయించి దేవుణ్ణి చేరుకో గలరు.

Popular